ప్రమాణానికి నేను సిద్ధం.. కన్నా, సుజనా చేయగలరా?: విజయసాయి

ABN , First Publish Date - 2020-04-21T18:38:06+05:30 IST

కరోనా నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విమర్శలు, ప్రతి విమర్శలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆగట్లేదు.

ప్రమాణానికి నేను సిద్ధం.. కన్నా, సుజనా చేయగలరా?: విజయసాయి

విశాఖపట్నం : కరోనా నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విమర్శలు, ప్రతి విమర్శలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆగట్లేదు. రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించి కన్నా సవాల్ విసిరారు. నన్ను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవడికీ లేదు. నీకు దమ్ముంటే.. మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేస్తావా?. విజయసాయిరెడ్డి అధికారమదం తలకెక్కి మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మరోసారి విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చారు.


నిరూపిస్తా...

నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. కాణిపాకం లేదంటే తిరుమలలో ప్రమాణానికి సిద్ధం. అవినీతి చేయలేదని కన్నా, సుజనా ప్రమాణం చేయగలరా?. బోగస్‌ కంపెనీలు సృష్టించి బ్యాంకులకు సుజనా రుణాలు ఎగ్గొట్టారు. గతంలో నేను సుజనా కోసం పనిచేశాను. గత ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం ఎంత ఇచ్చింది. కన్నా, పురందేశ్వరి ఎంతెంత తీసుకున్నది నాకు తెలుసు. మళ్లీ చెబుతున్నా.. కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారు. ప్రజలను దోచుకోవాల్సిన కర్మ మాకు లేదు. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుంది.. అడ్డుకునే శక్తి ఎవరికీ లేదుఅని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
కన్నా ఏమన్నారు..!?

నాపై విమర్శలంటే ఆకాశంపై ఉమ్మేసినట్లే. ప్రభుత్వ పారదర్శకత నిరూపించుకోవాలంటే మీకెందుకు పొడుచుకొచ్చింది. విజయసాయి ఇష్టానుసారం మాట్లాడితే పరువునష్టం దావా వేస్తాను. నన్ను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవడికీ లేదు. నీకు దమ్ముంటే.. మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేస్తావా?. విజయసాయిరెడ్డి అధికార మదం తలకెక్కి మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.  మీరు ప్రజాధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా?. నిజాయితీ నిరూపించుకోమని అడగడం దుష్ప్రచారం ఎలా అవుతుంది? అని విజయసాయిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
విజయసాయి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా స్పందించి.. విమర్శలు గుప్పించారు. తాజాగా ఇద్దరి వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన వైసీపీ ఎంపీ.. పురందేశ్వరిపై కూడా కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి.

Updated Date - 2020-04-21T18:38:06+05:30 IST