సీఎం జగన్ ఇంటి సమీపంలో కూడా కరోనా పాజిటివ్.. అయినా సరే...

ABN , First Publish Date - 2020-04-15T05:30:00+05:30 IST

కరోనా ప్రభావం దేశంలో పూర్తిస్థాయిలో తగ్గకముందే.. వైసీపీ నేతలు మాత్రం ఏపీలో కరోనాను...

సీఎం జగన్ ఇంటి సమీపంలో కూడా కరోనా పాజిటివ్.. అయినా సరే...

అమరావతి: కరోనా ప్రభావం దేశంలో పూర్తిస్థాయిలో తగ్గకముందే.. వైసీపీ నేతలు మాత్రం ఏపీలో కరోనాను కట్టడి చేశామని గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు. కరోనా కట్టడిలో ఏపీనే ఆదర్శం అంటూ దేశం మొత్తం పొగిడేస్తోందని ట్వీట్లు పెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా దేవుడి దయ వల్ల పదంటే.. పదే కేసులు ఏపీలో ఉన్నాయని ఓ సందర్భంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రెండు వారాలు కాకముందే ఏపీలో కేసుల సంఖ్య ఐదు వందలు దాటింది. అంతకంతకూ తీవ్రంగా మారుతున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రచారం ఆపలేదు.


ఇలా మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేశామని చెప్పుకుంటూ అలక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఏపీలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. ఇప్పుడు కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని చెబితే విమర్శలు వస్తాయని భావించిన జగన్ ప్రభుత్వం ఇప్పటికీ సమస్య ఏమంత తీవ్రంగా లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. కరోనాను ఓ మహమ్మారిగా చూడకుండా దాన్ని రాజకీయ పద్ధతిలో డీల్ చేస్తున్నారు. ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా లేదని వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపింది. రెండు జిల్లాలను మాత్రమే రెడ్ జోన్ పరిధిలో చూపించింది.


కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నివేదికను పట్టించుకోలేదు. పదకొండు జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. మరణాలు, కరోనా పాజిటివ్ కేసుల విషయంలో పారదర్శకత లేకుండా పోయిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్లే కరోనాకు బలవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరులో ఓ ప్రముఖ డాక్టర్, కర్నూలులో మరో వైద్యుడు కరోనా వల్ల ప్రాణాలు కొల్పోయారు. గుంటూరులో ఓ రెసిడెంట్ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. చివరకు తాడేపల్లిలోని సీఎం ఇంటి సమీపంలోని వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇలా బహుముఖంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. చేస్తున్న పరీక్షలతో పోలిస్తే బయటపడుతున్న పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి.


మరోవైపు కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి దశకు చేరిందనే ఆందోళన అధికార వర్గాల్లో కనిపిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి రికార్డవుతున్న పాజిటివ్ కేసులను పరిశీలిస్తే వైద్యుల్లో ఆందోళన ప్రారంభమైంది. కరోనా రెండో దశలోకి వెళ్లిపోయిందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంటాక్ట్ లేనివారు, ట్రావెల్ చరిత్ర లేని వారికి కూడా వైరస్ పాజిటివ్ అని వస్తోంది. దానికి కరెన్సీ నోట్లను పోలీసులు కారణంగా చెబుతున్నారు. కారణం ఏదైనా కరోనా ప్రమాదకరంగా వ్యాపిస్తోందన్నది మాత్రం నిజం.


కరోనాను ప్రపంచం తీసుకుంటున్నంత సీరియస్‌గా ఏపీ ప్రభుత్వం తీసుకోలేదన్న అభిప్రాయం నిపుణుల్లో ఉంది. తీవ్రత లేదంటూ చేసిన నిర్లక్ష్యమే పీకల మీదకు తెస్తోందన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తోంది. కేరళ లాంటి రాష్ట్రాలను చూసి ఏపీ నేర్చుకోలేదా? క్వారంటైన్‌ని కూడా రాజకీయ కోణంలో చూసిన ప్రభుత్వం.. వాస్తవాన్ని మాత్రం అలక్ష్యం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-15T05:30:00+05:30 IST