క్రెడిట్ కార్డులకు అనూహ్యంగా పెరుగుతోన్న డిమాండ్...

ABN , First Publish Date - 2020-12-18T00:57:47+05:30 IST

దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ నేపధ్యంలో ఏప్రిల్‌లో రెన్యువల్ లేకపోవడంతో ఆ నెలలో గణనీయంగా తగ్గిపోయిన క్రెడిట్ కార్డుల సంఖ్య... దశల వారీగా అన్‌లాక్‌ మొదలైన తర్వాత మళ్లీ జారీ మొదలవడంతో సెప్టెంబరు, అక్టోబరు నాటికి భారీగా పెరిగిపోయింది. గతేడాది అక్టోబరుతో పోల్చుకుంటే... ఈ ఏడాది అక్టోబరులో నెలవారి క్రెడిట్ కార్డు దరఖాస్తులు మించిపోయాయి.

క్రెడిట్ కార్డులకు అనూహ్యంగా పెరుగుతోన్న డిమాండ్...

ముంబై : దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ నేపధ్యంలో ఏప్రిల్‌లో రెన్యువల్ లేకపోవడంతో ఆ నెలలో గణనీయంగా తగ్గిపోయిన క్రెడిట్ కార్డుల సంఖ్య... దశల వారీగా అన్‌లాక్‌ మొదలైన తర్వాత మళ్లీ జారీ మొదలవడంతో సెప్టెంబరు, అక్టోబరు నాటికి భారీగా పెరిగిపోయింది. గతేడాది అక్టోబరుతో పోల్చుకుంటే... ఈ ఏడాది అక్టోబరులో నెలవారి క్రెడిట్ కార్డు దరఖాస్తులు మించిపోయాయి.


క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ప్రకారం చిన్న పట్టణాలు, నాన్-మెట్రో సిటీల నుంచి క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే... ఈ ఏడాది మెట్రో నగరాల్లో మాత్రం క్రెడిట్ కార్డుల నమోదులో అంతగా వృద్ధి నమోదు కాలేదు.


ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో ఎస్‌బీఐ మొత్తం 4.6 లక్షల కార్డులను జారీ చేసిందని, అదే సమయంలో ప్రైవేటు రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 4.8 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంక్ 1.6 లక్షల కార్డులను జారీ చేసినట్లు ఆర్‌బీఐ డేటా వెల్లడించింది. 


కోవిడ్-19 లాక్‌డౌన్ చర్యలను సడలించినప్పటి నుండి వినియోగదారుల ఆర్థిక వ్యవహారాల్లో కొంత పెరుగుదల కనిపించడమే ఇందుకు ఓ కారణంగా ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వైస్ ప్రెసిడెంట్ అభయ్ కేల్కర్ తెలిపారు.


మరోవైపు లాక్‌డౌన్ కారణంగా అన్నిరంగాల్లో ఆర్థిక అస్థిరత్వం,   ఉద్యోగాలు కోల్పోవడం, స్వయం ఉపాధిపై ఆధారపడి జీవనాధారం కొనసాగిస్తున్న వారు కూడా బతుకుదెరువు కోల్పోవడం వంటి పరిస్థితులు ఆయా వర్గాల వారి ఆర్థిక స్థితిగతులను క్షీణించేలా చేసింది. 


ఈ క్రమంలో తాత్కాలిక ఉపశమనం కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరగడమే... ఈ ఏడాది అక్టోబరు నాటికి క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడానికి మరో కారణమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


ఇదిలావుంటే ఆర్థికమాంద్యం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపించడంతో ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు బ్యాంకులు ముందుకు రాని విషయం తెలిసిందే. 


ఇక ఆర్థిక మాంద్యంలో ఉన్న పలు రంగాలతో బ్యాంకులు సైతం ఓ జాబితాను సిద్ధం చేసుకున్నాయి. ఆ జాబితాలో ఉన్న రంగాలకు చెందిన ఉద్యోగులకు క్రెడిట్ కార్డులు జారీచేయకూడదని బ్యాంకులు కఠినంగానే నిర్ణయించుకున్నాయి.


అలా బ్యాంకుల జాబితాలో ఉన్న రంగాల్లో ప్రధానమైనది ఎయిర్‌లైన్స్ రంగం కాగా ఫైనాన్స్, రియాలిటీ, మీడియా తదితర  పరిశ్రమలు ఆ తర్వాతి జాబితాలో ఉన్నాయి.


బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం నేపధ్యంలో ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి క్రెడిట్ కార్డుల జారీ కష్టంగా మారింది. అంతేకాదు... కేవలం క్రెడిట్ కార్డులు మాత్రమే కాకుండా ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి రుణాల మంజూరుకు కూడా బ్యాంకులు ముందుకు రావడం లేదు.


ఇక... కొత్త క్రెడిట్ కార్డులు జారీచేయకపోవడమే కాకుండా కొన్ని బ్యాంకులైతే తాము అప్పటికే జారీ చేసిన పాత క్రెడిట్ కార్డుల క్రెడిట్ లిమిట్ ను తగ్గించివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా  పరిశ్రమలు ఆర్థికమాంద్యంలో కూరుకుపోయిన నేపధ్యంలో...  ఆయా ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే.. అప్పటికే బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం సాధ్యపడదన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-12-18T00:57:47+05:30 IST