2026 నాటికి 35 కోట్లు

ABN , First Publish Date - 2020-12-01T06:45:09+05:30 IST

వచ్చే ఆరేళ్ల (2026 నాటికి)లో ప్రపంచవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ కనెక్షన్ల సంఖ్య 350 కోట్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ టెలికాం టెక్నాలజీ కంపెనీ ఎరిక్సన్‌ అంటోంది...

2026 నాటికి 35 కోట్లు

  • భారత్‌లో 5జీ కనెక్షన్లపై ఎరిక్సన్‌ నివేదిక


న్యూఢిల్లీ: వచ్చే ఆరేళ్ల (2026 నాటికి)లో ప్రపంచవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ కనెక్షన్ల సంఖ్య 350 కోట్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ టెలికాం టెక్నాలజీ కంపెనీ ఎరిక్సన్‌ అంటోంది. అదే సమయానికి భారత్‌లో 5జీ కస్టమర్ల సంఖ్య 35 కోట్లుగా ఉండవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. భారత్‌లో వచ్చే ఏడాది తొలినాళ్లలోనే స్పెక్ట్రమ్‌ వేలం జరిగితే ఏడాది చివరికల్లా సేవలు అందుబాటులోకి రావచ్చని ఎరిక్సన్‌ భారత విభాగ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ అధిపతి నితిన్‌ బన్సల్‌ అన్నారు. వచ్చే ఏడాది నాటికి 5జీ నెట్‌వర్క్‌ కవరేజీ ప్రపంచ జనాభాలో 15 శాతం (100 కోట్లు) మందికి విస్తరించవచ్చన్నారు. 2026 నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ లభిస్తుందన్నారు. నివేదికలోని మరిన్ని విషయాలు.. 


  1. ప్రస్తుతం భారత్‌లో ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా డేటా వినియోగ సరాసరి నెలకు 15.7 గిగా బైట్లు (జీబీ)గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధికం. చౌక డేటా చార్జీలు, స్మార్ట్‌ఫోన్‌ ధరలు అందుబాటులో ఉండటం, మొబైల్‌ వినియోగదారులు ఆన్‌లైన్‌లో గడిపే సమయం గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. 
  2. 2026 నాటికి భారత్‌లో మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ నాలుగు రెట్లు పెరిగి 35 ఎక్సాబైట్లకు చేరుకునే అవకాశం ఉంది.
  3. ప్రస్తుతానికి మొత్తం మొబైల్‌ వినియోగదారుల్లో 63 శాతం మంది 4జీ యూజర్లే. 
  4. ఈ ఏడాది 71 కోట్ల స్థాయిలో ఉన్న భారత 4జీ వినియోగదారులు ఏటేటా 2 శాతం వృద్ధి చెంది 2026లో 82 కోట్లకు పెరగవచ్చని అంచనా. 
  5. 2020లో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీని వినియోగించుకుంటున్న మొబైల్‌ వినియోగదారుల వాటా 67 శాతం. 2026 నాటికి ఈ వాటా ఏకంగా 91 శాతానికి పెరగనుంది. 
  6. 2026 నాటికి భారత్‌లో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను వినియోగించుకునే మొబైల్‌ కస్టమర్ల సంఖ్య 120 కోట్లకు చేరుకోనుంది. 

Updated Date - 2020-12-01T06:45:09+05:30 IST