ఇబ్బందులొడ్డి సున్నా వడ్డీ
ABN , First Publish Date - 2020-04-25T09:31:38+05:30 IST
ఇంత కష్టకాలంలోనూ ‘వైఎ్‌సఆర్ సున్నా వడ్డీ పథకా’న్ని అమలు చేయడంద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8,78, 000 గ్రూపులకు చెందిన 91 లక్షల మందికి ఈ పథకంతో మేలు

- కరోనా లాక్‌డౌన్‌తో కష్టంలో ఉన్న అక్కాచెల్లెమ్మలను ఆదుకొన్నాం
- పథకంతో 91లక్షల మందికి లబ్ధి
- ఒక్కో గ్రూప్‌కు 40 వేలు అందేలా
- రూ.1400 కోట్లతో పథకం: జగన్
- బటన్ నొక్కి నగదు ఖాతాల్లోకి
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఇంత కష్టకాలంలోనూ ‘వైఎ్‌సఆర్ సున్నా వడ్డీ పథకా’న్ని అమలు చేయడంద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8,78, 000 గ్రూపులకు చెందిన 91 లక్షల మందికి ఈ పథకంతో మేలు జరుగుతుందన్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి అయిన జూలై 8న 27 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తామని వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద నగదును సీఎం జగన్ జమచేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడారు. ‘‘మొట్టమొదటిగా మా నాన్నగారు పావలా వడ్డీకే రుణాల పథకం తీసుకువచ్చారు.
రూపాయిపైచిలుకు వడ్డీ ఉండే రుణాలను పావలా వడ్డీకి తెచ్చారు. ఆ పథకం ఆ తర్వాత సున్నావడ్డీగా మారింది. 2016లో అప్పటి ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ‘వైఎ్‌సఆర్ సున్నా వడ్డీ పథకా’న్ని ప్రారంభిస్తున్నాం. అక్కా చెల్లెమ్మలందరికీ రూ.1400 కోట్లు ఈ పథకం కింద అందుతాయి.’’ అని వెల్లడించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3 లక్షల వరకూ ఆరు జిల్లాల్లో ఏడు శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారు. ఈ లెక్కన సున్నా వడ్డీ అమలు చేయాలంటే .. సుమారు ఏడు నుంచి 13 శాతం వరకూ ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల సగటున ప్రతి గ్రూపునకూ రూ. 20వేల నుంచి 40వేలు లబ్ధి చేకూరుతుంది’’అని వివరించారు. మహిళల చేతిలో డబ్బులు పెడితే సద్వినియోగం అవుతాయని, ఫలితాలు బాగుంటాయన్నారు. రాష్ట్రంలో 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా ‘అమ్మఒడి’ అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
వైఎస్ జయంతి నాడు ఇళ్ల స్థలాలు..
కరోనా లేకపోతే ఈపాటికి రాష్ట్రంలో 27 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలను ఇచ్చేసేవాళ్లమని మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి అన్నారు. అంతా అనుకొన్నట్టు జరిగితే ఈ కార్యక్రమాన్ని జూలై 8న చేపడతామని, ఇళ్ల పట్టాలతోపాటు, ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ‘‘నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకే ఇవ్వాలన్న చట్టాన్ని తీసుకొచ్చాం. వక్రబుద్ధితో వారిని చూస్తే కఠినంగా శిక్షలు వేసేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. త్వరలో రాష్ట్రపతి దీనికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం. మహిళా సంరక్షణ కోసం ఒక యాప్‌ను తీసుకువచ్చాం. పదకొండువేల మహిళా పోలీస్ పోస్టుల నియామకం చేపట్టాం. గ్రామ సచివాలయాల్లో 7-8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశాం. ‘వసతి దీవెన’తో 12 లక్షలమందికి మేలు చేకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్ లాంటి చదువులు చదివేవారికి రెండు దఫాల్లో ‘వసతి దీవెన’ కింద తల్లుల అకౌంట్‌లో నగదు వేస్తున్నాం. గత ప్రభుత్వం బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లించడమేకాకుండా.. ఈ ఏడాది మార్చి 31 వరకూ చెల్లించాల్సిన మొత్తం రీయింబర్స్‌మెంట్‌ను తల్లుల ఖాతాల్లో వేశాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలల ఫీజు రీయింబర్స్‌మెంటును నేరుగా తల్లుల అకౌంట్‌లో వేస్తాం’’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కలెక్టర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.