25 ఏళ్ల అధోగతి

ABN , First Publish Date - 2020-09-17T06:27:46+05:30 IST

25 ఏళ్ల అధోగతి

25 ఏళ్ల అధోగతి

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 
  • మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ గోల్‌కీపర్స్‌ నివేదిక
  • 2021 చివరకు 12 లక్షల కోట్ల డాలర్ల నష్టం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. 25 వారాల్లో ఆ మహమ్మారి ప్రపంచాన్ని 25 సంవత్సరాల క్రితం స్థాయికి దిగజార్చిందని బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ విడుదల చేసిన గోల్‌కీపర్స్‌ నివేదిక పేర్కొంది. కొవిడ్‌-19 కారణంగా దుర్భర పేదరికం 7 శాతం పెరిగింది. ఆర్థిక నష్టం కారణంగా అసమానతలు బలోపేతం అయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. మహిళలు, మైనారిటీ వర్గాలు, పేదరికంలో నివసిస్తున్న ప్రజలపై ఈ మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఏ ఒక్క దేశం ఈ సవాలును ఒంటరిగా ఎదుర్కోలేదని, ఇతర  దేశాలను నిర్లక్ష్యం చేస్తూ.. ఒక దేశం తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తే కష్టాలు మరింత పెరుగుతాయని తెలిపింది.


ప్రపంచ వ్యాప్తంగా పలు ఆర్థిక వ్యవస్థలకు ఉత్తేజం కలిగించేందుకు ఇప్పటికే 18 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసినా.. 2021 చివరి నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 12 లక్షల కోట్ల డాలర్లు నష్టపోగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచ నా వేసింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద జీడీపీ నష్టమని వివరించింది. 2008లో ఆర్థిక మాంద్యం కారణంగా జరిగిన నష్టం కన్నా కొవిడ్‌-19 వల్ల కలిగిన నష్టం రెట్టింపు ఉందని పేర్కొంది. ఆ మహమ్మారి దాదాపు 3.7 కోట్ల మంది ప్రజలను కడు పేదవారిని చేసింది. వారి ఆదాయం రోజుకు 1.9 డాలర్ల కన్నా దిగువకు పడిపోయింది. దిగువ మధ్యతరగతి ఆదాయ దేశాల్లో రోజుకు 3.2 డాలర్ల ఆదాయాన్ని పేదరిక రేఖగా నిర్ణయించారు. గత ఏడాది కాలంలో ఈ ఆదాయం కన్నా దిగువకు చేరిన వారు 6.8 కోట్ల మంది ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. 


ఆదుకున్న అత్యవసర ఉద్దీపనలు..

కొన్ని దేశాల్లో ప్రకటించిన అత్యవసర ఉద్దీపన, సామాజిక రక్షణ కార్యక్రమాలు ఆయా దేశాల్లోని ప్రజలపై ప్రభావ  తీవ్రత తగ్గించాయి. తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తున్నా.. వాటికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అవరోధాలున్నా సవాళ్లను ఎదుర్కొనడానికి దేశాలు వినూత్నంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. కొవిడ్‌-19 అంతర్జాతీయ సమాజానికి నిజమైన పరీక్ష అని బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ అభిప్రాయపడింది. బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతి ఏడాది గోల్‌కీపర్స్‌ నివేదికను విడుదల చేస్తోంది. సుస్థిరమైన అంతర్జాతీయ లక్ష్యాల దిశగా ప్రగతిని వేగిరం చేయడానికి ఈ నివేదిక ద్వారా కృషి చేస్తోంది. గోల్‌కీపర్స్‌ నివేదిక ద్వారా డేటా పంచుకోవడం, పురోగతిపై అవగాహన పెంచడం చేస్తోంది.

Updated Date - 2020-09-17T06:27:46+05:30 IST