ముడి ఔషధాల తయారీకి ప్రోత్సహాకాలు

ABN , First Publish Date - 2020-05-09T05:46:21+05:30 IST

దేశంలో బల్క్‌ డ్రగ్స్‌, ఔషధాల తయారీలో వినియోగించే కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌ (కేఎ్‌సఎం),ఇంటర్మీడియెట్స్‌ తయారీని ప్రోత్సహించేందుకు

ముడి ఔషధాల తయారీకి ప్రోత్సహాకాలు

 • ఎనిమిదేళ్లకు రూ.6,940 కోట్లు
 • 3 ఔషధ పార్కుల అభివృద్ధికి రూ.3,000 కోట్లు
 • కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
 • 7.57% పెరిగిన ఔషధ ఎగుమతులు
 • 2019-20లో   రూ.1,54,350 కోట్లు : ఫార్మాగ్జిల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలో బల్క్‌ డ్రగ్స్‌, ఔషధాల తయారీలో వినియోగించే కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌ (కేఎస్‌ఎం),ఇంటర్మీడియెట్స్‌ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. 53 కీలక ముడి ఔషధాల తయారీకి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2019-20  మూలాధార సంవత్సరంగా పెరిగే అమ్మకాలపై నగదు ప్రోత్సహాకాలు ఇవ్వనుందని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లకు ఇందుకోసం ప్రభుత్వం రూ.6,940 కోట్లు వెచ్చించనుంది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ), ఔషధ ఇంటర్మీడియెట్స్‌, కేఎస్‌ఎంల కోసం ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయంగా వీటి సరఫరాను పెంచడానికి పెట్టుబడులను ఆకర్షించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 


3 ఔషధ పార్కులు

రాష్ట్రాల భాగస్వామ్యంతో మూడు మెగా బల్క్‌ డ్రగ్‌ పార్కులను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో పార్కుకు రాష్ట్రాలకు గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం రూ.1,000 కోట్ల నిధులు ఇస్తుంది. వచ్చే ఐదేళ్లలో  ఇందుకు రూ.3,000 కోట్లను సమకూరుస్తుంది. ముడి ఔషధాల కోసం అధికంగా చైనాపై ఆధారపడడాన్ని దృష్టిలో ఉంచుకుని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో ఫార్మాగ్జిల్‌ ఒక అధ్యయనాన్ని నిర్వహించిందని ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. ‘ఏపీఐలు, ఇంటర్మీడియెట్స్‌, కేఎ్‌సఎంల దిగుమతులను తగ్గించుకోవడానికి వ్యూహాలు’ పేరుతో రూపొందించిన ఈ నివేదికను ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ముడి ఔషధాల తయారీని ప్రోత్సహించడానికి రూపొందించిన పథకాల రూపకల్పనలో ఈ నివేదికలోని అంశాలు దోహదపడ్డాయని చెప్పారు. దేశీయ ఔషధ పరిశ్రమకు అవసరమైన ముడి ఔషధాల్లో 60-70 శాతం ఔషధాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 


చివరి త్రైమాసికంలో క్షీణత

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఔషధాల ఎగుమతులు అంచనాలు చేరకపోయినప్పటికీ.. మొదటి మూడు త్రైమాసికాల్లో వృద్ధి కారణంగా మొత్తం ఏడాదికి అంతక్రితం ఏడాదితో పోలిస్తే పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరానికి దేశీయ ఔషధ ఎగుమతులు 2,058 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.1,54,350 కోట్లు) చేరాయి. 2018-19 ఎగుమతులు 1,913 కోట్ల డాలర్లతో పోలిస్తే 7.57 శాతం పెరిగాయి. ఏడాది ప్రారంభంలో ఔషధ ఎగుమతులు 2,200 కోట్ల డాలర్లకు చేరగలవని అంచనా వేసినప్పటికీ.. 2,058 కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను మాత్రమే ఎగుమతి చేసినట్లు ఫార్మాగ్జిల్‌ వెల్లడించింది.


2019-20 మొదటి మూడు త్రైమాసికాల్లో ఫార్మా ఎగుమతులు 11.5 శాతం మేరకు పెరిగినప్పటికీ.. నాలుగో త్రైమాసికంలో 2.97 శాతం ప్రతికూల (నెగిటివ్‌) వృద్ధి రేటు నమోదు కావడంతో మొత్తం ఏడాదికి ఎగుమతుల వృద్ధి రేటు 7.57 శాతానికి పరిమితమైందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలైన మార్చిలో ఔషధ ఎగుమతులు ఏకంగా 23.24 శాతం క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 202 దేశాలకు భారత్‌ ఔషధాలను ఎగుమతి చేసింది. 


 1. మొత్తం ఎగుమతుల్లో ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజిక్స్‌ వాటా దాదాపు 72 శాతం ఉంది. వీటి ఎగుమతులు 9.5 శాతం పెరిగాయి 
 2. ముడి ఔషధాల ఎగుమతుల్లో 0.73 శాతం క్షీణత
 3. వ్యాక్సిన్ల ఎగుమతులు 22 శాతం, సర్జికల్‌ ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరిగాయి
 4. భారత ఔషధ ఎగుమతుల్లో ప్రధాన మార్కెట్‌ అయిన ఉత్తర అమెరికా వాటా 34 శాతం ఉంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15.11 శాతం పెరిగాయి. 
 5. అమెరికా మార్కెట్‌కు గత ఆర్థిక సంవత్సరంలో 670 కోట్ల డాలర్ల విలువైన ఔషధాల ఎగుమతి 
 6. రెండో అతిపెద్ద మార్కెట్‌ అయిన (17 శాతం వాటా) అఫ్రికా ప్రాంతానికి ఔషధ ఎగుమతులు 2.24%, యూర్‌పనకు 4.54% చొప్పున పెరిగాయి. 
 7. కోవిడ్‌-19 కారణంగా ఫిబ్రవరిలో ముడి ఔషధాల దిగుమతులు భారీగా తగ్గడం, అనేక దేశాల్లో లాక్‌డౌన్‌, కొన్ని రకాల ఔషధాల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించడం తదితర అంశాలు ఎగుమతుల వృద్ధి తగ్గడానికి కారణమయ్యాయి. 

Updated Date - 2020-05-09T05:46:21+05:30 IST