రఘురాజుకు వైసీపీ ఎంపీ సురేష్ వార్నింగ్

ABN , First Publish Date - 2020-09-22T00:02:37+05:30 IST

స్వపక్షంలోనే విపక్షంగా మారిన ఎంపీ రాఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

రఘురాజుకు వైసీపీ ఎంపీ సురేష్ వార్నింగ్

న్యూ ఢిల్లీ/అమరావతి : స్వపక్షంలోనే విపక్షంగా మారిన ఎంపీ రాఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రఘురాజుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై ఆయన గుప్పించిన ప్రతి విమర్శకు సురేష్ కౌంటరిచ్చారు. 


ఫిర్యాదు చేశా..

దళిత ఎంపీగా ఉన్న నన్ను ఉద్దేశించి, నా కుల వృత్తిని ఉద్దేశించి వైసీపీ ఎంపీగా గెలిచి, పార్టీ పైన రోజూ విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు అవహేళన చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులైన రాములుకు ఫిర్యాదు చేశాను. దళితులైన చర్మ కార్మికుల పట్ల ఉన్న ద్వేషంతో, అసూయతో, ఆహంకారంతో మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాను. దీనికి సంబంధించి కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ నెల 17వ తేదీన రఘురాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఉద్దేశించి దళిత జాతిని అవమానించే విధంగా చెప్పులు కుట్టుకునే వాడు అని.. మా జాతి పశువుల చర్మాలు వలుస్తుందని, తోళ్ళు వలిచే వృత్తి అంటూ దళిత జాతిపై అసూయ, ద్వేషం, పగతో రగిలేలా అహంకారంతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు రోజూ పెట్టే ప్రెస్ మీట్లలోనూ ఇదే అహంకారంతో, దళితులపై ద్వేషంతో మాట్లాడుతున్నాడు. దళితులపై రఘురామకృష్ణరాజు కక్ష కట్టినట్టుగా, వ్యంగంగా, హేళనగా, గుండెల నిండా పగ పెంచుకున్నట్టుగా మాట్లాడిన మాటలు చూస్తే.. ఆయనకు దళితులంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుంది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నర్సాపురం పార్లమెంటులో దళితులు ఓట్లేస్తేనే రఘురామకృష్ణరాజు ఎంపీ అయ్యాడు. ఈయనేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదుఅని రఘురాజు వ్యాఖ్యలకు సురేష్ కౌంటరిచ్చారు. 


సెక్యూరిటీ విషయమై..

తన సెక్యూరిటీతో తోలు వలిపిస్తాను, కాల్పిస్తాను అని రఘురామకృష్ణరాజు దళితులను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు. దళితులను కాల్చడానికి, దళితుల చర్మం వలవడానికి మీకు ప్రభుత్వం సెక్యూరిటీని సమకూర్చలేదు. దళితుల తోలు వలవటానికి మీకు సెక్యూరిటీని కేటాయించలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. మీకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. దళితుల పట్ల పగతో రగిలిపోతూ, సెక్యూరిటీని అడ్డుపెట్టుకుని దళితులను బెదిరిస్తూ, సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్న రఘురామకృష్ణరాజుపై లోక్ సభ స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాను. ఆయనకు కేటాయించిన సెక్యూరిటీని తొలగించమని కోరబోతున్నానుఅని సురేష్ మీడియా ముఖంగా తెలిపారు.


ఒక్కసారి నర్సాపురం వెళ్లొస్తే..

మా దళిత కులాలు, దళిత జాతి అంటే చిన్నచూపు చూస్తూ, ఏహ్యభావంతో మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు మాటలను దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న దళిత ప్రజలు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని దళితులంతా చూశారు. రఘురామకృష్ణరాజుకు తగిన బుద్ధి చెప్పటానికి దళితులు సిద్ధంగా ఉన్నారు. ఆయన ముందుగా దళిత జాతికి క్షమాపణలు చెప్పి, ముక్కు నేలకు రాసి, ఆ తర్వాతే పార్లమెంట్‌లో అడుగు పెట్టాలి. పార్లమెంట్‌లో అడుగు పెట్టేముందు.. నర్సాపురం నియోజకవర్గం వెళ్ళి వస్తే దళితుల సత్తా అంటే ఏమిటో తెలిసేది. ఉట్టికి ఎగరిలేనమ్మ అన్నట్టు.. నియోజకవర్గంలో అడుగుపెట్టే ధైర్యంలేని రఘురామకృష్ణరాజు పులివెందులలో పది వేల మందితో మీటింగ్ పెడతానని చెబుతున్నారు. అడవిలో మొరగడానికి, వీధుల్లో మొరగడానికి చాలా తేడా ఉంటుందన్నది గుర్తించుకుంటే మంచిదిఅని సురేష్ సలహా ఇచ్చారు.


రిటర్న్ గిఫ్ట్ రూపంలో..!

‘రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఏమిటో త్వరలోనే తెలుస్తుంది. ఎవరితో ఆడుకోకూడదో వారితోనే ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారి ఆట ఎలా ఉంటుందో.. అతి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ రూపంలో తెలుస్తుందని హెచ్చరిస్తున్నాను. కచ్చితంగా తన ఒరిజనల్ స్టేజికి.. పదవి విషయంలోగానీ, అది విగ్గు విషయంలోగానీ రఘురాజు వస్తారు. ఢిల్లీలో రోజూ చెట్టు కింద ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ గారిపై విమర్శలు చేస్తూ చివరికి జోహార్ సీఎం అంటూ బుద్ధి లేకుండా, నీతినియమాలు లేకుండా మాట్లాడి ఆయన రాజకీయ విలువలు పాటించడంలో పాతాళానికి దిగజారాడు. అసలు రఘురామకృష్ణరాజుకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో.. ఏ బ్యాంకులను లూటీ చేశాడో.. ఇవన్నీ బయటకు రావాలి. వీటన్నింటినీ సర్దుకోవడానికే ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఢిల్లీ వీధులో తిరుగుతున్నారు’ అని సురేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 


ప్రివిలేజ్ నోటీసుపై..

ప్రివిలేజ్ నోటీసు దేనికి ఇవ్వాలో కూడా కనీసం తెలియని వ్యక్తి రఘురామకృష్ణరాజు. ఒక ఎంపీ మీద మరో ఎంపీ ప్రివిలేజ్ నోటీసు ఇవ్వటం ఏమిటి?. ఆ విషయంకూడా కనీసం తెలియదనుకుంటా. ఎవరైనా తమ హక్కులకు భంగం కలిగినప్పుడే ప్రివిలేజ్ నోటీసు ఇస్తారుఅని సురేష్ చెప్పారు.

Updated Date - 2020-09-22T00:02:37+05:30 IST