వచ్చే ఏడాది బయోసిమిలర్లపై అరబిందో దరఖాస్తు
ABN , First Publish Date - 2020-12-03T06:25:31+05:30 IST
మూడు బయోసిమిలర్ ఔషధాలను యూరప్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు వచ్చే ఏడాది చివరకు అరబిందో ఫార్మా దరఖాస్తు చేయనుంది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మూడు బయోసిమిలర్ ఔషధాలను యూరప్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు వచ్చే ఏడాది చివరకు అరబిందో ఫార్మా దరఖాస్తు చేయనుంది. మరో రెండు బయోసిమిలర్లను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు అనుమతులు కోరనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ గోవింద రాజన్ తెలిపారు. బయోసిమిలర్లపై క్లినికల్ పరీక్షలు ప్రారంభించినట్లు చెప్పారు. దాదాపు గత ఆరు నెలల్లో బయోసిమిలర్ల క్లినికల్ పరీక్షలపై 2.1 కోట్ల డాలర్ల (దాదాపు రూ.140 కోట్లు) వరకూ అరబిందో ఖర్చు చేసింది. ఇవి కాక మరో రెండు బయోసిమిలర్లపై 2022 మధ్యలో లేదా 2023లో క్లినికల్ పరీక్షలు ప్రారంభించనుంది. బయోసిమిలర్లపై క్లినికల్ పరీక్షల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధి వ్యయం రూ.408 కోట్లకు చేరింది. మొత్తం ఏడాదికి ఆదాయంలో ఆర్ అండ్ డీ వ్యయం 5.5-6 శాతం ఉండగలదని చెప్పారు.
షేర్ల బైబ్యాక్ ఆలోచన లేదు
అమెరికా, ఇతర మార్కెట్ల నుంచి ప్రస్తుతం జనరిక్ ఇంజెక్టబుల్స్ ద్వారా 38 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తోంది. వచ్చే మూడేళ్లలో ఇది 65-70 కోట్ల డాలర్లకు చేరగలదని అంచనా వేస్తోంది. విస్తరణ కార్యకలాపాలకు 18 కోట్ల నుంచి 20 కోట్ల డాలర్లు (దాదాపు రూ.1,400 కోట్లు) ఖర్చు చేయనుంది. పీఎల్ఐ పథకం కింద పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. విస్తరణకు నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నందున ప్రస్తుతానికి షేర్ల బైబ్యాక్ ఆలోచన లేదని, ఇవన్నీ పూర్తయిన తర్వాత బోర్డు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని గోవిందరాజన్ చెప్పారు.
అమెరికాలోని నాట్రోల్ ఎల్ఎల్సీ విక్రయాన్ని అరబిందో పూర్తి చేసింది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ న్యూ మౌటెన్ కేపిటల్‌కు చెందిన కంపెనీ, జారో ఫార్ములాస్ ఐఎన్సీతో ఒప్పం దానికి అనుగుణంగా నవంబరు 30 నాటికి నాట్రోల్ వ్యాపార ఆస్తులు, అప్పులు, ఉత్పత్తులు, బ్రాండ్లను బదిలీ చేసినట్లు తెలిపింది.