3 సానుకూలతలే ఊతం
ABN , First Publish Date - 2020-12-30T06:53:03+05:30 IST
కొవిడ్-19 కల్లోలం ముగిసిన అనంతరం మూడు సానుకూలతల ఆధారంగా భారత పునర్నిర్మాణం జరుగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (
ఆర్థిక వృద్ధిపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి అంచనా
కొవిడ్-19 కల్లోలం ముగిసిన అనంతరం మూడు సానుకూలతల ఆధారంగా భారత పునర్నిర్మాణం జరుగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. త్వరలో విడుదల కానున్న తుమ్మల కిశోర్ రచించిన ‘‘మాంద్యం ముంగిట దేశం’’ అనే పుస్తకానికి రాసిన ముందు మాటలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, శక్తివంతమైన ఫెడరలిజం, భారీ వినియోగం ఆ మూడు సానుకూలతలన్నారు. కరోనా కల్లోలం, లాక్‌డౌన్ల ప్రభావం వల్ల ఈ ఏడాది చరిత్రలోనే కనివిని ఎరుగని తిరోగమనం భారత్ చవిచూసిన విషయం విదితమే.
ముందుమాటలో ప్రధానాంశాలు...
ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలో ప్రవేశపెట్టడం, త్వరిత వృద్ధి ఫలాలు అల్పాదాయ గృహాలకు కూడా విస్తరించేలా సమ్మిళిత వృద్ధిని సాధించడం రాబోయే కాలంలో ప్రభుత్వం ముందున్న సవాళ్లు
కరోనా కన్నా ముందే వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. ఇప్పుడు ‘వి’ షేప్ రికవరీ ఏర్పడుతోందని సంబరపడుతున్నారు కానీ ఉత్పాదకత స్థాయిలు కూడా అదే రీతిలో పెరిగాయని అర్ధం కాదు. 2021-22లో ఉత్పత్తి స్థాయిలు 2019 -20 నాటి కన్నా తక్కువ స్థాయిలోనే ఉంటాయి
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిధిని విస్తరించడం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న వారికి జీవం కల్పించింది. అలాగే మహిళలు, పింఛనుదారులు, రైతులకు ముం దస్తు నగదు బదిలీ డిమాండు పుంజుకోవడానికి దోహదపడింది. ఎఫ్‌సీఐ కొనుగోళ్లు పెంచడంతో రైతుల ఆదాయాలు పెరిగాయి
జీఎ్‌సటీ పరిహారం విషయంలో కేంద్ర రాష్ర్టాల మధ్య విభేదాలున్నప్పటికీ దానికి అతీతంగా మహమ్మారి నిర్మూలనకు అందరూ చేసిన సంఘటిత కృషి మన ఫెడరలిజం బలం
135 కోట్ల జనాభా, 2 వేల డాలర్ల (రూ.1.5 లక్షలు) తలసరి ఆదాయం వినియోగానికి పునాది. సమాజంలో దిగువ అర్ధ భాగంలో ఉన్న వారి ఆదాయాలు పెంచేందుకు ఎలాంటి చర్య తీసుకున్నా అది వినియోగం పెరిగేందుకు దోహదకారి అవుతుంది.