ఆపత్కాలంలో 6 ఆర్థిక సూత్రాలు
ABN , First Publish Date - 2020-04-12T06:10:12+05:30 IST
కరోనా కాటుకు ప్రపంచమంతా రోదిస్తోంది. లాక్‌డౌన్‌తో భారత్ సహా చాలా ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. వ్యాపారులు, పరిశ్రమలు....
సిద్ధంకండి.. గండం గట్టెక్కండి
కరోనా కాటుకు ప్రపంచమంతా రోదిస్తోంది. లాక్‌డౌన్‌తో భారత్ సహా చాలా ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. వ్యాపారులు, పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలకు రాబడి ఆగిపోయింది. వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకున్న కంపెనీలు సైతం ఇప్పుడు ఉద్యోగాలకు కత్తెరేసే పనిలో ఉన్నాయి. లేదంటే జీతాలకు కోత పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే అమలుపర్చాయి కూడా. ఇలాంటి సంక్షోభాల ప్రభావం నుంచి గట్టెక్కించే ఆర్థిక సూత్రాలు మీకోసం..
ఆరోగ్య బీమా.. ఉంటే ధీమా
వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్న కాలంలో పెద్ద జబ్బు చేస్తే ఆస్తులమ్ముకోవాల్సిందే. కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు మిమ్మల్ని ఆర్థికంగా రక్షించగలిగేది ఆరోగ్య బీమా పాలసీనే. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయి. కానీ, ఉద్యోగంలో ఉన్నన్ని రోజులే ఈ బీమా కవరేజీ లభిస్తుంది. సంక్షోభ కాలంలో ఉద్యోగం ఊడితే ఏంటి పరిస్థితి..? అప్పటికప్పుడు బీమా పాలసీ తీసుకున్నా చాలా వరకు వ్యాధులు, జబ్బులకు వెంటనే కవరేజీ లభించదు. కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉన్నా.. మీ కుటుంబం కోసం సొంతంగా ఓ పాలసీ కొనుగోలు చేయడం ఉత్తమం. ఆ పాలసీని ప్రతియేటా రెన్యువల్ చేయడమూ మరవొద్దు.
ఖర్చులకు కత్తెర వేయండి..
ఆదాయం నిలకడగా వస్తున్నా, నిలిచిపోయినా ఒకేలా ఖర్చు చేస్తామంటే ఎలా..? రాబడిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఖర్చులోనూ పట్టు విడుపులుండాలి. భవిష్యత్‌పై కముకున్న కరోనా మబ్బులు ఎప్పుడు తొలుగుతాయనే స్పష్టత లేనందున అనవసరపు ఖర్చులకు అడ్డకత్తెరేయాలి. అత్యవసర వ్యయానికే కట్టుబడి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య ఖర్చుల కోసమూ కూడా కొంత పక్కన పెట్టుకోవాలి.
భారీ వ్యయాలకు ఆమడ దూరం
కరోనా కనికరించినా అది తీసుకొచ్చిన ఆర్థిక మాంద్యం మాత్రం మనల్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. కాబట్టి, కొన్నాళ్లపాటు భారీ వ్యయాలు, కొనుగోళ్లకు దూరంగా ఉంటే మంచిది.
రుణం.. ఏకీకరణం
గృహ రుణం, వాహన రుణం, కన్స్యూమర్ లోన్, క్రెడిట్ కార్డుపై ఈఎంఐ చెల్లింపులు.. ఇప్పటికే చేసిన పలు అప్పులను సంక్షోభ కాలంలో కన్సాలిడేట్ చేసుకోవడం మేలు. పెద్దమొత్తం అప్పుతో చిన్న మొత్తం రుణ బకాయిలను తీర్చేయగలిగితే వడ్డీ భారం తగ్గుతుందని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. ఉదాహరణకు, ప్రాపర్టీ తాకట్టుపై తక్కువ వడ్డీకే లభించే రుణాలను ఇందుకు ఎంచుకోవడం మేలంటున్నారు.
అత్యవసర నిధితో భవిష్యత్‌కు భద్రత
ఆపద చెప్పిరాదు. అనుకోని అత్యవసరాలను తీర్చుకునేందుకు కొంత సొమ్మును పక్కన పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఆర్థిక సూత్రం. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుంటే సంక్షోభ కాలంలో మీ భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుంది. ఈ ఫండ్ సదా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఈ డబ్బును ఇంటి లాకర్లో దాచుకోవడం లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయడం మేలు. కనీసం 3-6 నెలల ఇంటి ఖర్చులకు (ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులతో సహా) సమానమైన నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెట్టుబడులుంటే పనికొస్తాయ్..
అవసరానికి మించి డబ్బు ఉంటే దేంట్లోనైనా పెట్టుబడి పెట్టేయ్. అత్యవసర సమయంలో పనికొచ్చేది దాచిన లేదా పెట్టుబడి సొమ్మే. ప్రస్తుత ఆపత్కర పరిస్థితుల్లో జీవనోపాఽధి కోల్పోవాల్సి వచ్చినా.. గత పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. అయితే, ఆర్థిక సలహాదారుల మేరకు పెట్టుబడులు పెట్టడం మేలు. నష్ట భయాలు తక్కువగా ఉంటే పెట్టుబడి సాధనాలు, పథకాలను ఎంచుకోవాలి. సొమ్మంతా ఒకదాంట్లో పెట్టుబడిగా పెట్టవద్దు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు, పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, బంగారం, రియల్టీ.. ఇలా పెట్టుబడులను వీలైనంతగా వివిధీకరించుకోగలగాలి.