సంగం డెయిరీపై వైసీపీ కన్ను!
ABN , First Publish Date - 2020-03-02T07:56:56+05:30 IST
జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంగం డెయిరీపై వైసీపీ నేతల దృష్టి పడింది. ఈ సంస్థపై తమ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కంపెనీ చట్ట పరిధిలో ఉన్న డెయిరీని...

- అడ్డదారిలోనైనా పాగా వేయాలని తపన
- పాలకవర్గాన్ని రద్దు చేయాలనే ఆలోచన
- అంతర్గతంగా అధికారుల కసరత్తు
గుంటూరు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంగం డెయిరీపై వైసీపీ నేతల దృష్టి పడింది. ఈ సంస్థపై తమ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కంపెనీ చట్ట పరిధిలో ఉన్న డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన మార్గాలపై అన్వేషిస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం స్థాపించిన సంగం డెయిరీ ధూళిపాళ్ల కుటుంబ సంరక్షణలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ సంస్థకు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. సుమారు 6-7 ఏళ్ల క్రితం ఆయన క్షేత్రస్థాయిలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు(ఎంపీసీఎస్), మహాజన సభ తీర్మానంతో దీనిని సహకార పరిధి నుంచి కంపెనీ చట్ట పరిధిలోకి తెచ్చారు. కానీ దీనిని కంపెనీ చట్ట పరిధి నుంచి తొలగించి తిరిగి సహకార పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు సహకారశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆర్డినెన్స్‌తో రద్దు!
ప్రస్తుత పాలకవర్గాన్ని ఏదో ఒక వంకతో తప్పించి ఆర్డినెన్స్ ద్వారా ఆ సంస్థను హస్తగతం చేసుకోవాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. పాలకవర్గాన్ని తొలగించి కలెక్టర్‌ను చైర్మన్‌గా నియమించి పోలీసు బందోబస్తుతో డెయిరీని స్వాధీనం చేసుకుంటే ఎలా ఉంటుందని న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. గుంటూరు శ్యామలానగర్‌లో ఉన్న సహకార శాఖ రాష్ట్ర కార్యాలయ ఉన్నతాధికారులతో తాడేపల్లిలో ఆ శాఖ మంత్రి, కొంత మంది వైసీపీ నేతలు రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. ప్ర కాశం డెయిరీ కూడా కంపెనీ చట్ట పరిధిలో ఉంది. అక్కడ పాలక వర్గం లేదు. దానిని స్వాధీనం చేసుకొ ని రెండోదశలో దీనిపై దృష్టి పెట్టాలని కొంతమంది సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గతంలోనూ ప్రయత్నాలు
గుంటూరు-తెనాలి వయా సంగం జాగర్లమూడి రోడ్డులో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న భూముల్లో 1977లో యడ్లపాటి వెంకటరావు ఈ సంస్థను స్థాపించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. అభివృద్ధిబాటలో పయనిస్తూ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ గుంటూరు జిల్లాలోనే కాకుండా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా పాలసేకరణ చేస్తూ పాడి రైతులకు ఊతంగా నిలిచింది. రైతులకు బోన్‌సలు ఇవ్వడం, పాడి రైతుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సంగం ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి అందులో రాయితీపై వైద్యసేవలు అందిస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ సంస్థను స్వాధీనం చేసుకోవాలని 1989-94, 2004-2014 మధ్య కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైఎస్ హయాం లో ఆర్డినెన్స్ ద్వారా డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలు ఇచ్చారు. వీటిపై అప్పటి చైర్మన్ కిలారి రాజన్‌బాబు కోర్టులో స్టే తెచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినా ఆ కేసులో సంగం డెయిరీయే గెలుపొందింది.
వైసీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు సంగం డెయిరీని చేజిక్కించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ వాణీ మోహన్‌కు మౌఖిక ఆదేశాలు అందాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సహకార ఎన్నికలు జరపాలనే ప్రయత్నాల్లో ఉన్నా రు. దానిలో భాగంగా పాల ఉత్పత్తిదారుల సేకరణ కేంద్రాలకు ఎన్నికల పేరుతో సహకార శాఖ జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై జిల్లా అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.