సీఎం వైఎస్ జగన్ ఆకస్మిక ఢిల్లీ టూర్ వెనుక...

ABN , First Publish Date - 2020-12-15T12:31:11+05:30 IST

సీఎం వైఎస్ జగన్ ఆకస్మిక ఢిల్లీ టూర్ వెనుక...

సీఎం వైఎస్ జగన్ ఆకస్మిక ఢిల్లీ టూర్ వెనుక...

  • వరద సాయంపై వినతి!.. 
  • రాత్రి 9 గంటలకు అమిత్‌షాతో భేటీ
  • సాగు చట్టాలకు మద్దతు కోరనున్న కేంద్రం!?


అమరావతి/న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీకి వెళుతున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమవుతారు. భారీ వర్షాలు, నివర్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తినష్టం గురించి వివరించి... తక్షణమే సహాయం అందించాలని జగన్‌ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, సీఎం ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయాంశాలే అత్యధికంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన ‘భారత్‌ బంద్‌’కు వైసీపీ సర్కారు  మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.


సాగు చట్టాలపైౖ జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. 700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి.. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుందని వివరించాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలని జగన్‌ను అమిత్‌షా కోరనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు కోరగానే అపాయింట్‌మెంట్‌ ఖరారు చేసి... వారు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించి, అదే సమయంలో వ్యవసాయ చట్టాలకు సహకరించాల్సిందిగా అమిత్‌షా తనదైన శైలిలో కోరుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే జగన్‌కు కూడా అపాయింట్‌మెంట్‌ లభించినట్లు చెబుతున్నారు. కేంద్రమే జగన్‌ను ఢిల్లీకి పిలిపించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీలోనే బసచేసి బుధవారం ఉదయం తిరిగి అమరావతి వెళ్లిపోతారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానిని, ఇతర మంత్రులను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హోం మంత్రిని కలిసిన మూడో రోజునే జగన్‌ కూడా షాను కలుస్తుండటం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-12-15T12:31:11+05:30 IST