అధికారులపై వైసీపీ నేతల ఓవర్ యాక్షన్.. చర్యలు శూన్యం..

ABN , First Publish Date - 2020-10-03T17:58:10+05:30 IST

ఆ జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఓవర్‌ యాక్షన్‌ శ్రుతిమించుతుందా? అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం..వార్నింగ్

అధికారులపై వైసీపీ నేతల ఓవర్ యాక్షన్.. చర్యలు శూన్యం..

ఆ జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఓవర్‌ యాక్షన్‌ శ్రుతిమించుతుందా? అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం..వార్నింగ్ ఇవ్వడం పరిపాటిగా మారుతోందా? చోటమోట నాయకులపై చర్యలు తీసుకుంటున్న అధిష్టాన పెద్దలు.. ప్రముఖ నేతల విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారా? జగనన్న కేసుల మాఫీ పధకాన్ని ఎమ్మెల్యే పక్కగా అమలు చేస్తున్నారని ఎవరు ప్రశ్నించారు. ఉద్యోగుల జోలికి వస్తే ఖబడ్దార్ అని ఎవరంటున్నారు...? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ కథనంలో చూద్దాం.


కర్నూలు జిల్లాలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై వైసీపీ నాయకుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అంగబలం, అర్ధబలం ఉందని కొందరు నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. తమ మాటకు ఎదురుతిరిగినా, ప్రశ్నించినా తట్టుకోలేక శివాలెత్తిపోతున్నారు. ఇటీవల ఆదోని మండపేట రెండో సచివాలయంలో ఓ నాయకుడు దాష్టీకం ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది. డిజిటల్ అసిస్టెంట్ నరేంద్రపై స్థానిక వైసీపీ నాయకుడు కళ్లు బోతుల సురేష్ దౌర్జన్యానికి తెగబడ్డారు. నేను చెప్పిన పని చేయవా అంటూ చిరుద్యోగిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ నానా హంగామా చేశారు. అంతేకాదు ఉద్యోగి చెంపపై కొట్టడంతో పాటు కుర్చీని నేలకేసి విసిరి వీరంగం సృష్టించారు. దాంతో సదరు నాయకుడి నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ నేత సురేష్ దురుసు ప్రవర్తనపై సచివాలయ ఉద్యోగులు సీరియస్ అయ్యారు. అయితే ఈ సంఘటన బయటకుపొక్కకుండా ఉండేందుకు స్థానిక వైసీపీ నేతలు ఇరువురి మధ్య రాజీకి ప్రయత్నించారట. కానీ సచివాలయ ఉద్యోగులు సురేష్‌పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించడంతో పోలీసులు యాక్షన్‌ తీసుకున్నారు. సదరు నాయకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఆ తర్వాత అతడిని పార్టీ నుంచి హైకమాండ్ సస్పెండ్

 చేసింది.


మండపేట రెండో సచివాలయంలో జరిగిన ఘటన మరువకముందే మరో సంఘటన నంద్యాలలో కలవరం సృష్టించింది. వన్ టౌన్‌ సీఐ సోమశేఖర్ రెడ్డి రాత్రిపూట వాహన తనిఖీల్లో భాగంగా..వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాబీబుల్లా కారును ఆపారట. ఎక్కడ నుంచి వస్తున్నారని అడగడంతో సదరు నాయకుడు చిర్రుబుర్రులాడారట. ఆ తర్వాత అనుచరులతో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నానా యాగీ చేసినట్లు చెబుతున్నారు. ఉద్దేశ పూర్వకంగా తన కారును ఆపి మద్యం సేవించి వచ్చావని తనను అవమానించారని ఆ నాయకుడు హంగామా చేశారంటున్నారు. సీఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ...నీ యూనిఫాం అయిన ఉండాలి...లేదా నేను రాజకీయాల నుంచైనా తప్పుకోవాలని సీఐకి సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఇటు అధికారపార్టీ లోను అటు పోలీసు శాఖలోనూ తీవ్ర చర్చనీయాంశమైనట్లు సమాచారం. పరిస్థితులు చేయిదాటకముందే నంద్యాల వైసీపీ నాయకులు హబీబుల్లా,సీఐ సోమశేఖర్ రెడ్డి మధ్య రాజీ కుదిర్చారట. 


ఇంతవరకు బాగానే ఉన్నా...అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆదోనిలో సచివాలయ ఉద్యోగిపై దాడి చేశాడనే కారణంతో వైసీపీ నేత కళ్లుబోతుల సురేష్‌ను అరెస్ట్ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి నంద్యాల వన్‌టౌన్‌కు వెళ్లి సీఐకి వార్నింగ్ ఇచ్చిన హబీబుల్లాపై పార్టీ పెద్దలు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘిచే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పే వైసీపీ అధినాయకత్వం ఈ నాయకుడిపై యాక్షన్‌ ఏదని ప్రశ్నిస్తున్నారట. మరోవైపు ఈ ఘటనపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. జగనన్న "కేసుల మాఫీ" పథకం నంద్యాలలో ప్రారంభించినందుకు ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ శ్రీశైలం నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. సీఐకి వార్నింగ్ ఇచ్చిన నాయకుడిని ఎమ్మెల్యే వెనకేసుకు రావడంపై వైసీపీ విధానం ఏంటో తేటతెల్లమైందన్నారు. అటు స్థానిక జనసేన నాయకులు సీరియస్‌గా స్పందించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తాం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ నాయకుల దాడి కర్నూలు జిల్లాలో దుమారం రేపుతోంది.  వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్యలపై అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - 2020-10-03T17:58:10+05:30 IST