స్టాకులన్నీ ..షేక్‌!

ABN , First Publish Date - 2020-03-24T10:12:17+05:30 IST

కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దలాల్‌ స్ట్రీట్‌ బెంబేలెత్తిపోయింది. బేర్‌ స్ర్టోక్‌కు మార్కెట్‌ మళ్లీ కుప్పకూలింది. సెన్సెక్స్‌, నిఫ్టీ మా ర్కెట్‌ చరిత్రలో...

స్టాకులన్నీ ..షేక్‌!

  • స్టాక్‌ మార్కెట్లకు మరో బ్లాక్‌ మండే
  • సెన్సెక్స్‌ సుమారు 3,935 పాయింట్లు డౌన్‌ 
  • దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలో అతి పెద్ద పతనం
  • రూ.14.22 లక్షల కోట్ల సంపద ఆవిరి 
  • 100 పైసల మేరకు పడిన రూపాయి 
  • డాలరుతో పోలిస్తే 76.20కు చేరిక.. బ్యాంకింగ్‌ షేర్లు భారీ పతనంబీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ : రూ.1,01,86,936.28 కోట్లు

కరోనాతో ఈ ఏడాది ఇన్వెస్టర్లు నష్టపోయిన సంపద : రూ. 52 లక్షల కోట్లు


ముంబై: కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దలాల్‌ స్ట్రీట్‌ బెంబేలెత్తిపోయింది. బేర్‌ స్ర్టోక్‌కు మార్కెట్‌ మళ్లీ కుప్పకూలింది. సెన్సెక్స్‌, నిఫ్టీ మా ర్కెట్‌ చరిత్రలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసుకున్నాయి. ఒకే ట్రేడింగ్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ దాదాపు 4,000 పాయింట్లు, నిఫ్టీ 1,100 పాయుంట్లకు పైగా పడిపోవడం ఇదే తొలిసారి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలోనే సూచీలు 10 శాతం పైగా పతనమై లోయర్‌ సర్క్యూట్‌ను తాకటంతో ఎక్స్ఛేంజీలు ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేశాయి. ట్రేడింగ్‌ పునఃప్రారంభమయ్యాక కూడా నష్టాల పరంపర కొనసాగింది. నష్టాలు మరింతగా పెరిగాయి కూడా. 


దీంతో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద ఒక్క రోజులోనే రూ.14 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయింది. ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించడంతో సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల షేర్లూ నష్టపోయాయి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీల షేర్లు చితికిపోయాయి. అన్ని రంగాల సూచీలూ నేలచూపులు చూశాయి. మహా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లూ నష్టా ల బాటలోనే పయనించాయి. 


ఈ పతనం ఎందాక? 

మార్కెట్‌ పేకమేడలా కూలుతున్నప్పుడు విధ్వంసం ముగిశాక మొ త్తం నష్టాన్ని బేరీజు వేసుకోవాలే తప్ప ముందుగానే అంచనా వేయలేమని మార్కెట్‌ వర్గాలన్నాయి. ప్రస్తు తం సూచీల పతనానికి ఏ స్థాయిలో అడ్డుకట్ట పడుతుందని చెప్పడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. 


6,200 స్థాయికి నిఫ్టీ?

మార్కెట్‌  టెక్నికల్‌ చార్టులు ఇంకా బేరిష్‌ ట్రెండ్‌నే కనబరుస్తున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ మరో 1,500-1,600 పాయింట్ల వరకు పతనమై 6,200 స్థాయికి చేరవచ్చంటున్నారు.


మోదీ హయాంలో లాభాలు పూర్తిగా హరీ

నరేంద్ర మోదీ ప్రభుత హయాంలో స్టాక్‌ మార్కెట్లు ఆర్జించిన లాభాలు కరోనా ధాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా ఉన్నాయి. 2014 మే 26న మోదీ భారత ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంతక్రితం సెషన్‌లో (మే 23) సెన్సెక్స్‌ 24,693, నిఫ్టీ 7,367 వద్ద ముగిశాయి. ఈ ఏడాది జనవరి 20న నిఫ్టీ 12,430 వద్ద ఆల్‌టైం రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది. అంటే, మోదీ హయాంలో సూచీ 69 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. కానీ, కరోనా ధాటికి గడిచిన రెండు నెలల్లో సూచీలు భారీగా పతనమవుతూ వచ్చాయి. ప్రస్తుతం 7,600 స్థాయికి జారుకుంది.  మరో 300 పాయింట్లు పడితే మోదీ హయాంలో ఆర్జించిన లాభాలన్నీ తుడిచి పెట్టుకుపోయినట్టే. 


జీవితకాల కనిష్ఠ స్థాయికి రూపాయి

అమెరికా డాలర్‌తో రూపాయి మారకం రేటు వెలవెలబోతోంది. సోమవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి వంద పైసలు నష్టపోయి జీవితకాల కనిష్ఠ స్థాయి రూ.76.20 వద్ద ముగిసింది. గత ఏడు నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒకే రోజు ఈ స్థాయిలో ఎన్నడూ పడిపోలేదు. కరోనా భయాలతో స్టాక్‌ మార్కెట్‌ కుదేలవడం,  రూపాయి మారకం రేటును దెబ్బతీసింది. 


సెన్సెక్స్‌  టాప్‌-10 లూజర్స్‌ 


కంపెనీ   
 నష్టం(%)
యాక్సిస్‌ బ్యాంక్‌
28.01
బజాజ్‌ ఫైనాన్స్‌
23.57
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
23.50
ఐసీఐసీఐ బ్యాంక్‌
17.88
మారుతి సుజుకీ
17.02
ఎల్‌అండ్‌టీ
16.31
టెక్‌ మహీంద్రా
14.90
అల్ట్రాటెక్ సిమెంట్‌
14.60
ఏషియన్‌ పెయింట్స్‌
14.15
బజాజ్‌ ఆటో
13.95


Read more