టీడీపీ నుంచి రోజుకొకరు.. వైసీపీ ప్లాన్ బట్టబయలు..!

ABN , First Publish Date - 2020-03-12T21:32:15+05:30 IST

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు...

టీడీపీ నుంచి రోజుకొకరు.. వైసీపీ ప్లాన్ బట్టబయలు..!

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ ప్రలోభాలకు తెరలేపి ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీడీపీకి పట్టున్న జిల్లాల్లో ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా రాష్ట్రమంతా కనిపించినా.. విశాఖలో మాత్రం టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇలాంటి చోట్ల టీడీపీని సంస్థాగతంగా దెబ్బకొట్టాలన్నదే వైసీపీ అజెండాగా తెలుస్తోంది. అందుకే టీడీపీలో కీలకంగా ఉన్న నేతలపై వైసీపీ గురిపెట్టింది. ఇందులో భాగంగానే.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే విశాఖ జిల్లాలో రెహమాన్, బాలరాజు, తైనాల, చింతలపూడి వెంకట్రామయ్య ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు, వారసుల భవిష్యత్ కోసం మరికొందరు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ కీలక నేతలకు వైసీపీ గాలం వేసింది.


ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కదిరి బాబూరావుకు పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కరణం బలరాం ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. చంద్రబాబు కూడా పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. అలాంటి కరణం బలరాం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడంపై టీడీపీతో పాటు స్థానిక వైసీపీ శ్రేణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లాలో కూడా అధికార వైసీపీ.. ప్రతిపక్ష పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసింది.


పులివెందుల సతీష్ రెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డిని టీడీపీకి దూరం చేసిన వైసీపీ.. సీఎం సొంత జిల్లాలో ఏకపక్ష ఫలితాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలా ప్రతీ జిల్లాలో ప్రతిపక్ష టీడీపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా వైసీపీ వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది. దీంతో.. ఏపీలో ఈసారి జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మార్చి 21న పరిషత్ ఎన్నికలు జరగనుండగా, మార్చి 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 27న మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2020-03-12T21:32:15+05:30 IST