ఫ్యూచర్‌-రిలయన్స్‌ డీల్‌కు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-10-27T05:56:11+05:30 IST

ఫ్యూచర్‌ గ్రూప్‌-రిలయన్స్‌ డీల్‌కు బ్రేక్‌ పడింది. ‘ఫ్యూచర్‌’లో వాటాలున్న అమెజాన్‌..

ఫ్యూచర్‌-రిలయన్స్‌ డీల్‌కు బ్రేక్‌

ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేయాలని  

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ ఆదేశం


న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ గ్రూప్‌-రిలయన్స్‌ డీల్‌కు బ్రేక్‌ పడింది. ‘ఫ్యూచర్‌’లో వాటాలున్న అమెజాన్‌.. ఈ ఒప్పందాన్ని సవాలు చేస్తూ సింగపూర్‌లోని ఆర్బిట్రేషన్‌ కోర్టును ఆశ్రయించింది. తుది తీర్పు ఇచ్చేవరకు ఈ డీల్‌ నిలిపివేయాలంటూ ఆర్బిట్రేషన్‌ ఏకసభ్య ప్యానెల్‌ తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసింది. కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) ఈ ఏడాది ఆగస్టు 29న ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌజింగ్‌ వ్యాపారాలను చేజిక్కించుకుంది. 


అయితే, ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌ ఇప్పటికే వాటా కలిగి ఉంది. ఫ్యూచర్‌ రిటైల్‌ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాను గత ఏడాది అమెజాన్‌ కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లోనూ పరోక్ష వాటా లభించింది. అంతేకాదు, ఆ ఒప్పందంలో భాగంగా, ఫ్యూచ ర్‌ రిటైల్‌లో ప్రమోటర్‌ వాటాను మొత్తంగా కొనుగోలు చేసే ప్రథమ హక్కును సైతం అమెజాన్‌ దక్కించుకుంది. అంటే, అమెజాన్‌ తిరస్కరిస్తే తప్ప బియానీ ఇతరులకు వాటా విక్రయించేందుకు వీల్లేదన్నమాట. 

        


  స్వాగతిస్తున్నాం: అమెజాన్‌ 

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ ఉత్తర్వును అమెజాన్‌ స్వాగతించింది. ప్రత్యర్థి రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఫ్యూచర్‌ గ్రూప్‌ తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టును అతిక్రమించిందని అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, రిలయన్స్‌ మాత్రం ఫ్యూచర్‌ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని జాప్యం చేయకుండా ముగిస్తామని అంటోంది. భారత చట్టం ప్రకారం హక్కులు, బాధ్యతలు పూర్తిగా అమలు చేసేందుకు తగిన న్యాయ సలహా తీసుకున్నాకే ఫ్యూచర్‌ గ్రూప్‌తో డీల్‌ కుదుర్చుకోవడం జరిగిందని రిలయన్స్‌ అంటోంది. 

       

అంబానీతో బెజోస్‌ అమీతుమీ 

అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ ఈ వివాదం ద్వారా అంబానీతో యుద్ధానికి తెరలేపారని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. సుమారు రూ.75 లక్షల కోట్ల స్థాయికి చేరిన భారత రిటైల్‌ మార్కెట్లో ఈ-కామర్స్‌ సేవలకు డిమాండ్‌ శరవేగంగా పెరుగుతోంది. ఆన్‌లైన్‌ కామర్స్‌లో ఇప్పటివరకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌దే ఆధిపత్యం.

వీరికి పోటీగా అంబానీ సైతం జియోమార్ట్‌ పేరుతో మే నెలలో ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టారు. సేవలను విస్తృతపర్చుకోవడంతో పాటు ఆన్‌లైన్‌ కిరాణాపై పట్టు సాధించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆస్తులు కీలకంగా మారాయి. ఈ వివాదంలో చివరికి ఎవరిది పైచేయి అనేది ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ 90 రోజుల్లో తేల్చనుంది. 
సెన్సెక్స్‌ డౌన్‌ 


అమెజాన్‌-రిలయన్స్‌ మధ్య పోరు దలాల్‌స్ట్రీట్‌ వర్గాల్లో దడ పుట్టించింది. దాంతో ట్రేడర్లు రిలయన్స్‌ షేర్లలో అమ్మకాలు పోటెత్తించారు. గ్లోబల్‌ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, రూపాయి క్షీణత మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. ఫలి తంగా స్టాక్‌మార్కెట్‌ సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 737 పాయింట్లు పతనమైంది. చివరికి 540 పాయింట్ల నష్టంతో 40,145.50 వద్ద నిలిచింది. నిఫ్టీ 162.60 పాయింట్లు క్షీణించి 11,767.75 వద్ద ముగిసింది. బజాజ్‌ ఆటో అత్యధికంగా 6.10 శాతం తగ్గింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 4.53 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3.97 శాతం నష్టపోయాయి. 
సవాలు చేస్తాం

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ ఉత్తర్వును సవాలు చేస్తామని ఫ్యూచర్‌ రిటైల్‌ సంకేతాలిచ్చింది.

ఏ అగ్రిమెంట్‌ ఆధారంగా అమెజాన్‌ మధ్యవర్తిత్వం కోరిందో, దాంట్లో తాము ‘పార్టీ’గా లేమని ఫ్యూచర్‌ రిటైల్‌ పేర్కొంది. 

Updated Date - 2020-10-27T05:56:11+05:30 IST