ఆరుగురు బ్యాంకు సీఈఓలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు

ABN , First Publish Date - 2020-02-12T09:27:01+05:30 IST

ఆరుగురు ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలు ప్రస్తుతం సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ఎదుర్కొంటున్నారని, అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లోక్‌సభకు వెల్లడించారు.

ఆరుగురు బ్యాంకు సీఈఓలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు

  • వెల్లడించిన ప్రభుత్వం 

న్యూఢిల్లీ: ఆరుగురు ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలు ప్రస్తుతం సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ఎదుర్కొంటున్నారని, అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లోక్‌సభకు వెల్లడించారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అధికార దుర్వినియోగం, అవకతవకలకు సంబంధించిన సమాచారం బహిర్గతం చేస్తూ ప్రకటనలు చేసే వారిని లేదా సమాచారం ఇచ్చే వారిని పరిరక్షించేందుకు (పీఐడీపీఐ) సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం ప్రజావేగులు అందించే ఫిర్యాదులపై దర్యాప్తు చేసే అధికారం కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు ఉన్నదని ఆయన వెల్లడించారు. వివిధ మంత్రిత్వ శాఖల్లోని చీఫ్‌ విజిలెన్స్‌ అధికారులకు ఇలాంటి లిఖితపూర్వక ఫిర్యాదులు అందుకునే అధికారం ఉందని  తెలిపారు. ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, కార్పొరేషన్లకు చెందిన అధికారి లేదా ఉద్యోగి అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడితే అలాంటి చర్యలపై ప్రజావేగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.


ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వహణాపరంగా శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌ను వ్యవస్థీకృతం చేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే బోర్డు స్థాయిలో నిర్వహణను పటిష్ఠం చేయడం లక్ష్యంగా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవులను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, ఎం డీ/సీఈఓగా విభజించడం, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్లు, హోల్‌టైమ్‌ డైరెక్టర్లను ఎంపిక చేసేందుకు వృత్తి నిపుణులతో కూడిన బ్యాంకు బో ర్డు బ్యూరో ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. కాగా అధిక విలువ రుణాల మం జూరు విధివిధానాలను కూడా కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. రూ.250 కోట్లకు పైబడిన రుణాలను పర్యవేక్షించేందుకు ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగాల్లో చక్కని అవగాహన ఉన్న స్పెషలిస్టులతో ప్రత్యేక పర్యవేక్షణ సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. 


422 కేసుల్లో ఐటీ నోటీసులు

గత ఏడాది డిసెంబరు నాటికి 422 కేసుల్లో విదేశీ నల్లధనం చట్టం కింద ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిందని మంత్రి ఠాకూర్‌ తెలిపారు. అవన్నీ విదేశాల్లో అప్రకటిత ఆస్తులు, రూ.12600 కోట్లకు పైబడిన ఆదాయం ఉన్నట్టుగా గుర్తించిన కేసులని వెల్లడించారు. 2015 జూలై ఒకటో తేదీన నల్లధనం (అప్రకటిత విదేశీ ఆదాయాలు, ఆస్తులు), పన్ను విధింపు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఐటీ శాఖ నిరంతర చర్యలు తీసుకుంటూనే ఉన్నదన్నారు. హెచ్‌ఎ్‌సబీసీలో విదేశీ అప్రకటిత ఖాతాల్లో డిపాజిట్‌ చేసిన రూ.8460 కోట్ల విలువ గల అప్రకటిత ఆదాయంపై రూ.1290 కోట్లకు పైబడిన పన్నులు, పెనాల్టీలు విధించినట్టు ప్రకటించారు. 


Updated Date - 2020-02-12T09:27:01+05:30 IST