గృహ విక్రయాల్లో 61శాతం క్షీణత

ABN , First Publish Date - 2020-09-29T06:58:23+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 61 శాతం క్షీణించి 14,415 యూనిట్లకు పరిమితం కావచ్చని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది...

గృహ విక్రయాల్లో 61శాతం క్షీణత


  • జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి జేఎల్‌ఎల్‌ అంచనా 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 61 శాతం క్షీణించి 14,415 యూనిట్లకు పరిమితం కావచ్చని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలానికి ఈ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 36,826 యూనిట్లుగా నమోదయ్యాయని తాజా నివేదికలో జేఎల్‌ఎల్‌ పేర్కొంది. 


త్రైమాసిక ప్రాతిపదకన పోలిస్తే మాత్రం విక్రయాలు 34 శాతం వృద్ధి చెందనున్నట్లు ఈ కన్సల్టింగ్‌ సంస్థ తెలిపింది. ఎందుకంటే, కరోనా సంక్షోభ తీవ్రత, లాక్‌డౌన్‌ ప్రభావంతో ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి హౌసింగ్‌ సేల్స్‌ 10,753 యూనిట్లకు పడిపోయాయి. ఈ ఏడు ప్రధాన నగరాల జాబితాలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, కోల్‌కతా ఉన్నాయి.

కస్టమర్లలో విశ్వాసం పెరిగితే మున్ముందు త్రైమాసికాల్లో గృహ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్‌ రమేశ్‌ నాయర్‌ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టే ప్రగతికారక విధానాలపై ఇది ఆధారపడి ఉందన్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించడంతోపాటు వచ్చే పండగ సీజన్‌ రియల్టీ కొనుగోళ్లు మరింత పెరిగేందుకు దోహదపడవచ్చని జేఎల్‌ఎల్‌ ప్రధాన ఆర్థికవేత్త సమంతక్‌ దాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 
భారత రెసిడెన్షియల్‌ మార్కెట్‌పై జాగురూకతతో కూడిన ఆశావహంతో ఉన్నాం. చౌక వడ్డీ రేట్లకే గృహ రుణాలు,  తగ్గిన ప్రాపర్టీ ధరలు, డెవలపర్లు కల్పిస్తోన్న సులభతర చెల్లింపుల వెసులుబాట్లు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు సానుకూల అంశాలుగా కన్పిస్తున్నాయి. గృహ కొనుగోలుకు వచ్చే 12 నెలలు సరైన సమయం. 

- రమేశ్‌ నాయర్‌, జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓUpdated Date - 2020-09-29T06:58:23+05:30 IST