మతి స్థిమితం లేనివారైతే... ఆలయాలనే లక్ష్యంగా చేసుకుంటారా?
ABN , First Publish Date - 2020-09-12T09:10:33+05:30 IST
‘మతి స్థిమితం లేనివారైతే... పనిగట్టుకుని హిందూ దేవాలయాలను, రథాలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడతారా? దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

- మంత్రి వెలంపల్లివి మతిలేని మాటలు
- రఘురామకృష్ణంరాజు ధ్వజం
- దేవాలయాల పరిరక్షణకు ఢిల్లీలో దీక్ష
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘మతి స్థిమితం లేనివారైతే... పనిగట్టుకుని హిందూ దేవాలయాలను, రథాలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడతారా? దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మతిలేకుండా మాట్లాడుతున్నారు. వాస్తవాలను వక్రీకరించాలని చూస్తున్నారు‘ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అంతర్వేది దేవాలయంలో రథం దగ్ధం ఘటనకు నిరసనగా ఆయన శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదింటి దాకా నిరసన దీక్ష చేపట్టారు.
దేవాలయాలను పరిరక్షించాలన్న లక్ష్యంతోనే కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. గతంలో పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడే అసలు దోషులను పట్టుకుని శిక్షించి ఉంటే ఇప్పుడీ పరిస్థితులు దాపురించేవి కావని.. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో స్వామివారి రథం తగులబెట్టినప్పుడు కూడా మతిస్థిమితంలేని వ్యక్తి వల్లే జరిగిందని బుకాయించారని మండిపడ్డారు.
రఘురామ దీక్షకు కనకమేడల సంఘీభావం..
హిందూ ధార్మిక సంస్థలు, హిందూ దేవాలయాలు, మతవిశ్వాసాలపై పథకం ప్రకారం దాడి జరుగుతున్న తరుణంలో జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. రఘురామకృష్ణరాజు దీక్షాశిబిరాన్ని ఆయన స్వయంగా సందర్శించి దీక్షకు సంఘీభావం తెలియజేశారు.