ఔను.. ఇష్టారాజ్యమే!

ABN , First Publish Date - 2020-12-10T08:25:53+05:30 IST

ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు ఆలస్యమవుతున్నా సరే! మన విద్యార్థులు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నా సరే! ఫీజులపై అనిశ్చితికి సర్కారు తెర

ఔను.. ఇష్టారాజ్యమే!

ఇంజనీరింగ్‌ ఫీజుల ఫైలు వెనక్కి?

సవరణలు సూచించిన సీఎంఓ 

పునఃసమీక్షలో రెగ్యులేటరీ కమిషన్‌ 

ఫీజుల జీవో జారీ మరింత జాప్యం?

నిజమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు


అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు ఆలస్యమవుతున్నా సరే! మన విద్యార్థులు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నా సరే! ఫీజులపై అనిశ్చితికి సర్కారు తెర దించడం లేదు. బుధవారం ఇంజనీరింగ్‌ రుసుములు ఖరారవుతాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే... చివరి నిమిషంలో సీఎం కార్యాలయం ఆ ఫైలును తిప్పి పంపినట్లు తెలిసింది. ఫీజులకు మరిన్ని ‘సొంత సవరణలు’ సూచించినట్లు సమాచారం.


వెరసి... ఇంజనీరింగ్‌ ట్యూషన్‌ ఫీజుల విషయంలో అంతా ఇష్టారాజ్యమే నడుస్తోందని తేలిపోయింది. సీఎంఓ సూచనల మేరకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఉన్నత విద్యాశాఖకు సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రమాణాలు, బోధనా పద్ధతులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాతిపదికగా ఏఎ్‌ఫఆర్‌సీ ఫీజులను ప్రతిపాదిస్తుంది. ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసులను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి ఉత్తర్వులు  జారీ చేసేది. 2020-21 నుంచి మూడేళ్ల బ్లాక్‌ పీరియడ్‌కు రాష్ట్రంలోని 230 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజులను సిఫారసు చేస్తూ ఏఎ్‌ఫఆర్సీ నెలకిందటే నివేదిక సమర్పించింది.


అయినా సరే... సర్కారు దానిని తొక్కి పెట్టింది. ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణితో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్‌ పడిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ నవంబరు 20న వెలుగులోకి తెచ్చింది. ఫీజుల ఉత్తర్వులు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్న వైనాన్ని వివరించింది. ఇప్పటికే ఎంతోమంది మెరిట్‌ విద్యార్థులు రాష్ట్రంలోని డీమ్డ్‌ వర్సిటీలకు, పొరుగు రాష్ట్రాల విద్యాసంస్థలకు తరలివెళ్లిన వైనాన్ని కూడా కళ్లకు కట్టింది.


ఇక... ఏఎ్‌ఫఆర్సీ సిఫారసుల మేరకు కాకుండా... కాలేజీల యాజమాన్యాల సామాజిక వర్గం, రాజకీయ వైఖరుల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నట్లు ‘ఇంజనీరింగ్‌ ఫీజులో ఇష్టారాజ్యం’ శీర్షికతో ఈ నెల 6న ‘ఆంధ్రజ్యోతి’ మరో కథనం ప్రచురించింది. ఇష్టానుసారం పెంచితే ఇబ్బంది వస్తుందని అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా, ఆ మేరకు ‘ఇతరుల’ కాలేజీల ఫీజులను తగ్గించి సర్దుబాటు చేయాలని ఆదేశిస్తున్నారని, ఫీజుల నిర్ణయంలో రాజకీయ సమీకరణాలు చూస్తూ, కసరత్తులు చేస్తున్నారని వివరించింది. చివరికి... బుధవారం ఇంజనీరింగ్‌ ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడతాయని ప్రచారం జరిగినా, పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.


Updated Date - 2020-12-10T08:25:53+05:30 IST