ఆరోగ్య సమస్యలకు ‘ఏఐ’ పరిష్కారాలు

ABN , First Publish Date - 2020-10-13T07:16:02+05:30 IST

ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్‌ మొబిలిటీ వంటి విభాగాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సొల్యూషన్లను అభివృద్ధి చేయడంపై ఇంటెల్‌ దృష్టి పెట్టనుంది...

ఆరోగ్య సమస్యలకు ‘ఏఐ’ పరిష్కారాలు

  • హైదరాబాద్‌లో ఇంటెల్‌ అప్లైడ్‌ ఏఐ పరిశోధన కేంద్రం
  • రెండేళ్లలో 30 వేల ఏఐ ఉద్యోగాలు: జయేశ్‌ రంజన్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్‌ మొబిలిటీ వంటి విభాగాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సొల్యూషన్లను అభివృద్ధి చేయడంపై ఇంటెల్‌ దృష్టి పెట్టనుంది. ఏఐ విప్లవంతో ఈ రంగాల్లో మరింత విలువను సృష్టించాల్సి ఉందని ఇంటెల్‌ ఇండియా అధిపతి నివృతి రాయ్‌ అన్నారు.


ఆల్‌ డాట్‌ ఏఐ పేరుతో కృత్రిమ మేధపై ఇంటెల్‌ వర్చువల్‌ సదస్సును ప్రారంభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అప్లైడ్‌ ఏఐ రీసెర్చ్‌ కేంద్రం ‘ఐఎన్‌ఏఐ’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, ట్రిపుల్‌ ఐటీ, హైదరాబాద్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీహెచ్‌ఎ ఫ్‌)తో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్‌ మొబిలిటీ వంటి రంగాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఈ కేంద్రం పరిశ్రమ, విద్యా సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. ఈ పరిశోధన కేంద్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. ఏఐలో నిపుణులు, టెక్నాలజీ, మేధో సంపత్తి హక్కులు, డేటా సెట్స్‌లో భారత్‌ తన సామర్థ్యాలను పెంచుకోవాలని, దేశం ఎదుర్కొంటున్న భిన్నమైన సమస్యల పరిష్కారంలో ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడానికి పక్షపాత రహిత విధానాలను ప్రవేశపెట్టాలని రాయ్‌ సూచించారు.  


మరో మణిహారం..

హైదరాబాద్‌ ఇప్పటికే ఏఐ టెక్నాలజీకి కేంద్రంగా ఉందని, ఇంటెల్‌ అప్లైడ్‌ ఏఐ రీసెర్చ్‌ కేంద్రం దీన్ని మరింత పటిష్టం చేస్తుందని తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. ఏఐ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆరు రకాల చర్యలతో ముందుకు అడుగులు వేస్తోందన్నారు. కృత్రి మ మేధ టెక్నాలజీలో వచ్చే రెండేళ్లలో 30,000 ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో 19 రకాల నిపుణుల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. ఏఐ టెక్నాలజీ కోసం ఇన్నోవేషన్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. 


Updated Date - 2020-10-13T07:16:02+05:30 IST