యూఎస్‌ మార్కెట్లోకి 50 ఔషధాలు

ABN , First Publish Date - 2020-06-23T05:53:19+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్లోకి దాదాపు 50 నుంచి 60 ఔషధాలను విడుదల చేయాలని అరబిందో ఫార్మా భావిస్తోంది. ఇందులో ఇప్పటికే దాదాపు 25 ఔషధాల విక్రయానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి...

యూఎస్‌ మార్కెట్లోకి  50 ఔషధాలు

  • 2020-21కి అరబిందో ఫార్మా ప్రణాళిక 
  • 5 బయో సిమిలర్లపై దృష్టి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్లోకి దాదాపు 50 నుంచి 60 ఔషధాలను విడుదల చేయాలని అరబిందో ఫార్మా భావిస్తోంది. ఇందులో ఇప్పటికే దాదాపు 25 ఔషధాల విక్రయానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎ్‌సఎ్‌ఫడీఏ) నుంచి అనుమతి లభించింది. కొత్తగా విడుదల చేసే ఔషధాల్లో ఇంజెక్టబుల్స్‌ కూడా ఉంటాయి. ఫార్ములేషన్ల వ్యాపారంలో గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా విక్రయాలు 27 శాతం పెరిగి రూ.11,484 కోట్లకు చేరాయి. కొత్త ఫార్ములేషన్ల విడుదల, అమ్మకాల పరిమాణం పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరంలో 34 కొత్త ఔషధాలను అమెరికా విపణిలోకి అరబిందో ఫార్మా ప్రవేశపెట్టింది.  

ఇన్‌హేలర్ల అభివృద్ధి: కంపెనీ ఆరు మీటర్డ్‌ డోస్‌ ఇన్‌హేలర్లతోపాటు మొత్తం 8 ఇన్‌హేలర్లను అభివృద్ధి చేస్తోంది. ఆరు నాజల్‌ స్ర్పేలను అభివృద్ధి చేసే పని కూడా జరుగుతోంది. ఇందులో రెండు నాజల్‌ స్ర్పేల అనుమతి కోసం ఇప్పటికే దరఖాస్తు చేసింది. టాపికల్స్‌ విభాగంలో 37 ఉత్పత్తులు అభివృద్ధి ప్రక్రియలో ఉన్నాయి.

యూరోప్‌ మార్కెట్లోకి బయోసిమిలర్లు: బయోసిమిలర్ల వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించే ఉద్దేశంతో బయోసిమిలర్ల విభాగాన్ని నూరు శాతం సొంత అనుబంధ సంస్థకు అరబిందో బదిలీ చేస్తోంది. బయోసిమిలర్ల వ్యాపారం కోసం నిధులు సమీకరించాలని యోచిస్తోంది. ఈ విభాగంలో రూ.400-500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. కంపెనీ మొత్తం 14 బయోసిమిలర్లను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇందులో ముందుగా 5 ఉత్పత్తులపై దృష్టి పెట్టింది.  

చైనాలో కార్యకలాపాలు: చైనా మార్కెట్లో ఔషధాలను విడుదల చేయడానికి అవసరమైన అనుమతుల కోసం కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసింది. భాగస్వామ్యాలు, ఇతర పద్ధతుల్లో చైనాలో 2 లేదా 3 తయారీ సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ యోచన. సొంత ఓరల్‌ ఫార్ములేషన్ల తయారీ యూనిట్‌ నిర్మాణంలో ఉంది. 2020-21 ద్వితీయార్ధంలో ఈ యూనిట్‌ నుంచి ఎగ్జిబిట్‌ బ్యాచ్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై  5.5 శాతం ఖర్చుచేయాలని యోచిస్తోంది.


Updated Date - 2020-06-23T05:53:19+05:30 IST