వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గిడ్డంగుల్లో గుట్కా తయారీ

ABN , First Publish Date - 2020-07-20T07:58:12+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫాకు చెందిన గిడ్డంగుల్లో భారీ ఎత్తున నిషేధిత గుట్కా తయారవుతున్నట్టు పోలీసులు తెలిపారు.

వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా  గిడ్డంగుల్లో గుట్కా తయారీ

‘పాన్‌ మసాలా’ లైసెన్స్‌తోఅంతర్రాష్ట్ర నిషేధిత వ్యాపారం

1.12 కోట్ల మిషనరీ స్వాధీనం, గిడ్డంగి సీజ్‌

లీజుకు తీసుకున్న ముఖ్య అనుచరుడు


పెదకాకాని, జూలై 19: వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫాకు చెందిన గిడ్డంగుల్లో భారీ ఎత్తున నిషేధిత గుట్కా తయారవుతున్నట్టు పోలీసులు తెలిపారు. గుంటూ రు అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి ఆదివారం గిడ్డంగుల వద్దకు వెళ్లి గుట్కా తయారీ సామాగ్రిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫాకు పెదకాకాని మండలం కొప్పురావూరులో పొగాకు గిడ్డంగులున్నాయి. వీటిని ఆయన ముఖ్య అనుచరుడు, సంగడిగుంటకు చెందిన మద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి 2017లో లీజుకు తీసుకుని, ఆర్‌ఎన్‌కే ఇండస్ట్రీస్‌ పేరుతో పాన్‌ మసాలా తయారీకి లైసెన్స్‌ తీసుకున్నారు.  పాన్‌ మసాలా ముసుగులో ‘టెంపర్‌ లేబుల్‌’ పేరుతో నిషేధిత గుట్కాను తయారు చేస్తున్నారు. వీటిని రాష్ట్రంలో విక్రయించడంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు.


శనివారం రాత్రి పెదకాకాని వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ‘ఏపీ 07 బీవై 3330’ కారులో పెద్ద ఎత్తున గుట్కాను గుర్తించారు. దీంతో కారును, గిడ్డంగి సూపర్‌వైజర్‌ విజయసింహలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో పొగాకు గిడ్డంగుల్లో గుట్టుగా సాగుతున్న గుట్కాల తయారీ వెలుగులోకి వచ్చింది’’ అని అర్బన్‌ ఎస్పీ వివరించారు. సుమారు రూ.కోటి విలువచేసే మిషనరీ, రూ.10 లక్షల విలువైన ముడిసరుకు, రూ.2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గిడ్డంగిని సీజ్‌ చేశామన్నారు. 


వాళ్లు ఏం చేశారో?: ముస్తఫా

కొప్పురావూరులో తనకు పలు గిడ్డంగులు ఉన్నాయని ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. ఆదివారం పోలీసులు సీజ్‌ చేసిన గిడ్డంగి కూడా తనదే అయి ఉండవచ్చునన్నారు. అయితే, లీజుకు తీసుకున్న వారు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారో తనకు తెలియదని చెప్పారు. 

Updated Date - 2020-07-20T07:58:12+05:30 IST