అడ్డంగా దొరికిపోయినా చర్యలెందుకు లేవు..?

ABN , First Publish Date - 2020-10-24T17:44:27+05:30 IST

గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే సుపుత్రుడి నిర్వాకం ఎందుకు రచ్చగా మారింది? మెడికల్‌ పీజీ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోయినా.. అతడిని ఎందుకు డిబార్‌ చేయడం లేదు? సామాన్యులకు ఒక న్యాయం? ఎమ్మెల్యే కుమారుడికి మరో న్యాయమా? కాపీయింగ్‌ చేస్తున్నట్లు కేసు

అడ్డంగా దొరికిపోయినా చర్యలెందుకు లేవు..?

గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే సుపుత్రుడి నిర్వాకం ఎందుకు రచ్చగా మారింది? మెడికల్‌ పీజీ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోయినా.. అతడిని ఎందుకు డిబార్‌ చేయడం లేదు? సామాన్యులకు ఒక న్యాయం? ఎమ్మెల్యే కుమారుడికి మరో న్యాయమా? కాపీయింగ్‌ చేస్తున్నట్లు కేసు బుక్కయినా..అసలు అలాంటిదేమీ జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? విచారణ కమిటీని నామమాత్రం చేసి అతడికి క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు తెరవెనుక రంగం సిద్ధం చేశారా? 


రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డా...

తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు పెద్దలు. కానీ తప్పును తప్పని చెప్పే ధైర్యం చేయకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తప్పును కప్పిపుచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మెడికల్‌ పీజీ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ ఓ ఎమ్మెల్యే పుత్రుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డా... డిబార్‌ చేయకుండా క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయడం చర్చకు దారితీసింది.


క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం...

గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో హెల్త్‌ వర్సిటీ గతనెలలో మెడికల్‌ పీజీ వార్షిక పరీక్షలు నిర్వహించింది. సెప్టెంబరు 24న జరిగిన పరీక్షలో ఎమ్మెల్యే పుత్రరత్నం దర్జాగా చెవిలో బ్లూటూత్‌ పెట్టుకొని సమాధానాలు వింటూ పరీక్ష రాస్తున్నాడు. వర్సిటీ నుంచి అబ్జర్వర్‌గా వచ్చిన మహిళా వైద్యురాలు.. అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, జవాబు పత్రాలు లాక్కున్నారు. కాపీయింగ్‌ చేస్తున్నట్లు కేసు బుక్‌ చేశారు. అదేరోజు హెల్త్‌ వర్సిటీకి ఈ-మెయిల్‌లో సమాచారం ఇచ్చారు. సాధారణంగా ఇలాంటివి జరిగితే ఆ విద్యార్థిని మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తారు. కానీ పట్టుబడిన విద్యార్థి గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు కావడంతో హెల్త్‌ వర్సిటీకి ఫోన్ల మీద ఫోన్లు వెళ్లాయి. ‘ఆ అబ్బాయి చాలా మంచోడనీ.. మీరెందుకు ఫిర్యాదు చేశారనీ ఆ మెడికల్‌ కళాశాల యాజమాన్యంపై వర్సిటీ ఉన్నతాధికారి ఫోన్‌లో ఫైర్‌ అయ్యారు. విద్యార్థి బ్లూటూత్‌ పెట్టుకున్న వైనం అంతా సీసీ టీవీలో రికార్డయిందని’ యాజమాన్యం చెప్పినా సదరు అధికారి శాంతించలేదు. వైసీపీ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లకు లొంగిపోయిన వర్సిటీ ఉన్నతాధికారులు కాపీయింగ్‌ చేసిన విద్యార్థికి క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. నలుగురు వైద్యాధికారులతో విచారణ కమిటీని వీసీ నియమించారు.


వైద్యవర్గాల్లో ఆందోళన...

అయితే ఆ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడలేదని, క్లీన్‌చిట్‌ ఇవ్వాలని కమిటీ సభ్యులు అందరికీ ముందుగానే ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థిని పట్టుకున్న మహిళా వైద్యురాలు సిద్ధార్థ కళాశాలకు చెందిన ఆప్తమాలజిస్ట్‌. ఆమె భర్త వర్సిటీ రిజిస్ర్టార్‌గా పని చేస్తున్నారు. స్వయంగా వర్సిటీ అబ్జర్వర్‌ పట్టుకున్న కేసును నీరుగార్చి కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థికి క్లీన్‌చిట్‌ ఇస్తే భవిష్యత్తులో ఇది ఎటువంటి చెడు సంప్రదాయాలకు తెర తీస్తుందో అని వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-10-24T17:44:27+05:30 IST