నా ఆస్తి సున్నా!
ABN , First Publish Date - 2020-02-08T07:44:08+05:30 IST
ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ మాత్రం ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను..

- అప్పట్లో శ్రీమంతుడినే.. కానీ ఇప్పుడేం లేదు
- బ్రిటన్ కోర్టుకు వెల్లడించిన అనిల్ అంబానీ
లండన్: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ మాత్రం ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వ్యాపారాల్లో ఎంతగా దివాలా తీశాడంటే, తన దగ్గరిక చెల్లించడానికేం లేదని చేతులెత్తేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గతంలో అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్).. చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. దివాలా తీసిన ఆర్‌కామ్.. చైనా బ్యాంకులకు రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది.
తమకు రావాల్సిన 68 కోట్ల డాలర్ల బకాయిల కోసం ఆ బ్యాంకులు లండన్‌లోని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించాయి. ఈ రుణానికి అనిల్ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారని, ఆయన ఆస్తుల విక్రయం ద్వారా బకాయిల రికవరీకి అవకాశం కల్పించాలని బ్యాంకు లు వాదిస్తున్నాయి. కాగా, విధిగా పాటించాల్సిన హామీ మాత్రం ఇవ్వలేదని అనిల్ అంటున్నారు. ‘‘తన పెట్టుబడుల విలువ పూర్తిగా పతనమైంది. గ్రూపు కంపెనీల్లోని తన ఈక్విటీ వాటా విలువ దాదాపు 8.24 కోట్ల డాలర్లకు క్షీణించింది. తాను చెల్లించాల్సిన అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడాయన ఆస్తి సున్నా. అప్పట్లో శ్రీమంతుడే, కానీ ఇప్పుడాయన దగ్గరేం లేదు’’ అని అనిల్ తరఫు న్యాయవాది రాబర్ట్ హోవే కోర్టుకు విన్నవించారు.
అయితే, అంబానీ వాదనలను బ్యాంకుల తరఫు న్యాయవాద కౌన్సిల్ ప్రశ్నించింది. ఆ సందర్భంగా అనిల్ విలాస జీవన వైభోగం గురించి ప్రస్తావించింది. అనిల్‌కు 11 లగ్జరీ కార్లు, సొంత నౌక, ప్రైవేట్ జెట్‌తో పాటు దక్షిణ ముంబైలో సీవిండ్ పెంట్‌హౌజ్ కూడా ఉందని కోర్టుకు నివేదించింది. ఈ కేసులో అనిల్ తరఫు కౌన్సిల్ వాదనలతో సంతృప్తి చెందని కోర్టు ధర్మాసనం.. ఆరు వారాల్లో 10 కోట్ల డాలర్లు డిపాజిట్ చేయాలని అంబానీని ఆదేశించింది.