అటు రోజా.. ఇటు పెద్దిరెడ్డి.. కాకరేపుతున్న వైసీపీ రాజకీయాలు
ABN , First Publish Date - 2020-10-04T17:28:25+05:30 IST
ఆ జిల్లాలో వైసీపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు అగ్గిరాజేస్తోంది. పై చేయి సాధించేందుకు పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నారు. తాను చెప్పినట్లే
ఆ జిల్లాలో వైసీపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు అగ్గిరాజేస్తోంది. పై చేయి సాధించేందుకు పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నారు. తాను చెప్పినట్లే నడుచుకోవాలని, తన నియోజకవర్గంలో ఏం జరిగినా తెలియాలని ఎమ్మెల్యే అంటున్నారు. మంత్రి ఏమో ఇవ్వన్నీ లైటు అంటూ తాను చేయాలనుకున్నది చేసుకుంటూపోతున్నారు. మధ్యలో మరో వర్గం నియోజకవర్గంలో బలపడేందుకు తెరవెనక రాజకీయ చతురత ప్రదర్శిస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇంతకీ ఎమ్మెల్యే అసహనానికి కారణం ఏమిటి? ఏ జిల్లాలో రాజకీయ రగడ రాజుకుంటుంది?
ఆమెకు పదవి ఇవ్వడంతో...
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా స్పీడ్‌కు బ్రేకులు పడుతున్నాయా? నియోజకవర్గంలో ఆమె హవా తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఔననే అనిపిస్తోంది. రోజా వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్న కె.జె.కుమార్ భార్య శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇవ్వడం ఆమెలో అసంతృప్తిని రాజేసింది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని బాహాటంగా చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నికల్లో తనను ఓడించిన వారికి రాష్ట్రస్థాయి పదవి ఇస్తారా అని రోజా మండిపడుతున్నారట.
వారి తీరుపై రోజా ఫైర్...
రోజా ఏపీఐఐసీ ఛైర్మన్ అయ్యాక నగరి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా కె.జె. కుమార్ కుటుంబం ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో కె.జె కుమార్ కుటుంబాన్ని కాకుండా, వేరే వారికి రోజా ప్రాధాన్యత ఇవ్వడంతో వారి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కె.జె. కుమార్ దంపతులు ఎదగడం తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు ఉంటుందని భావించి ఎమ్మెల్యే రోజా వారిని అణగదొక్కారనే ఆరోపణలు ఉన్నాయి. కె.జె.కుమార్‌ను సోషల్ మీడియాలో రోజా దూషించినట్లు వచ్చిన ఆడియో కలకలం రేపింది. కె.జె కుమార్ దంపతుల షష్టిపూర్తి వేడుక కొన్నాళ్ల క్రితం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎవ్వరూ వెళ్లకూడదని రోజా ఆంక్షలు విధించారట. అయితే షష్టిపూర్తి కార్యక్రమానికి వెళ్లకపోయినా..కొన్ని రోజుల తర్వాత కె.జె కుమార్ ఇంటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెళ్లి దంపతులను కలిశారు. ఈ విషయంలోనూ ఎమ్మెల్యే రోజా రుసరుసలాడినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల నారాయణస్వామి తన చిన్ననాటి స్నేహితుల కోసం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమం ఏమిటని రోజా ఫైర్ అయినట్లు చెబుతున్నారు.
ఆడియో టేప్ కలకలం...
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే రోజా ఏకంగా మీడియాకు ఎక్కడం అప్పట్లో దుమారం రేపింది. స్థానిక సంస్థల నామినేషన్ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేజే కుమార్ ఆయన భార్య శాంతి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని చూశారు. అయితే ఆమెకు ఎవరైనా సహకరిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని రోజా క్యాడర్‌ను హెచ్చరించే ఆడియో టేప్ కలకలం రేపింది. కేజే కుమార్ భార్య శాంతికి ఈడిగ కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై రోజాతో పాటు ఆమె అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తనకు మంత్రి పదవి రాకపోవడానికి, కేజే శాంతికి రాష్ట్ర స్థాయి పదవి రావడానికి పెద్దిరెడ్డి అండ్ కో తెరవెనుక పావులు కదిపిందని ఆమె ఆరోపిస్తున్నారు. మరి వైసీపీ నాయకుల మధ్య చెలరేగుతున్న వర్గపోరు సమస్యకు అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.