కంపెనీలకు ఊరట
ABN , First Publish Date - 2020-05-18T07:17:14+05:30 IST
కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని చర్యలు ప్రకటించారు. రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలకు ఊరటను ఇచ్చేలా దివాలా చట్టం...

- దివాలా చట్టం నుంచి ఏడాది పాటు మినహాయింపు
- కనీస రుణ పరిమితి రూ.కోటికి పెంపు
- పీఎ్‌సయూల ప్రైవేటీకరణకు పెద్ద పీట
- కంపెనీల చట్టంలోనూ సవరణలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని చర్యలు ప్రకటించారు. రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలకు ఊరటను ఇచ్చేలా దివాలా చట్టం (ఐబీసీ) సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేయబోతున్నట్టు వెల్లడించారు. మరోవైపు పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ (పీఎ్‌సయు)లను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యూహాత్మకం కాని (నాన్ స్ట్రాటజిక్) రంగాలకు చెందిన పీఎ్‌సయులను పూర్తిగా అమ్మేయాలని నిర్ణయించింది. కంపెనీల చట్టంలో నేరాలుగా పరిగణించే కొన్ని చర్యలనూ పక్కన పెట్టింది. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో చివరిదైన ఐదో విడత ప్యాకేజీని ఆదివారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ వివరాలు..
దివాలా చట్టం
కరోనా దెబ్బకు ప్రస్తుతం చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కంపెనీలన్నీ తీవ్ర ‘ఆర్థిక’ కష్టాల్లో పడ్డాయి. ఆదాయాలు అడుగంటాయి. చేసిన అప్పులు తీర్చడం కష్టంగా మారిం ది. దీంతో ‘దివాలా’ చట్టం నుంచి కంపెనీలు, వ్యాపారాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్స్ తీసుకు రాబోతున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ ఆర్డినెన్స్‌లో ముఖ్యాంశాలు ఏమిటంటే..
- దివాలా చట్టం పరిధిలోకి వచ్చే కనీస రుణ పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.కోటికి పెంపు
- ఏడాది వరకు కంపెనీలకు దివాలా చట్టం నుంచి మినహాయింపు
- కోవిడ్-19 సమయంలో తీసుకున్న అప్పులకు ‘దివాలా’ నిర్వచనం వర్తించదు
- ఎంఎ్‌సఎంఈల కోసం త్వరలో దివాలా చట్టంలో ప్రత్యేక మార్పులు
‘ప్రైవేట్’ మంత్రం
ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ చర్యలతో ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. దాదాపు అన్ని రంగాల్లోని పీఎ్‌సయూలను ప్రైవేటీకరించనుంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక, వ్యూహాత్మకం కాని రంగాలుగా ఈ సంస్థలను విభజించనుంది. అనంతరం వ్యూహాత్మకం కాని పీఎ్‌సయూలు అన్నింటిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యూహాత్మక రంగాల్లోనూ నాలుగుకు మించి పీఎ్‌సయూలు ఉండవని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
- త్వరలో వ్యూహాత్మక, వ్యూహాత్మం కాని రంగాలను నిర్వచిస్తూ కొత్త ప్రభుత్వ రంగ సంస్థల విధానం ప్రకటన
- అవసరాన్ని బట్టి వ్యూహాత్మకం కాని పీఎ్‌సయూ లన్నీ ప్రైవేటీకరణ
- వ్యూహాత్మక రంగాల్లో ప్రైవేటు కంపెనీలకూ అనుమతి
- వ్యూహాత్మక రంగాల్లో ఇక ఒకటి నుంచి నాలుగు మాత్రమే పీఎ్‌సయూలు
- వ్యూహాత్మక రంగంలో నాలుగుకు మించి పీఎ్‌సయూలు ఉంటే వాటి ప్రైవేటీకరణ, విలీనం లేదా హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు

కంపెనీల చట్టంలో మార్పులు
సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కు అడ్డంకిగా ఉన్న కంపెనీల చట్టంలోని కొన్ని నిబంధనల నూ సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో నే ఒక ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కంపెనీల చట్టంలో తీసుకురానున్న సవరణలేమిటంటే..
- దేశీయ కంపెనీలు తమ షేర్లు, రుణ పత్రాలను ఇక నేరుగా అనుమతించిన దేశాల స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదు చేసుకోవచ్చు.
- రాజీకి వీలున్న ఏడు నేరాలను నేరాల జాబితా నుంచి తొలగింపు
- రాజీకి అవకాశం ఉన్న ఐదు నేరాల పరిష్కారం మధ్యవర్తిత్వం వంటి ప్రత్యామ్నాయ పరిష్కార జాబితాకు మార్పు
- రాజీకి వచ్చే నేరాల పరిష్కారానికి సంబంధించి ప్రాంతీయ డైరెక్టర్లకు మరిన్ని అధికారాలు
- రూ.50 లక్షలు అంతకంటే తక్కువ మొత్తంలో సీఎ్‌సఆర్ నిఽధులు ఖర్చు చేసే కంపెనీలు ప్రత్యేకంగా అందుకోసం కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు
