భారత విమానయాన రంగంపై కరోనా కోరలు!
ABN , First Publish Date - 2020-03-14T03:20:05+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విమానయాన సంస్థలు క్రమంగా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విమానయాన సంస్థలు క్రమంగా కష్టాల్లో కూరుకుపోతున్నాయి. విమాన సర్వీసుల రద్దుతో నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. తాజాగా ఎయిరిండియా శుక్రవారం ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్, సౌత్ కొరియా, శ్రీలంక దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్-19 రోజురోజుకు మరిన్ని దేశాలకు విస్తరిస్తుండడంతో ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకుంది. కువైట్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన తర్వాతి రోజే మరిన్ని దేశాలకు సేవలు నిలిపివేయడం గమనార్హం. ఏప్రిల్ 30వ తేదీ వరకు సేవలు అందుబాటులో ఉండవని వివరించింది.
గత నెల రోజుల్లో భారత్ వేదికగా రాకపోకలు సాగించే 600 అంతర్జాతీయ విమానాలు కూడా రద్దయ్యాయి. ఇందులో 500 విమానాలు విదేశీ సంస్థలవి కాగా, మిగతావి దేశీయ సంస్థలు.
దౌత్య పరమైన, ఉపాధి సంబంధిత వీసాలు తప్ప ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత విమానాల రద్దు ఎక్కువైంది. దేశీయ సంస్థలు వీక్లీ విమానాలను కూడా రద్దు చేశాయి. ఈ విషయంలో ఇండిగో సంస్థ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. అయితే, ఇది తాత్కాలికమేనని పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి రోజూ 70 మంది ప్రయాణికులు భారత్‌కు వస్తుంటారని, అయితే, కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఆ సంఖ్య 62 వేలకు పడిపోయిందని ఇటీవల పౌరవిమానయాన మంత్రి హర్‌దీప్ పూరి తెలిపారు.