కరోనా ఎఫెక్ట్... ఆ దేశాలకు జలుబు... మన మార్కెట్ పతనం...
ABN , First Publish Date - 2020-10-28T01:07:30+05:30 IST
అమెరికా తుమ్మితే మన మార్కెట్లకు జలుబు చేస్తోంది. షేర్ మార్కెట్లనుద్దేశించి నిపుణులు చేసే వ్యాఖ్యలివి. ఇప్పుడిదే జరిగింది. ఇటలీలో మళ్లీ కరోనా విజృంభిస్తుండడంతో మార్కెట్లు పతనమయ్యాయి.

న్యూఢిల్లీ : అమెరికా తుమ్మితే మన మార్కెట్లకు జలుబు చేస్తోంది. షేర్ మార్కెట్లనుద్దేశించి నిపుణులు చేసే వ్యాఖ్యలివి. ఇప్పుడిదే జరిగింది. ఇటలీలో మళ్లీ కరోనా విజృంభిస్తుండడంతో మార్కెట్లు పతనమయ్యాయి. కొద్ది రోజులుగా లాభాల బాటలో పయనించిన మార్కెట్ల దూకుడుకు బ్రేక్ పడింది. తీవ్ర ఒడుదొడుకులకు లోనై ఒకానొక దశలో 40 వేల పాయింట్ల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ 540 పాయింట్లు నష్టపోయి, చివరికి 40,145 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 162 పాయింట్ల నష్టంతో 11,767 వద్ద ముగిసింది.
ఇక అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో ఆసియా మార్కెట్లు ఆరంభం నుంచే నష్టాల బాట పట్టాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి, 40,512 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించింది. ఈ క్రమంలో ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొక దశలో 39,948 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. చివరి గంటల్లో సెన్సెక్స్ 540 పాయింట్ల నష్టంతో 40,145 వద్ద ముగిసింది.
మొత్తంమీద గతవారం వచ్చిన లాభాలన్నీ సోమవారం (అక్టోబర్ 26) నాటి ట్రేడింగ్‌లో రయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, నెస్లే, కొటక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ తదితర షేర్లు లాభపడగా.. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హిందాల్కో, ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.85 గా ఉంది.