‘నిబంధనలను’ ఉల్లంఘిస్తున్నారు

ABN , First Publish Date - 2020-04-24T08:42:00+05:30 IST

‘‘లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో వైసీపీ నేతలు గుంపులను వెంటేసుకొని ఇష్టానుసారం తిరుగుతున్నారు. వారి తిరుగుళ్ళను అదుపు చేయాలి. ఎవరి ఇళ్ళలో వారు ఉండటం ద్వారా వైరస్‌ వ్యాప్తిని...

‘నిబంధనలను’ ఉల్లంఘిస్తున్నారు

  • వైసీపీ నేతల విచ్చలవిడితనాన్ని అడ్డుకోండి: వర్ల


అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ‘‘లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో వైసీపీ నేతలు గుంపులను వెంటేసుకొని ఇష్టానుసారం తిరుగుతున్నారు. వారి తిరుగుళ్ళను అదుపు చేయాలి. ఎవరి ఇళ్ళలో వారు ఉండటం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలని లాక్‌డౌన్‌ పెట్టారు. కాని అధికార పార్టీ నేతలు తమ నియోజకవర్గాలతోపాటు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విచ్చలవిడిగా తిరుగుతున్నారు’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆయన ఒక లేఖను గురువారం డీజీపీకి పంపారు. ‘‘వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై మధ్య షటిల్‌ సర్వీసు మాదిరిగా తిరుగుతున్నారు. కనిగిరి ఎమ్మెల్యే 40 మందిని వెంటేసుకొని కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి రావాలని ప్రయత్నించాడు. నగరి ఎమ్మెల్యే రోజా ఒక బోరింగ్‌ ప్రారంభానికి పెద్ద ఎత్తున సమీకరించి పాద పూజ చేయించుకొన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ఒక పెద్ద గుంపును వెంటేసుకొని కర్నూలు ఆస్పత్రిలో హడావుడి చేశారు. వారి వల్లే వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది’’ అని లేఖలో వర్ల పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికార పార్టీ నేతలపై పోలీస్‌ స్టేషన్లలో ఆధారాలతో ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, ఆ ఫిర్యాదుల ఆధారంగా అధికార పార్టీ నేతలపై కేసుల నమోదుకు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన డీజీపీని కోరారు. 


Updated Date - 2020-04-24T08:42:00+05:30 IST