ఉపసంహరణం

ABN , First Publish Date - 2020-03-15T09:06:40+05:30 IST

ఉపసంహరణం

ఉపసంహరణం

  • ప్రలోభాలు, బెదిరింపులు, ఒత్తిళ్లు
  • పెండింగ్‌ బిల్లులతో బ్లాక్‌ మెయిల్‌..
  • ప్రత్యర్థులపై వైసీపీ దండోపాయం
  • భారీగా నామినేషన్ల ఉపసంహరణ
  • టైం ముగిసినా అధికారుల సహకారం
  • పశ్చిమలో ఫోర్జరీ చేసిన పత్రాలూ ఓకే
  • బీ-ఫారాలు గల్లంతు పేరిట నాటకం
  • కర్నూలులో వైసీపీ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి
  • కుమారుడి ‘స్వీయ పర్యవేక్షణ’
  • తుది జాబితా ప్రకటన తర్వాత
  • మొదలైన ఉపసంహరణల పర్వం
  • కడప జిల్లాలో ‘ఏక’పక్షమే!


అటూ ఇటూ ఉన్న వారు చెరో రెక్క పట్టుకోగా... నిస్సహాయంగా ఉన్న ఇతని పేరు బాలు నాయక్‌. గుంటూరు జిల్లా మాచర్ల జడ్పీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన కోసం పాతిక మంది పోలీసులు, వైసీపీ కార్యకర్తలు నాలుగు రోజులు గాలించారు.  ఎట్టకేలకు శనివారం గుంటూరుకు పట్టుకొచ్చి.. బెదిరించి, బంధువులతో ఒత్తిడి చేయించి నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారు. ఇదంతా రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో, ఎమ్మెల్యే పీఏ పర్యవేక్షణలోనే జరిగింది.


ఈ ఫొటోలో ఉన్న మహిళ మల్లేశ్వరి. గుంటూరు జిల్లాలో టీడీపీ తరఫున ఎంపీటీసీగా నామినేషన్‌ వేశారు. ఎలాంటి కేసులు, నేర నేపథ్యమూ లేకున్నా... ‘బైండోవర్‌’ అంటూ పోలీసులు ఠాణాకు తీసుకెళ్లబోయారు. 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులపై సామ దానోపాయాలు ముగిశాయి. వాటికి లొంగని వారిపై... ‘దండోపాయం’ మొదలైంది. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం బెదిరింపుల పర్వం తారస్థాయికి చేరింది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక అనేకచోట్ల విపక్షాల అభ్యర్థులు బరి నుంచి వైదొలిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం 3 గంటలకు ముగిసినప్పటికీ... అధికారపార్టీ నేతల అభీష్టం మేరకు సాయంత్రం 5 వరకూ అందుకు అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న నాలుగు ఎంపీటీసీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులను బరిలో నుంచి తప్పించారు.


గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లులను కూడా అస్త్రంగా ఉపయోగించుకున్నారు. నేరుగానే అభ్యర్థులకు ఫోన్‌చేసి... ‘‘మీకు రావాల్సిన సొమ్ము అవసరం లేదా? పోటీచేస్తే ఇంతే సంగతులు’’ అని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీకి అనుకూలంగా పనిచేసినా బిల్లుల సంగతి మర్చిపోవాలని హెచ్చరించారు. కృష్ణాజిల్లాలోనూ ఈ తతంగం నడిచింది. గుంటూరు జిల్లా నగరం మండలం పెద్దవరం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గోవతోటి భాస్కర్‌పై పాత కేసులు ఉన్నాయని, వాటిని తిరగదోడాల్సి వస్తుందని హెచ్చరించి నామినేషన్‌ ఉపసంహరింప చేశారని ఎమ్మెల్యే అనగాని ఆరోపించారు. 




ఫోర్జరీలు కూడా... 

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం పెదగరువు ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అలుగు ప్రమీల బరిలో నిలిచారు. శనివారం ఆమె సంతకంతో కూడిన ఉపసంహరణ ప్రతం అధికారులకు అందింది. దీంతో ప్రమీల పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. సమాచారం అందుకున్న ప్రమీలతో సహా జనసేన, బీజేపీ నేతలు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ప్రమీల సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పినా పట్టించుకోకుండా... నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమీ చేయలేమని అధికారులు తేల్చేశారు. ఉండి మండల పరిధిలోని చిలుకూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.రామారావు నామినేషన్‌ వేయగా... ఆయన కుమారుడితోపాటు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన మరోవ్యక్తి రామారావు నామినేషన్‌ ‘విత్‌డ్రా’ పత్రాలు ఇచ్చారు. ఇది దురుద్దేశంతో జరిగిందని  ఎమ్మెల్యే రామరాజు ఫిర్యాదు చేయగా... అభ్యర్థి నేరుగా వచ్చి వివరిస్తేనే పరిగణనలోకి తీసుకుంటామని సాయంత్రం5.30వరకు గడువిచ్చారు.


అప్పటికి రాకపోవడంతో వైసీపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. దెందులూరు మండలం పెదవేగిలో దుగ్గిరాల, పెదవేగి ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు బి-ఫామ్‌ ఇచ్చినప్పటికీ వారిని ఇండిపెండెంట్లుగా ప్రకటించారు. దుగ్గిరాల టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ సొంత గ్రామం. దీనిపై 2గంటలపాటు టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. చివరికి... బి-ఫారాలు దొరికాయంటూ అధికారులు ప్లేటు ఫిరాయించారు. గోపాలపురంలో గడువు తర్వాత కూడా ఉపసంహరణ పత్రాలు తీసుకున్నారు. ఒత్తిళ్ల నేపథ్యంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం జట్పీడీసీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు బరినుంచి తప్పుకొన్నారు.


కర్నూలులో సాయంత్రం దాకా..

అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేశాక కూడా విత్‌డ్రాలు కొనసాగించిన ఘనత కర్నూలు జిల్లా అధికారులకే దక్కింది. ఏకంగా వైసీపీ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి కుమారుడే దగ్గరుండి మరీ ‘ఉపసంహరణలు’ చేయించారు. తుది జాబితా ప్రకటించిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఆయా కార్యాలయాలకు నామినేషన్లువేసిన ప్రత్యర్థులను వెంటబెట్టుకుని వచ్చారు. ఓ మంత్రి నుంచి ఫోన్‌ రావడంతో... రిటర్నింగ్‌ అధికారి కూడా ఓకే అన్నారు. అవసరమైతే రాత్రి 7గంటల దాకా ఉపసంహరణలకు అనుమతించి... తర్వాతే తుది జాబితా ప్రకటించాలంటూ అధికారులకు రహస్య ఆదేశాలు వెళ్లిపోయాయి.


కొలిమిగుండ్ల నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సుగుణమ్మ శుక్రవారం నుంచి స్థానిక టీడీపీ నాయకులకు కూడా అందుబాటులో లేరు. శనివారం ఉదయం వరకు ఆమెకోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆమెను వైసీపీ అభ్యర్థి కుమారుడు జడ్పీ కార్యాలయానికి తీసుకొచ్చి... విత్‌డ్రా చేయించారు. ప్యాపిలి మండలానికి చెందిన కేశవులు, బేతంచర్లకు చెందిన కవిత కాంగ్రెస్‌ తరఫున జడ్పీటీసీలుగా నామినేషన్లు వేశారు. వారిలో కొందరు కవిత ఇంటికి వెళ్లి ఓటరు జాబితా కోసం వచ్చామని సంతకాలు చేయించుకున్నారు. మర్నాడే అవి ఆర్వో వద్దకు ఉపసంహరణ దరఖాస్తులుగా వచ్చి చేరాయి. దీంతో ఆమె నామినేషన్‌ రద్దయింది. కర్నూలు జిల్లాలో 14 జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి.


కృష్ణాలో బెదిరింపుల పర్వం..

రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున ఐదుగురు నామినేషన్లు వేశారు. వీరంతా శనివారం ఉపసంహరించుకున్నారు. అన్నారావుపేట ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లో ఆరు ఎంపీటీసీ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. గన్నవరం- 6 ఎంపీటీసీగా బరిలో ఉన్న టీడీపీ నేత కె.కాంతారావు చేత నామినేషన్‌ ఉపసంహరింపచేశారు. నాగాయలంక మండలంలో రేమాలవారిపాలెం, గణపేశ్వరం, నంగేగడ్డ ఎంపీటీసీ స్థానాల్లో డబ్బులు, బెదిరింపులతో టీడీపీ అభ్యర్థులను బరి నుంచి తప్పించారు. ఉంగుటూరు మండలంలో ఎమ్మెల్యే బెదిరింపులకు దిగటంతో ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 


తూ.గో.లో ఫలించిన ‘ఒత్తిళ్లు’

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 60 వరకు ఎంపీటీసీ స్థానాలను పోటీలేకుండా సొంతం చేసుకున్నారు. అత్యధికంగా మంత్రి కన్నబాబు నియోజకవర్గంలో 17 స్థానాలు  ఏకగ్రీవమయ్యాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ టీడీపీ అభ్యర్థులను బెంబేలెత్తించడంతో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలుచోట్ల టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రాకు అంగీకరించకపోయినా బలవంతంగా తీసుకువెళ్లి అధికారుల వద్ద కూర్చోబెట్టారు. మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత కూడా ఉపసంహరణ పర్వం కొనసాగింది. 


అధికార బలమే నెగ్గింది

  • సీఎం సొంత జిల్లాలో వైసీపీ హవా
  • 36 జడ్పీటీసీ, 423 ఎంపీటీసీలు ఏకగ్రీవం


కడప: సీఎం సొంత జిల్లా కడపలో ‘స్థానిక’ విజయం అధికారపక్షానికి పోటీ లేకుండానే సొంతమైంది. జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 36స్థానాలు అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. 50 మండల పరిషత్‌ల పరిధిలో 553 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... ఏకంగా 423 స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 16 స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 114 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా... వీటిలో 54స్థానాల్లో మాత్రమే ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను బరిలో నిలిపింది. 26 మండలాల్లో మొత్తం ఎంపీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 19 మండలాల్లో మెజార్టీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అంటే 45 మండలాలు ఇప్పటికే వైసీపీ ఖాతాలో పడినట్లే.

Updated Date - 2020-03-15T09:06:40+05:30 IST