ఇండియా సిమెంట్స్‌పై దమానీ కన్ను!

ABN , First Publish Date - 2020-06-18T06:10:53+05:30 IST

డీ-మార్ట్‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకిషన్‌ దమానీ.. ఇండియా సిమెంట్స్‌లో వాటాను మరింత పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్చి చివరినాటికి ఇండియా సిమెంట్స్‌లో ఎన్‌ శ్రీనివాసన్...

ఇండియా సిమెంట్స్‌పై దమానీ కన్ను!

  • కంపెనీ టేకోవర్‌ యోచన?


ముంబై: డీ-మార్ట్‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకిషన్‌ దమానీ.. ఇండియా సిమెంట్స్‌లో వాటాను మరింత పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్చి చివరినాటికి ఇండియా సిమెంట్స్‌లో ఎన్‌ శ్రీనివాసన్‌, ఇతర  ప్రమోటర్ల మొత్తం వాటా 28.26 శాతంగా ఉంది. దమానీ కుటుంబం వాటా 19.89 శాతానికి చేరుకుంది. 2019 ద్వితీయార్ధం నుంచి రాధాకిషన్‌ దమానీ, తన సోదరుడు గోపీకిషన్‌ శివకిషన్‌ దమానీతో కలిసి ఈ కంపెనీలో వాటాలు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. అంతకుముందు ఇండియా సిమెంట్స్‌లో దమానీల వాటా 1.3 శాతమే. బహిరంగ మార్కెట్లో కంపెనీ షేర్ల కొనుగోళ్ల ద్వారా గత డిసెంబరు చివరినాటికి వాటాను 4.73 శాతానికి పెంచుకున్నారు.


ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకంగా 15.16 శాతం వాటా కొనుగోలు చేశారు. దాంతో మొత్తం వాటా 19.89 శాతానికి చేరుకుంది. వాటాను 25 శాతానికి పెంచుకోగలిగితే కంపెనీ నియంత్రణాధికారాన్ని సైతం చేజిక్కించుకునే అవకాశం లభిస్తుంది. సెబీ టేకోవర్‌ నిబంధనల ప్రకారం.. ఏదేని లిస్టెడ్‌ కంపెనీలో 25 శాతం వాటా కొనుగోలు చేస్తే, అదనంగా 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. మెజారిటీ (51 శాతం) వాటా కొనుగోలు ద్వారా కంపెనీని టేకోవర్‌ చేయడంతోపాటు యాజమాన్య నియంత్రణ అధికారాలు లభిస్తాయి. 


మరో బలవంతపు టేకోవర్‌?

కంపెనీని దమానీలు బలవంతంగా టేకోవర్‌ చేయకుండా అడ్డుకునేందుకు శ్రీనివాసన్‌ ఇతర ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బలవంతంగా  టేకోవర్‌ చేసే ఉద్దేశం లేదని, స్నేహపూర్వక యాజమాన్య మార్పిడిని కోరుకుంటున్నామని శ్రీనివాసన్‌కు దమానీలు ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. ఐటీ  కంపెనీ మైండ్‌ట్రీనీ గత ఏడాది ఎల్‌ అండ్‌ టీ బలవంతంగా టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే. 


షేర్లు జూమ్‌ 

దమానీ టేకోవర్‌ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్‌ షేర్లు భారీగా పెరిగాయి. బుధవారం బీఎ్‌సఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 10 శాతం పైగా పుంజుకున్న కంపెనీ షేరు.. చివరికి 4.84 శాతం లాభంతో రూ.132.10 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ షేరు ధర 95 శాతం పెరగగా.. మార్చి నుంచే 74 శాతం మేర లాభపడింది. ఓపెన్‌ మార్కెట్లో దమానీలు కంపెనీ షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ వస్తుండటమే ర్యాలీకి కారణమై ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. 


Updated Date - 2020-06-18T06:10:53+05:30 IST