చైనా నుంచి కంపెనీలు రావడం డౌటే

ABN , First Publish Date - 2020-05-13T06:49:12+05:30 IST

చైనాలో ఉన్న బహుళ జాతి కంపెనీలు తమ యూనిట్లను భారత్‌కు తరలిస్తాయని పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ...

చైనా నుంచి కంపెనీలు రావడం డౌటే

కోల్‌కతా: చైనాలో ఉన్న బహుళ జాతి కంపెనీలు తమ యూనిట్లను భారత్‌కు తరలిస్తాయని పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ స్పష్టం చేశారు. ‘ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే, చైనా తన కరెన్సీ మారకం రేటు తగ్గిస్తుంది. అప్పుడు చైనా వస్తువుల ధరలు తగ్గి, ప్రజలు వాటినే కొంటారు’ అని ఒక బెంగాలీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కొవిడ్‌-19 నేపథ్యంలో అమెరికాతో సహా అనేక దేశాలు చైనాపై గుర్రుగా ఉన్నాయి. దీంతో ఈ దేశాలకు చెందిన అనేక కంపెనీలు తమ ఉత్పత్తి యూనిట్లను భారత్‌ వంటి దేశాలకు తరలించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిజిత్‌ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. 


కొనుగోలు శక్తే పెద్ద సమస్య 

ప్రజల కొనుగోలు శక్తి పెద్దగా లేకపోవడమే భారత్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని అభిజిత్‌ బెనర్జీ అన్నారు. కరోనా దెబ్బతో ప్రజల కొనుగోలు శక్తితో పాటు డిమాండ్‌ పడిపోయిందన్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు మూడు లేదా ఆరు నెలల పాటు పేదల చేతికి మరింత నగదు అందేలా చూడాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోంది పేదలు తప్ప ధనికులు కాదన్నారు.


కనీస ఆదాయ పథకం భేష్‌ : థామస్‌ పికెట్టీ 

లాక్‌డౌన్‌తో తలెత్తుతున్న ఆర్థిక అసమానతలను ‘కనీస ఆదాయ పథయం’ ద్వారా భారత్‌ అధిగమించవచ్చని ఫ్రెంచ్‌ ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ అన్నారు. ఆదాయం లేకుండా లాక్‌డౌన్‌ ఎలా పని చేస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రతి వ్యక్తికి కనీస ఆదాయ హామీ పథకం అమలు చేస్తే, 21వ శతాబ్దంలో భారత్‌ అగ్రశ్రేణి ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతుందన్నారు. సంపన్నులపై సంపద పన్ను, వారసత్వ పన్నులు విధించాలన్న ప్రతిపాదనూ థామస్‌ పికెట్టీ సమర్థించారు. 


Read more