నష్టాలకు వెరవని అమెజాన్‌

ABN , First Publish Date - 2020-12-30T08:45:15+05:30 IST

అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నష్టాలకు వెరవకుండా, భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2020 మార్చితో ముగిసిన 2019

నష్టాలకు వెరవని అమెజాన్‌

2019-20లో  రూ.11,400 కోట్ల పెట్టుబడులు

ఇదే కాలంలో నష్టాలు రూ.7,899 కోట్లు


న్యూఢిల్లీ: అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం  అమెజాన్‌ నష్టాలకు వెరవకుండా, భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2020 మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ భారత్‌లో కొత్తగా రూ.11,400 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇదే సమయంలో కంపెనీ భారత్‌లోని వ్యాపారాల్లో రూ.7,899 కోట్ల భారీ నష్టాలు చవి చూసింది. ప్రచారం, పంపిణీ ఖర్చులు పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది. 


భవిష్యత్‌ భేష్‌ :

కొద్ది సమస్యలు ఉన్నా భారత్‌లో ఆన్‌లైన్‌ వ్యాపారాకు మంచి భవిష్యత్‌ ఉందని అమెజాన్‌ భావిస్తోంది. దీనికి తగ్గట్టే భారత్‌లోని అమెజాన్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌, అమెజాన్‌ పే (ఇండియా), అమెజాన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌ ఆదాయాలు గత ఏడాది 42.7 శాతం నుంచి 63.1 శాతం మధ్య పెరిగాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌లో తన వ్యాపారాల్ని మరింత విస్తరించేందుకు అమెజాన్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే భారత్‌లో కొత్తగా మరో 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7,400 కోట్లు) పెట్టనున్నట్టు అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. 


ఫ్యూచర్‌-రిలయన్స్‌ డీల్‌ ఆపాల్సిందే:

భారత్‌లో సొంత వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఫ్యూచర్‌ రిటైల్‌-రిలయన్స్‌ రిటైల్‌ విలీనాన్ని అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నించాలని అమెజాన్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ డీల్‌కు నిరభ్యంతర పత్రం ఇవ్వొద్దని సెబీని కోరింది. సింగపూర్‌లోని అంతర్జాతీయ అర్బిట్రేషన్‌ కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు భారత చట్టాల పరిధిలోకి వస్తాయని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. 

Updated Date - 2020-12-30T08:45:15+05:30 IST