వైసీపీ టార్గెట్... చంద్రబాబును ఒక్కసారైనా...

ABN , First Publish Date - 2020-10-31T12:00:07+05:30 IST

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రజలు కలవరపడాల్సిన దుస్థితి నెలకొందా? అక్కడ ప్రతిపక్ష పార్టీ చేసే పనులను భగ్నం చేయడమే అధికార పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారా? అందుకు వారికి ప్రభుత్వ యంత్రాంగం నుంచి పరోక్ష సహకారం అందుతోందా?

వైసీపీ టార్గెట్... చంద్రబాబును ఒక్కసారైనా...

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రజలు కలవరపడాల్సిన దుస్థితి నెలకొందా? అక్కడ ప్రతిపక్ష పార్టీ చేసే పనులను భగ్నం చేయడమే అధికార పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారా? అందుకు వారికి ప్రభుత్వ యంత్రాంగం నుంచి పరోక్ష సహకారం అందుతోందా? అక్కడ అధికార పార్టీ నేతలు ఎవరిని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు? ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఈ కథనంలో తెలుసుకుందాం..


కుప్పంలో రాజకీయ సెగ...

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రాజకీయంగా హాట్‌హాట్‌గా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నిత్యం ఏదో ఒకవిధంగా రాజకీయ సెగ రాజుకుంటోంది.  సమయం, సందర్భం, అవకాశం అన్న తేడా లేకుండా.. ఇక్కడ టీడీపీని వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తుండటంతో.. రాజకీయ జ్వాల రగులుకుంటోందట. దీంతో ఇరుపార్టీల వారు పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నిజానికి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి కుప్పాన్ని టార్గెట్‌గా చేసుకుంది. జిల్లాకు చెందిన మంత్రులే కాకుండా ఇతర జిల్లాకు చెందిన అమాత్యులు సైతం కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ టీడీపీని బలహీనపరచాలనీ, ఒక్కసారైనా చంద్రబాబుని ఓడించాలనీ వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందట. కుప్పంలో చోటుచేసుకుంటున్న పలు పరిణామాలే అందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వాదనలు వినిపిస్తున్నారు.


టీడీపీ పోటీగా వైసీపీ కూడా...

నిజానికి నిన్నమొన్నటి వరకు ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని వైసీపీ రాజకీయం నడిపిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. వీసీ వివాదం దగ్గర నుంచి మొదలైన వ్యవహారం, అటు తర్వాత మూడు రాజధానుల అంశం, ప్రారంభోత్సవాల గొడవల వరకు అన్నీ కూడా డ్రవిడ విశ్వవిద్యాలయం కేంద్రంగానే సాగడం అన్నది విశేషం. అలానే గృహ నిర్మాణాల విషయంలోనూ వైసీపీ టీడీపీని టార్గెట్ చేసిందంటూ ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు తాజాగా హంద్రీనీవా వ్యవహారం తెరపైకి రావడంతో దాన్ని కూడా వైసీపీ రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధమైందట. కుప్పం ప్రాంతంలోని సమస్యలపై ప్రతిపక్ష టీడీపీ ఏ ఆందోళన కార్యక్రమం చేపట్టినా.. దానికి పోటీగా అధికార వైసీపీ వ్యతిరేక ఆందోళనలకు సిద్ధం కావడం పరిపాటిగా మారింది. అందుకు అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వం యంత్రాంగంలోని అధికారులు పరోక్షంగా సహకారం అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు...

ఇక కుప్పంలో తాజాగా చోటుచేసుకున్న వివాదం విషయానికి వస్తే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 80 శాతం వరకు హంద్రీనీవా కాలువ పనులు పూర్తయ్యాయి. అయితే  

వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందనీ, వెంటనే ఆ పనులను పూర్తి చేయాలనే డిమాండుతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నాలుగు రోజులపాటు మహాపాదయాత్ర శాంతియుతంగా చేపట్టాలనీ స్థానిక టీడీపీ నేతలు నిర్ణయించి.. అందుకు సిద్ధమయ్యారు. మరోవైపు వైసీపీ సైతం.. టీడీపీ యాత్రకు పోటీగా వ్యతిరేక ఆందోళనకు సిద్ధమైంది. ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో ఇక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కొవిడ్ నిబంధనలు, పోలీసు 30 యాక్టు అమలులో ఉన్నందున ఎలాంటి ఆందోళనలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జిల్లా టీడీపీలోని ముఖ్య నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసి పాదయాత్రను భగ్నం చేశారు. పోలీసులు విమర్శలపాలు కాకుండా ఉండేందుకు.. నామమాత్రంగా వైసీపీ శ్రేణుల్లోని కొందరిని నిర్బంధించడం గమనార్హం.


టార్గెట్ చంద్రబాబు...

మొత‌్తంమీద కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుని టార్గెట్‌ చేసుకుని అధికార వైసీపీ పావులు కదుపుతోందట. ఇందులో భాగంగానే మంత్రులు కొందరు నియోజకవర్గంలో తరుచూ పర్యటిస్తూ.. చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారనీ, రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఒక్కసారైనా చంద్రబాబుని ఓడించాలని ఇటీవల ఓ మంత్రి వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి.. వైసీపీ ప్రభుత్వం కుప్పంపై ఎంతగా దృష్టి కేంద్రీకరించిందనేది అర్థమవుతోంది. మరి మున్ముందు కుప్పంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.



Updated Date - 2020-10-31T12:00:07+05:30 IST