అబ్బే.. ఇది ప్యాకేజీనా?
ABN , First Publish Date - 2020-05-19T06:11:22+05:30 IST
మహా మాంద్యం భయాలు భారత్‌ను వెంటాడుతున్నాయి. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ, సంస్కరణలు.. భారత ఆర్థిక వ్యవస్థను ఇప్పటికిప్పుడు ఒడ్డున పడేసే సూచనలు కనిపించడం లేదని అంతర్జాతీయ రేటింగ్...

- ఉద్దీపన ప్రయోజనం అంతంతే
- ముంచుకొస్తున్న ‘మహా’ మాంద్యం
- బ్రోకరేజీ సంస్థల మాట ఇది..
న్యూఢిల్లీ: మహా మాంద్యం భయాలు భారత్‌ను వెంటాడుతున్నాయి. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ, సంస్కరణలు.. భారత ఆర్థిక వ్యవస్థను ఇప్పటికిప్పుడు ఒడ్డున పడేసే సూచనలు కనిపించడం లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలంటున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉద్దీపన, సంస్కరణల ప్రయోజనం కనిపించేందుకు ఎంత లేదన్నా కనీసం మూడేళ్లు పడుతుందని గోల్డ్‌మన్ శాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, నోమురా వంటి అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. నోమురా అయితే ‘చెప్పిం ది ఎక్కువ, ఇచ్చింది తక్కువ’ అని నేరుగానే కామెంట్ చేసింది. కొన్ని వ్యాపారాలు ఎదుర్కొంటున్న స్వల్పకాలిక సవాళ్ల నుంచి గట్టెక్కించేందుకు ఈ ప్యాకేజీ ఏ మాత్రం ఉపయోగపడదని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. అయితే మధ్య, దీర్ఘకాలంలో వ్యవసాయం, గనులు, విద్యుత్, రక్షణ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు మాత్రం ఈ ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన సంస్కరణలు మేలు చేస్తాయని అంచనా వేశాయి. కాగా లాక్‌డౌన్ పొడిగింపుతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది మాట దేవుడెరుగు.. ఉన్న స్థాయి నుంచి మరింత పడిపోతుందని ఈ సంస్థల అంచనా.
వృద్ధి 45 శాతం ఢమాల్ : ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) 12 శాతం నుంచి 45 శాతం వరకు పడిపోతుందని ఈ సంస్థలు తమ తాజా నివేదికల్లో పేర్కొన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ అయితే జూన్ త్రైమాసికంలో జీడీపీ 45 శాతం పడిపోతుందని అంచనా వేసింది. గతంలో ఎన్నడూ భారత జీడీపీ ఒక త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో పడిపోయిన సందర్భం లేదు. ఇదే సంస్థ ఇంతకు ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 20 శాతం పడిపోతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా జీడీపీ వృద్ధి రేటు మైనస్ 5 శాతానికి పడిపోతుందని స్పష్టం చేసింది. బ్యాంక్ ఆఫ్ ఆమెరికా, నోమురా సంస్థలు కూడా 2020-21లో భారత జీడీపీ వృద్ధి రేటు 0.1 శాతం నుంచి మైనస్ 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపాయి.