చైనాలో తిరిగి తెరుచుకున్న యాపిల్ రిటైల్ స్టోర్లు

ABN , First Publish Date - 2020-03-13T23:13:08+05:30 IST

చైనాలో కరోనా వైరస్ కొత్త కేసుల నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పరిస్థితులు నెమ్మదిగా కొలిక్కి వస్తున్నాయి.

చైనాలో తిరిగి తెరుచుకున్న యాపిల్ రిటైల్ స్టోర్లు

బీజింగ్: చైనాలో కరోనా వైరస్ కొత్త కేసుల నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పరిస్థితులు నెమ్మదిగా కొలిక్కి వస్తున్నాయి. దీంతో కరోనా కారణంగా చైనాలో మూసివేసిన 42 రిటైల్ స్టోర్లను యాపిల్ తిరిగి తెరిచింది. వైద్య నిపుణుల సూచనతో దేశవ్యాప్తంగా ఉన్న ఈ 42 షాపులను ఫిబ్రవరి 1 నుంచి యాపిల్ మూసివేసింది. ఫిబ్రవరి 9న తిరిగి తెరవనున్నట్టు అప్పట్లో ప్రకటించినప్పటికీ  ఆ తర్వాత వాయిదా వేసింది. స్టోర్ల మూతతో ఐఫోన్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. 


దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని గురువారం చైనా ప్రకటించింది. కోవిడ్-19ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన మర్నాడే చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.


కాగా, సప్లై సమస్యల కారణంగా అమెరికాలోని యాపిల్ రిటైల్ షాపుల నుంచి ఐఫోన్ 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లు మాయమయ్యాయి. చాలా షాపుల్లో ఐఫోన్లు కనిపించడం లేదు. కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 


చైనాలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో విడిభాగాల తయారీ సంస్థలు నెమ్మదిగా రంగంలోకి దిగుతున్నాయి. లో-సీజన్ సామర్థ్యంతో పోలిస్తే అందులో సగం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్టు యాపిల్ సప్లయర్ అయిన ఫాక్స్‌కాన్ తెలిపింది. అంటే పూర్తిస్థాయి సామర్థ్యంలో 25 శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్టు ఫాక్స్‌కాన్ పేర్కొంది. 

Updated Date - 2020-03-13T23:13:08+05:30 IST