-
-
Home » Andhra Pradesh » YCP Visakhapatnam
-
అల విశాఖ నగరిలో అధికార అలజడి!
ABN , First Publish Date - 2020-11-25T08:34:13+05:30 IST
చిన్నపాటి లొసుగులుంటే చాలు... ‘అధికారం’ అండతో కంపెనీలను చెరపడతారు. విలువైన భూములుంటే చాలు... వాటిని దక్కించుకునేందుకు అధికార దండాన్ని ప్రయోగిస్తారు. ఇంకెవ్వరివీ లేనట్లు... విపక్ష తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ సానుభూతి పరుల అక్రమాలే కనిపిస్తాయి. ఇంకెప్పుడూ లేనట్లు... శుక్రవారం అర్ధరాత్రే పొక్లైన్లు కదులుతాయి

ప్రశాంత నగరంపై వైసీపీ పడగ
కొత్త సంస్కృతికి తెరలేపిన పెద్దలు
భూముల కబ్జా... కంపెనీలు స్వాధీనం
వాల్తేరు క్లబ్బు భూములపై తొలి నజర్
కార్తీక వనం గుటుక్కు.. బే పార్కులో పాగా
విలువైన ప్రేమ సమాజం ఆస్తులపై పగ
రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కూల్చివేతలు
సరిగ్గా సెలవు రోజుల్లోనే కదిలే అధికారులు
అర్ధరాత్రి దాటిన తర్వాత పొక్లెయిన్లకు పని
కోర్టుకు వెళ్లే వీల్లేకుండా కట్టుదిట్టం
నేతల నుంచి అనుచరుల దాకా
ప్రత్యర్థుల ఆర్థిక మూలాల ధ్వంసం
వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖలో ఖాళీ స్థలాలకు ప్రహరీలు నిర్మించుకున్నారు. ఇంకా అవసరమనిపిస్తే... తమ స్థలాలకు సెక్యూరిటీ గార్డులను కాపలాగా పెట్టుకున్నారు.
శని, ఆదివారాలొస్తే చాలు! విశాఖలో అధికారులు ఎవరి ఇళ్లను కూల్చేస్తారో, ఎవరి ప్రహరీలను పడగొడతారో అనే భయం మొదలైంది! శనివారం, ఆదివారం కూడా కోర్టులు పని చేసేలా చూడాలి!
విశాఖలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల విపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలివి!
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
చిన్నపాటి లొసుగులుంటే చాలు... ‘అధికారం’ అండతో కంపెనీలను చెరపడతారు. విలువైన భూములుంటే చాలు... వాటిని దక్కించుకునేందుకు అధికార దండాన్ని ప్రయోగిస్తారు. ఇంకెవ్వరివీ లేనట్లు... విపక్ష తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ సానుభూతి పరుల అక్రమాలే కనిపిస్తాయి. ఇంకెప్పుడూ లేనట్లు... శుక్రవారం అర్ధరాత్రే పొక్లైన్లు కదులుతాయి. ప్రత్యర్థి పార్టీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే లక్ష్యం! గిట్టని నేతలే కాదు... వారి అనుచరులనూ వదలకుండా వేధించడమే విధానం! దీంతోపాటు... ఏవో లొసుగులు, లోపాలను ఎత్తిచూపిస్తూ సామాన్యుల ఆస్తులపైనా గురి! ప్రశాంతతకు మారుపేరైన, తీర నగరి విశాఖలో ఇప్పుడు ‘అధికార’ అలజడి చెలరేగుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ దందా మొదలైంది. ‘రూ.10 కోట్లు ఇస్తే మీ భూమి భద్రంగా ఉంటుంది. లేదంటే... రద్దయిపోతుంది’ అంటూ వైసీపీ వచ్చిన కొత్తలోనే విశాఖకు చెందిన ఒక వ్యక్తిని బెదిరించారు. న్యాయం తమవైపే ఉందని డబ్బులివ్వడానికి ఆయన నిరాకరించారు. ఆ ముఠా హెచ్చరించినట్లుగానే... భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా ‘మేం చెప్పినట్లు వినకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి’ అనే సంకేతాలు పంపినట్లయింది. ఇక ఇటీవల...వరుసగా టీడీపీ నేతలను, వారి సానుభుతిపరులను టార్గెట్‌గా చేసుకుని కూల్చివేతలు సాగుతున్నాయి. ఇందులో చిన్నా పెద్దా తేడా లేదు. పక్కపార్టీ వారైతే చాలు... కూల్చివేయడమే! అందులోనూ... తగిన గడువుతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా సెలవు రోజుల్లో, అర్ధరాత్రి దాటాక కట్టడాలను కూల్చివేసే అరాచక సంస్కృతికి తెరలేపారు. ఉత్తరాంధ్రపై ‘గుత్తాధిపత్యం’ తనదే అన్నట్లుగా చెలరేగిపోతున్న ఒక కీలక నేతే ఈ విషయాల్లో చక్రం తిప్పుతున్నారు.
కంపెనీలూ కబ్జా...
దాని పేరు వాల్తేరు క్లబ్! రాజకీయాలతో సంబంధంలేకుండా, విశాఖ నగరానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులు దీనిని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ క్లబ్బు భూములపై పెద్దల కన్ను పడింది. వాటిని కొట్టేయడానికి ఏకంగా అడ్వొకేట్ జనరల్‌నే ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తీసుకొచ్చారు. ఆ భూముల్ని చూపించి, వాటి రికార్డుల్ని అదే విమానంలో తీసుకుపోయారు. ఇదోరకం బరితెగింపు.
ఇప్పటిదాకా భూములు కబ్జా చేయడమే చూశాం. విశాఖలో కంపెనీలు, సంస్థలను కూడా కబ్జాచేసే కొత్త సంస్కృతి మొదలైంది. వీఎంఆర్‌డీఏ దగ్గర 33 ఏళ్లకు లీజుకు తీసుకొని బీచ్ రెస్టారెంట్ (కార్తీకవనం) ఏర్పాటు చేసిన వ్యాపారుల్ని బెదిరించారు. కొన్ని లొసుగులను అడ్డంపెట్టుకుని... అందులో 50 శాతం వాటాను బలవంతంగా మరో అస్మదీయ కంపెనీకి ఇప్పించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే... రుషికొండలో పర్యాటక శాఖ నుంచి భూమిని లీజుకు తీసుకొని ఏర్పాటు చేసిన బే పార్క్‌ను హస్తగతం చేసుకున్నారు. అదే బీచ్ రోడ్డులో ప్రేమసమాజం భూములను లీజుకు తీసుకొని హోటల్, రిసార్టు నడుపుతున్న సాయిప్రియ రెస్టారెంట్‌పై కన్నేశారు. దీనిని లాగేసుకోవడానికి ప్రేమ సమాజం ట్రస్టును దేవదాయ శాఖ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. భీమిలి మార్గంలో రామానాయుడు స్టూడియోపైనా కన్నేశారు. ఇదే నియోజకవర్గంలో మాన్సాస్ ట్రస్టుకు ఉన్న వందల ఎకరాల భూములను కొట్టేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింహాచలంలో పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏడాదిక్రితం వేసిన కమిటీలో వైసీపీ కీలక నేత కూడా సభ్యుడిగా నియమితుడయ్యారు. అక్కడి విలువైన భూములను కొట్టేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
సామాన్లు బయటపడేసి...
- ఎన్నికల ముందు జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అతడు విశాఖ విమానాశ్రయంలో రెస్టారెంట్‌లో పని చేసేవాడు. ఈ రెస్టారెంట్ టీడీపీ సానుభూతిపరుడైన హర్షవర్ధన్ నిర్వహించేవారు. అప్పట్లోనే కోడికత్తి ఘటనతో హర్షవర్ధన్‌కు సంబంధముందంటూ వైసీపీ నేతలు హల్‌చల్ సృష్టించారు. అధికారంలోకి రాగానే ఆయనపైనా కన్నేశారు. ఆయన విశాఖ నగరంలో వీఎంఆర్‌డీఏ దగ్గర స్థలం లీజుకు తీసుకొని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ నడుపుతున్నారు. లీజు పొడిగింపు అక్రమమంటూ దీపావళి మరుసటి రోజున.. అధికారులు అర్ధరాత్రి సమయంలో హోటల్‌పై విరుచుకుపడ్డారు. సామాన్లన్నీ లారీల్లోకి ఎక్కించి, హర్షవర్ధన్ ఇంటికి పంపించారు.
- విశాఖ తూర్పు ఎమ్మెల్యే (టీడీపీ) వెలగపూడి రామకృష్ణబాబు మద్దతుదారుడొకరు... ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్డును ఆనుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఆక్రమణల పేరుతో షెడ్లు కూల్చేసి వారిని రోడ్డున పడేశారు.
- బీజేపీ నేత గోకరాజు గంగరాజుకు రుషికొండలో బీచ్‌ను ఆనుకొని ఉన్న స్థలంలోని షెడ్‌ని కూల్చేశారు.
- కామత్ రెస్టారెంట్ నిర్వహించే సుబ్బరాజు సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన హోటల్ కూడా కూల్చేయడానికి రంగం సిద్ధంచేశారు. ఆయన స్టే తెచ్చుకున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనా దృష్టి పెట్టారు.
రాజకీయ ప్రత్యర్థులపై దాడులు
విశాఖపట్నం ... రాజకీయంగా సుహృద్భావ వాతావరణం కలిగిన జిల్లా. ఇక్కడి ప్రజాప్రతినిధుల్లో పలువురు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు. రాజకీయంగా ప్రత్యుర్థులైనప్పటికీ నేతలంతా కలిసి మెలసి ఉంటారు. స్థానికేతరులను కూడా ఆదరించే స్వభావం ఉన్నందునే... టి.సుబ్బిరామిరెడ్డి, ఎంవీవీఎస్ మూర్తి, నేదురుమల్లి, గంటా, పురందేశ్వరి, హరిబాబు, అవంతి శ్రీనివాసరావు, ఎంవీవీ సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణబాబు వంటి వారు ఇక్కడి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు ఈ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను, వారి అనుచరులను వేటాడి, వెంటాడి వేధించడమే అజెండా!
ఎన్నెన్నో ఉదాహరణలు...
- మాజీ ఎంపీ సబ్బం హరి... జీవీఎంసీకి చెందిన పార్కులో ఐదు అడుగుల స్థలం ఆక్రమించారంటూ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన ఇంటికి వెళ్లి బాత్రూమ్ కూలగొట్టి ఫెన్సింగ్ వేశారు. అక్కడితో ఆగకుండా ఆయన ఇంటి స్థలం కూడా ప్రభుత్వ భూమే అంటూ నోటీసులు ఇచ్చి కూల్చే ప్రయత్నం చేశారు. ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
- మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి చెందిన గీతం డీమ్డ్ యూనివర్సిటీ (ప్రస్తుతం ఆయన మనవడు, బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ నిర్వహిస్తున్నారు) ఆధీనంలో ఉన్న భూమిని దసరా పండుగ సమయంలో స్వాధీనం చేసుకుని... ప్రహరీగోడ, గేటుతోపాటు కొన్ని కట్టడాలను కూల్చివేశారు..
- మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలిలో ఓ గెస్ట్‌హౌస్ ఉంది. దానికి ప్లాన్ అప్రూవల్ లేదంటూ కూల్చేందుకు ప్రయత్నించారు. ఆయన కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అక్కడికీ కసితీరక... గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి రాక ముందు ఎప్పుడో కొనుక్కున్న 4.8 ఎకరాల వ్యవసాయ భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. గంటా అనుచరుడైన బొడ్డేటి కాశీవిశ్వనాథం కుమారుడు భీమిలికి సమీపాన ఓ ప్రైవేటు స్థలం లీజుకు తీసుకొని పర్యాటకుల్ని ఆకర్షించే గో కార్టింగ్ ఏర్పాటు చేసి నిర్వహిస్తుండగా దానిని కూడా ఇటీవల కూల్చేశారు. సీఆర్‌జడ్ పరిధిలో ఉందంటూ విరుచుకుపడ్డారు. ఇలాంటివి బీచ్ రోడ్డులో వైసీపీ నాయకులకు చెందినవి అనేకం ఉన్నాయి. వాటి జోలికి పోకుండా టీడీపీ నాయకులు, ఆ పార్టీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలకు పాల్పడుతున్నారు.