కరోనార్పణం
ABN , First Publish Date - 2020-03-13T08:01:32+05:30 IST
ప్రపంచ మహమ్మారి కరోనా ఈక్విటీ మదుపర్లపైనా కత్తిగట్టింది. స్టాక్ మార్కెట్లపై బేర్ మరింత పట్టుబిగించడంతో ప్రామాణిక సూచీలు చరిత్రలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో...

- దలాల్‌స్ట్రీట్‌లో దమనకాండ!
- మళ్లీ కుప్పకూలిన స్టాక్ సూచీలు
- 10 వేల దిగువకు నిఫ్టీ
- బేర్ దెబ్బకు బుల్ చిత్తు
- రూ. 11,00,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
- సెన్సెక్స్ 2,919 పాయింట్లు డౌన్
- ఇంట్రాడేలో 3,204 పాయింట్ల క్షీణత
- 868 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- సూచీలకిదే ఆల్‌టైం అతిపెద్ద నష్టం
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చరిక ఘంటికలు మోగాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
ప్రపంచ మహమ్మారి కరోనా మాత్రం క్విటీ మదుపర్లపైనా కత్తిగట్టింది. స్టాక్ మార్కెట్లపై బేర్ మరింత పట్టుబిగించడంతో ప్రామాణిక సూచీలు చరిత్రలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 3,204.30 పాయింట్ల వరకు క్షీణించింది. చివరికి 2,919.26 పాయుంట్ల నష్టంతో 32,778.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 868.25 పాయింట్లు కోల్పోయి 9,590.15 వద్దకు జారింది. ఈ మధ్య కాలంలో సూచీలు గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం పైగా పడ్డాయి.
ఈ ఏడాది జనవరి 14న సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న సూచీలు.. గురువారం ట్రేడింగ్ సెషన్‌లో రెండున్నరేళ్లకు పైగా కనిష్ఠ స్థాయిలో ముగిశాయి. దలాల్‌స్ట్రీట్ దమనకాండలో ప్రధాన కంపెనీల షేర్లతో పాటు చిన్న, మధ్య స్థాయి షేర్లలోనూ అమ్మకాలు పోటెత్తాయి. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 7.84 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 8.72 శాతం క్షీణించాయి. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ సంపద రూ.11.28 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.125,86,398.07 కోట్లకు జారుకుంది.
ఏడాది కనిష్ఠానికి 1,180 షేర్లు
బీఎ్‌సఈలోని 1,180 కంపెనీల షేర్లు 52 వారా ల సరికొత్త కనిష్ఠాన్ని నమోదు చేసుకున్నాయి. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్), హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీలూ ఉన్నాయి. హీరో మోటోకార్ప్, గెయిల్, ఏసీసీ, ఏబీబీ, బీఈఎంఎల్, గ్లెన్‌మార్క్ ఫార్మా, జిలెట్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీహెచ్‌ఈఎల్, హెచ్‌డీఎ్‌ఫసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అరబిందో ఫార్మా సైతం 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి. మార్కెట్ మహా పతనంలోనూ రుచి సోయా ఇండస్ట్రీస్, అ పోలో ఫిన్‌వెస్ట్ సహా 13 కంపెనీలు ఏడాది గరిష్ఠానికి చేరుకోగలిగాయి.
అన్నీ నేలచూపులే..
సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీలూ నష్టాల్లోనే పయనించాయి. ఎస్‌బీఐ అత్యధికంగా 13.23 శాతం మార్కెట్ విలువ ను కోల్పోయింది. ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ సైతం రెండంకెల నష్టాన్ని చవిచూశాయి. బీఎ్‌సఈలోని అన్ని రంగాల సూచీలదీ నేలచూపే. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 9.82 శాతం తగ్గింది. బేసిక్ మెటీరియల్, బ్యాం కింగ్, మెటల్, రియల్టీ ఇండెక్స్‌లు సైతం 9 శాతం పైగా విలువను కోల్పోయాయి.
ఎయిర్‌లైన్స్ షేర్లు అతలాకుతలం
కరోనా వైరస్ విజృంభణతో భారత్, అమెరికాతోపాటు పలు దేశాలు ప్రజల ప్రయాణాలపై, ముఖ్యంగా విదేశీ విమానయానాలపై ఆంక్షలు విధించాయి. మున్ముందు మరిన్ని దేశాలు ఇదే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ కంపెనీల ఆదాయానికి భారీ గండి పడవచ్చన్న ఆందోళనలతో ఈ రంగ షేర్లు కుప్పకూలాయి. బీఎ్‌సఈలో ఇండిగో షేరు 11.85 శాతం, స్పైస్‌జెట్ 19.55 శాతం పతనమయ్యాయి. తాత్కాలికంగా మూతపడ్డ జెట్ ఎయిర్‌వేస్ షేర్లు సైతం 4.77 శాతం నష్టపోయాయి.
యెస్ బ్యాంక్ షేరు 13 శాతం డౌన్
ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న యెస్ బ్యాంక్ షేరు 13 శాతం పైగా పడిపోయింది. దాంతో గడిచిన రెండు సెషన్లలో ఈ షేరు ఆర్జించిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
ఆర్‌ఐఎల్‌కు చమురు సెగ
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం కావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్ షేరు మరో 7.95ు నష్టపోయి రూ.1,061.6కు పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.41,152 కోట్ల మేర తరిగిపోయింది.
పాపం.. రూపాయి
రూపాయి మరింత క్షీణించింది. డాలర్‌తో రుపీ మార కం రేటు 60 పైసలు బలహీనపడి రూ.74.28కు చేరింది. మారకం రేటుకు సరికొత్త 17 నెలల కనిష్ఠ స్థాయి ఇది. అంతర్జాతీయంగా డాలర్ మరింత బలపడటంతో పాటు ఈక్విటీ మార్కెట్ల పతనం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణమయ్యాయి.
ఇవీ కారణాలు..
ప్రయాణాలపై ఆంక్షలు
కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా యూరప్ నుంచి తమ దేశానికి ప్రజల ప్రయాణాలను 30 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో ద్వైపాక్షిక వాణిజ్యానికి అంతరాయం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చిన్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ప్రయాణాలపై ఆంక్షలు, విదేశీ వాణిజ్యానికి అవరోధాలు, పారిశ్రామికోత్పత్తి నిలిపివేతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారుకోవచ్చన్న భయాలు మరింత పెరిగాయి.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ
ప్రపంచవ్యాప్తంగా ఈక్వి టీ మార్కెట్లలో ట్రేడింగ్ సెంటిమెంట్ పూర్తి ప్రతికూలంగా మారిం ది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎ్‌ఫపీఐ) మన మార్కెట్ నుంచి పెట్టుబడులను పె ద్ద ఎత్తున ఉపసంహరించుకుంటున్నా రు. కేవలం ఈ నెలలోనే వారు రూ.20,831 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
బాండ్ మార్కెట్లో అనిశ్చితి
యెస్ బ్యాంక్ పునర్నిర్మాణంలో భాగం గా ఆ బ్యాంక్ గతంలో జారీ చేసిన అదనపు టైర్ 1 బాండ్లను శాశ్వతంగా, పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నిర్ణయం బాండ్ మార్కెట్లో పెట్టుబడులపై ప్రతికూలతతోపాటు అనిశ్చితిని పెంచింది.
ముడి చమురు 33 డాలర్లు
కరోనా ప్రభావానికి తోడు సౌదీ అరేబియా, రష్యా మధ్య మొదలైన ముడి చమురు ధరల యుద్ధం మార్కెట్లో ప్రతికూలతను మరింత పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 33 డాలర్ల స్థాయికి పడిపోవడంతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి అధికమైంది.
ప్రపంచ మార్కెట్లూ ఫట్
ఆర్థిక మాంద్యం భయాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రపంచ దేశాల ఈక్విటీ సూచీలు, ముడి చమురు ధరలు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. అమెరికా సూచీలు 5 శాతం వరకు నష్టపోగా.. యూరప్ మార్కెట్ సూచీలైతే 10 శాతంపైగా పడిపోయాయి. ఆసియా దేశాల సూచీలూ 1-4 శాతం పైగా పడిపోయాయి.
8,100 స్థాయికి నిఫ్టీ?
మార్కెట్లో ఈ పతనం ఎంతవరకో తెలియక ఇన్వెస్టర్లు దిక్కుతోచకున్నారు. సూచీలు ఇప్పటికే బేర్ జోన్‌లోకి ప్రవేశించాయని, మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న దిద్దుబాటుకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కన్పించడం లేదని ఈక్విటీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతికూల ట్రేడింగ్ ట్రెండ్‌లో సూచీలు మరింత పడవచ్చని వారంటున్నారు. ఇప్పటికే 10,000 దిగువకు జారుకున్న నిఫ్టీ.. మున్ముందు 8,800-8,100 స్థాయికి క్షీణించే అవకాశాల్లేకపోలేవని యెస్ సెక్యూరిటీ్‌సకు చెందిన అమర్ అంబానీ అభిప్రాయపడ్డారు. అంటే, సూచీలు మరో 5-15 శాతం మేర క్షీణించవచ్చన్నమాట.
బిగ్ బుల్‌పై బేర్ పంజా
మార్కెట్ పతనం చిన్న మదుపర్ల దగ్గరి నుంచి బడా ఇన్వెస్టర్ల వరకు అందరినీ కుదిపేసింది. దలాల్‌స్ట్రీట్ బిగ్ బుల్‌గా పేరున్న ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకూ గట్టి దెబ్బే తగిలింది. ఈయనకు రూ.6,500 కోట్ల పెట్టుబడులు కలిగి ఉన్న టైటాన్ షేరు ధర ఏడాది గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం పతనమైంది. ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు కలిగిన కంపెనీల షేర్లన్నీ ఏడాది గరిష్ఠ స్థాయి నుంచి 20-80 శాతం వరకు పతనమయ్యాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్
బుధవారం
ముగింపు : 35,697.40
గురువారం
ప్రారంభం : 34,472.50
గరిష్ఠం : 34,472.50
కనిష్ఠం : 32,493.10
ముగింపు : 32,778.14
