వాటాలు అమ్మకుంటునన్న అనిల్ అంబానీ...
ABN , First Publish Date - 2020-11-04T01:14:25+05:30 IST
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి బ్యాంకుల నుంచి ఎదురు దెబ్బ తగులుతోంది. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకులు... అనిల్ సంస్థల ఆస్తుల అమ్మకానికి సిద్ధమవుతున్నట్లుగా వినవస్తోంది.
ముంబై : అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి బ్యాంకుల నుంచి ఎదురు దెబ్బ తగులుతోంది. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకులు... అనిల్ సంస్థల ఆస్తుల అమ్మకానికి సిద్ధమవుతున్నట్లుగా వినవస్తోంది.
తాజాగా... అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌లోని రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌సీఎల్) తన అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయానికి సిద్ధమైంది. ఆసక్తి కలిగిన కొనుగోలుదారుల నుండి బిడ్స్‌ను ఆహ్వానిస్తోంది. వాటాల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముతో రూ. 20 వేల కోట్ల అప్పులను చెల్లించనున్నట్లు తెలిపింది. మొత్తం వాటాలకు గానీ, లేదంటే అనుబంధ సంస్థలైన రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్, రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్, రిలయన్స్ అసెట్ రీ కన్స్ట్రక్షన్ లిమిటెడ్‌లో కొంత భాగం వాటాలకు సంబంధించి బిడ్స్‌ను ఆహ్వానించింది.
ఈ సంస్థల్లో వాటాల విక్రయం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ. 252 కోట్ల మేరకు చెల్లించిన పెయిడప్ క్యాపిటల్‌తో తమ పూర్తి ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థ రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీతో పాటు 51 శాతం వాటా కలిగి ఉన్న రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీని విక్రయించాలని ఆర్‌సీఎల్ భావిస్తోంది. జపాన్ నిప్పోన్ లైఫ్‌తో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇక... సెప్టెంబరు 30 నాటికి ఈ కంపెనీ చెల్లించిన మూలధనం రూ. 1,196 కోట్లు. సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ. 21,912 కోట్లు. కాగా... 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 35 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వీటిలో వంద శాతం వాటా విక్రయం రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ ఫైనాన్స్‌లలో వందశాతం వాటాలను విక్రయించేందుకు ఆర్‌సీఎల్ సిద్ధపడింది. రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్, ఇతర పీఈ పెట్టుబడులపై నఫా ఇన్నోవేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, పేటీఎం ఈ-కామర్స్ ప్రయివేట్ లిమిటెడ్ నుండి బయటకు వచ్చేందుకు యోచిస్తున్నట్లు వినవస్తోంది. రిలయన్స్ అసెట్ రీకన్స్ర్టక్షన్ లిమిటెడ్‌లో 49 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. సెప్టెంబర్ 30 నాటికి సంస్థ నిర్వహణలో దాదాపు రూ. 2 వేల కోట్ల పోర్ట్‌పోలియో నమోదైంది. ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజీలో ఆర్‌సీఎల్ కు ఉన్న 20 శాతంవాటాను కూడా విక్రయించనుంది. అనిల్ అంబానీ సంస్థలకు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, చైనాకు చెందిన మూడు బ్యాంకులు రుణాలనందించాయి.