ప్రభుత్వ రుణభారం తడిసి మోపెడు

ABN , First Publish Date - 2020-09-20T06:28:19+05:30 IST

ప్రభుత్వంపై రుణభారం తడిసి మోపెడయింది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి మొత్తం రుణభారం రూ.101.3 లక్షల కోట్లు కాగా అందులో విదేశీ రుణభారం రూ.41.88 లక్షల కోట్లు (55850 కోట్ల డాలర్లు)...

ప్రభుత్వ రుణభారం తడిసి మోపెడు


  • జూన్‌ చివరికి రూ.101 లక్షల కోట్లు
  • విదేశీ రుణాల్లో 3 శాతం పెరుగుదల
  • ఆర్థికమంత్రిత్వ శాఖ నివేదిక

న్యూఢిల్లీ: ప్రభుత్వంపై రుణభారం తడిసి మోపెడయింది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి మొత్తం రుణభారం రూ.101.3 లక్షల కోట్లు కాగా అందులో విదేశీ రుణభారం రూ.41.88 లక్షల కోట్లు (55850 కోట్ల డాలర్లు). గత ఏడాది మార్చి చివరి నాటికి మొత్తం రుణభారం రూ.94.6 లక్షల కోట్లుండగా విదేశీ రుణభారం రూ.40.73 లక్షల కోట్లుంది. జూన్‌ చివరి నాటికి దేశ మొత్తం రుణాల్లో ప్రభుత్వ రుణాల వాటా 91.1 శాతం ఉంది. ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రభుత్వ రుణ నిర్వహణ, విదేశీ రుణభారంపై విడుదల చేసిన రెండు వేర్వేరు నివేదికల్లో ఈ వివరాలు ప్రకటించింది. విదేశీ వాణిజ్య రుణా ల్లో వృద్ధి విదేశీ రుణభారం పెరగడానికి కారణమని పేర్కొంది. పలు వర్థమాన మార్కెట్లలో ఆర్థిక రంగం విస్తరిస్తున్న కొద్ది విదేశీ రుణభారం పెరగడం సాధారణమేనని, ఇందుకు భారత్‌ కూడా అతీతం కాదని ఆ నివేదిక తెలిపింది. అలాగే గత కొద్ది సంవత్సరాల కాలంలో ప్రైవేటు కంపెనీలు విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించడాన్ని ప్రోత్సహించేలా విధానాల్లో మార్పు వల్ల ప్రైవేటు  విభాగంలో రుణసమీకరణ పెరిగిందని పేర్కొంది. ప్రధానంగా ఆర్థికేతర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలే అధిక మొత్తాల్లో రుణాలు సమీకరించినట్టు తెలిపింది. ఈ విభాగంలో మొత్తం రుణ సమీకరణలో ఆ సంస్థలు తీసుకున్న రుణాల వాటా 42 శాతం ఉంది. డిపాజిట్లు సేకరించే కార్పొరేషన్ల ద్వారా సమీకరించిన రుణాలు 28.3 శాతం ఉండగా సాధారణ ప్రభుత్వ రుణాల వాటా 18.1 శాతం ఉంది. మొత్తం రుణభారంలో ఏడాదికి పైబడి మెచ్యూరిటీ గల దీర్ఘకాలిక విదేశీ రుణాల వాటా 81 శాతం కాగా మిగతా 19 శాతం స్వల్పకాలిక వాణిజ్య రుణాలని తెలియచేసింది.ముఖ్యాంశాలు...

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం రూ.3.46 లక్షల కోట్ల విలువ గల సెక్యూరిటీలు జారీ చేసింది. ఈ సెక్యూరిటీల సగటు మెచ్యూరిటీ కాలపరిమితి 14.61 సంవత్సరాలు. 

జూన్‌ చివరి నాటికి చెల్లించాల్సిన వాటిలో 28.6 శాతం సెక్యూరిటీల మెచ్యూరిటీ కాలపరిమితి ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉంది. వీటిలో 39 శాతం వాటా వాణిజ్య బ్యాంకులది కాగా 26.2 శాతం బీమా కంపెనీలది.  

ఏప్రిల్‌-జూన్‌ నెలల మధ్య కాలంలో నగదు నిర్వహణ బిల్లుల కింద ప్రభుత్వం రూ.80 వేల కోట్లు సమీకరించింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల కింద రూ.10 వేల కోట్ల విలువ గల ప్రభుత్వ సెక్యూరిటీల క్రయవిక్రయాలు నిర్వహించింది. 

ఆర్‌బీఐ లిక్విడిటీ సద్దుబాటుకు కల్పించే ఎల్‌ఏఎఫ్‌, దానికి అనుబంధంగా ఉండే ఎంఎస్‌ఎఫ్‌ కింద రూ.4,51,045 కోట్లు సద్దుబాటు చేసింది. జీ-సెక్‌లపై రాబడి 5.85 శాతానికి తగ్గింది. 

2020-21లో స్థూల విత్తలోటును జీడీపీలో 3.5 శాతం (రూ.7,96,337 కోట్లు) ఉండాలని  బడ్జెట్‌లో నిర్దేశించగా మొదటి త్రైమాసికంలోనే ఆ అంచనాల్లో 83.2 శాతానికి (రూ.6,62,363 కోట్లు) దూసుకుపోయింది. విదేశీ రుణభారం

  1. మార్చి 31వ తేదీ నాటికి జీడీపీలో విదేశీ రుణాల వాటా 19.8 శాతం నుంచి 20.6 శాతానికి పెరిగింది. విదేశీ రుణాల్లో విదేశీ కరెన్సీ నిల్వల విలువ 76 శాతం నుంచి 85.5 శాతానికి చేరింది.
  2. 2019 మార్చి చివరి నాటితో పోల్చితే ఈ ఏడాది మార్చి చివరి నాటికి ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా సేకరించిన విదేశీ రుణం 3 శాతం తగ్గి 10,090 కోట్ల డాలర్లకు పరిమితం అయింది. జీ సెక్‌లలో ఎఫ్‌ఐఐ పెట్టుబడుల క్షీణత ఇందుకు కారణం. 
  3. బహుముఖీన, ద్వైపాక్షిక సంస్థల నుంచి సమీకరించిన రుణాలు 4.9ు పెరిగి 8720 కోట్ల డాలర్లకు చేరాయి. ప్రభుత్వ రుణ భారంలో వీటిదే పెద్ద వాటా. 
  4. ప్రైవేటు రంగ రుణాలు 4.2 శాతం పెరిగి 45,770 కోట్ల డాలర్లయ్యాయి. విదేశీ వాణిజ్య రుణాల సమీకరణ 6.7ు పెరిగి 22,030 కోట్ల డాలర్లకు చేరడమే ఇందుకు కారణం. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు 1,30,060 కోట్ల డాలర్ల మేరకు ఉన్నాయి. 

Updated Date - 2020-09-20T06:28:19+05:30 IST