సాఫ్ట్‌బ్యాంక్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జాక్ మా
ABN , First Publish Date - 2020-05-18T19:50:34+05:30 IST
చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాక్ మా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతల నుంచి ఆయన

బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాక్ మా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటున్నారని.. సంస్థ సోమవారం తెలిపింది. అలీబాబా సంస్థ సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ మా ప్రస్తుతం సమాజసేవపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు, కిట్‌లు పంపిణీ చేయడం.. తదితర పనులపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం.
అదే విధంగా ముగ్గురు కొత్త సభ్యులను బోర్డులోకి ఆహ్వానిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ స్పష్టం చేసింది. సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ యోమిస్టో గోటో, వసేదా యునివర్సిటీ ప్రోఫెసర్ యుకో కావమోటోతో పాటు వాల్డెన్ ఇంటర్‌నేషనల్ వ్యవస్థాపకులు లిప్-బు టాన్‌లు కొత్త బోర్డు సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 500 బిలియన్ యెన్‌ల విలువైన షేర్లను సాఫ్ట్‌బ్యాంక్ తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. అలీబాబాలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన సంస్థ సాఫ్ట్ బ్యాంక్. 2007లో ఈ సంస్థతో జత కట్టిన జాక్ మా.. ఆ సంస్థ సీఈవో మసయోషి సన్‌కి మంచి మిత్రుడు.