మంత్రికి చెడ్డపేరు తేవాలని సొంత పార్టీ నేతలే...

ABN , First Publish Date - 2020-10-24T16:45:53+05:30 IST

రైతు రాజ్యమని చెప్పే ప్రభుత్వ పెద్దలు నెల్లూరు జిల్లా రైతుల విషయంలో చేసిన తీవ్ర తప్పిదం ఏమిటి? ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించారు? వైసీపీ ఆడిన వింత నాటకంలో సమిధలైంది ఎవరు? మంత్రి మేకపాటికి చెడ్డపేరు తేవాలనే ప్రయత్నాలు

మంత్రికి చెడ్డపేరు తేవాలని సొంత పార్టీ నేతలే...

రైతు రాజ్యమని చెప్పే ప్రభుత్వ పెద్దలు నెల్లూరు జిల్లా రైతుల విషయంలో చేసిన తీవ్ర తప్పిదం ఏమిటి? ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించారు? వైసీపీ ఆడిన వింత నాటకంలో సమిధలైంది ఎవరు? మంత్రి మేకపాటికి చెడ్డపేరు తేవాలనే ప్రయత్నాలు ముమ్మరంగా ఎందుకు సాగుతున్నాయి? జిల్లాలోని జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా రైతుల్లో ఏ కంగారు కనిపిస్తోంది? ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నడూలేని విధంగా ఎందుకు భగ్గుమని అంటున్నాయి? వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


దిగుబడి తగ్గింది.. ఖర్చు పెరిగింది...

నెల్లూరు జిల్లాలో ఎడగారు పంటకి ఈ ఏడాది సాగునీరు అందించారు. డ్యాంలలో పుష్కలంగా నీరుండటానికి తమ ప్రభుత్వమే కారణమనీ, జగనన్న సీఎం కాబట్టే వర్షాలు, నీటికి దిగులే లేదనీ జిల్లా మంత్రి అనిల్ కుమార్ పదేపదే చెప్పుకొస్తున్నారు. ఎడగారులో మూడు లక్షల ఎకరాలకుపైగా రైతులు వరిసాగు చేశారు. జిల్లాలో ఒక్క ఎకరాకు సాధారణంగా నాలుగు నుంచి ఐదు పుట్లు వరకు దిగుబడి వస్తుంది. అయితే ఈ సీజన్‌లో 2 నుంచి 2.5 పుట్లు వరకే దిగుబడి వచ్చింది. పైగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క ఎకరాకు 23 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఖర్చు అయింది. ఒక్కో ఎకరాకు తక్కువలో తక్కువగా రెండు పుట్లు లెక్కన.. మూడు లక్షల ఎకరాల్లో ఆరు లక్షల పుట్లుకుపైగా దిగుబడి వచ్చింది. ఇది మే నెలాఖరు నుంచి మొదలైంది. కానీ జూన్ నెలాఖరు, జులై మొదటి వారం వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటైన కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోళ్లు జరగలేదు. దీంతో రైతులు దళారులకు అమ్మకాలు సాగించాల్సి వచ్చింది. ఫైన్ రకం పుట్టి ధాన్యానికి 15,597రూపాయల ధర చెల్లించాల్సి ఉంది. గత ఏడాది కేంద్రం గిట్టుబాటు ధర పెంచి 16,048లకి కొనుగోలు చేయాలని సూచించింది. అయినా దళారులు ఎనిమిది వేలకి కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే పుట్టికి కొత్త అర్థం తెచ్చారు. జిల్లాలో మామూలుగా పుట్టి అంటే 840 కిలోలు. తరుగు కింద ఓ పదీఇరవై కిలోల వరకు ధాన్యాన్ని అదనంగా తీసుకునేవారు. అయితే ఈసారి ఏకంగా పుట్టికి 1100 కిలోల వరకు తీసుకున్నారు. ఇలా కూడా రైతులు నష్టపోయారు.


అధికార పార్టీ పత్రికలో కథనాలు వచ్చినా...

తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు రోడ్డెక్కారు. అయినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. రైతులకు న్యాయం చేస్తామని మాత్రం మంత్రులు చెబుతూ వచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంపై స్పందించారు. ధాన్యం కొనుగోలు సమయాన్ని పెంచాలని సంబంధిత కేంద్ర ప్రభుత్వశాఖల అధికారులతో చర్చించారు. వారి నుంచి ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలూ ఇప్పించారు. ఆయన రైతుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటే.. దాన్ని వైసీపీ నేతలు కొందరు సొమ్ము చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వారితోపాటు దళారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారు. రైతుల పేర్లతో అమ్మకాలు సాగించారు. తీరా రైతులు కొనుగోలు కేంద్రాలు, మిల్లులకు వెళితే.. మీ పేర్లు మీద ఎప్పుడో కొనుగోళ్లు జరిగిపోయాయనే సమాధానాలు ఎదురయ్యాయి. దీంతో నివ్వెరపోవడం రైతుల వంతుగా మారింది. వారికి జరుగుతున్న అన్యాయంపై పత్రికలు, మీడియా గొంతెత్తి అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. గింజ గింజకీ అవినీతి జరిగినట్టు కథనాలు వచ్చాయి. దళారులు, మిల్లర్లు, అధికారులు దోచుకున్నారంటూ సాక్షిలోనూ కథనం ప్రచురితమైంది. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి.. వైసీపీ కరపత్రిక సాక్షిలో వాస్తవం ప్రచురించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌ సతీమణి భారతిని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు మేలు చేయాలని సూచించారు.


ఆయనను దెబ్బతీయడానికే..

ఇక సంగం వద్ద ముంబయి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. అందులో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. అయితే పోలీసులు రైతులపై మాత్రమే కేసులు నమోదు చేశారు. నిజానికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు పరిధిలోని ప్రాంతమది. ఇటీవల జిల్లాలో పెత్తనం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అప్పగించారు. ఈ క్రమంలో ఆయనను చేతగానివానిగా చిత్రీకరించేందుకే కొందరు వైసీపీ నేతలు సంగం వద్ద రాస్తారోకో చేపట్టించారని టాక్. ఓ వర్గం గౌతమ్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారాలు సాగించాయి. వైసీపీలో కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం రైతులనూ అడ్డు పెట్టుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.


హడలిపోతున్న రైతులు...

ఏదిఏమైనా వైసీపీ, ప్రభుత్వం ఆడిన వింత నాటకంలో రైతులే సమిధలయ్యారు. జిల్లా చరిత్రలోనే ఇప్పటివరకు ధాన్యానికి గిట్టుబాటు ధర రాకపోవడం ప్రప్రథమం. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతుంది. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో పదిహేను లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల సోమశిల, కండలేరు డ్యాంలలో పుష్కలంగా నీరుంది. అయితే ఈసారి కూడా గిట్టుబాటు ధర పొందలేకపోతే తీవ్ర నష్టాలపాలవుతామని రైతులు భయాందోళన చెందుతున్నారు. కావలి నుంచి సూళ్లూరుపేట ప్రాంతం వరకు రైతులు వరి పంట సాగు చేయాలంటే హడలిపోతున్నారు. మరీ ఈసారైన ముందస్తుగా కొనుగోళ్లు ఆరంభించి గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తారో.. లేదో.. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Updated Date - 2020-10-24T16:45:53+05:30 IST