వైసీపీ నేతకు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టిన మరో వైసీపీ నేత!

ABN , First Publish Date - 2020-10-03T17:09:46+05:30 IST

అక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ అధికార పార్టీ ఇన్‌ఛార్జ్‌దే హవా కొనసాగుతుంది. అనధికార ఎమ్మెల్యేగా హల్‌ చల్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ నాయకుడి వ్యవహారం.. సొంత పార్టీలో

వైసీపీ నేతకు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టిన మరో వైసీపీ నేత!

అక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ అధికార పార్టీ ఇన్‌ఛార్జ్‌దే హవా కొనసాగుతుంది. అనధికార ఎమ్మెల్యేగా హల్‌ చల్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ నాయకుడి వ్యవహారం.. సొంత పార్టీలో వర్గపోరు రాజేసింది. ఆయనకు వ్యతిరేకంగా కొందరు నాయకులు రోడ్డెక్కారు. వారి గొడవ చినికిచినికి గాలివానగా మారి ఓ నాయకుడు ఆమరణ దీక్ష చేపట్టే వరకు వెళ్లింది. ఈ నాయకుల పంచాయతీ అధిష్టానం దగ్గరికి వెళ్లడంతో.. ఓ ఎమ్మెల్యేను రంగంలోకి దింపి రాజీ కుదిర్చింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అక్కడ అలక పాన్పు ఎక్కిందెవరు? ఇదెక్కడి రాజకీయం? వివరాలు ఈ కథనంలో చూద్దాం.


తారాస్థాయికి వర్గపోరు...

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉంటాయి. అధికార వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. కలిసిమెలిసి ఉండాల్సిన సొంతపార్టీ నాయకులు ఉప్పునిప్పులా చిటపటలాడుతున్నారు. స్వపక్షంలో విపక్షంలా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. నియోజవర్గ ఇన్‌ఛార్జ్ పీవీఎల్‌ నరసింహరాజు తీరును వ్యతిరేకిస్తూ అసంతృప్త నాయకులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. 


ఎమ్మెల్యే ఒకరు.. అధికారం మరొకరిది...

ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజును మట్టికరిపించారు. వైసీపీ ప్రభుత్వ లోపాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు మంతెన రామరాజు. మొత్తంగా అధికార పార్టీనేతలకు నియోజకవర్గంలో కొరకరాని కొయ్యగా మారారు. అయితే తాను ఓడిపోయినా వైసీపీ అధికారంలోకి రావడంతో పీవీఎల్ నరసింహరాజు అనధికార ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారట. అధికార కార్యక్రమాల్లోనూ తానే ఎమ్మెల్యే అన్నట్లుగా తెగ హడావుడి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గానికి చెందిన అభివృద్ది పనుల కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాలన్నీ నరసింహారాజు కనుసన్నలోనే జరుగుతాయనే ఆరోపణలున్నాయి. ఈయన వ్యవహారశైలి సొంత పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదట. పీవీఎల్ నరసింహారాజు తీరును వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుతో నరసింహారాజుకు అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఆయనకు మరో కొత్త వ్యతిరేక వర్గం నియోజకవర్గంలో ఏర్పడింది. ఇప్పటివరకు పీవీఎల్, పాతపాటి సర్రాజు వర్గాలు ఉండగా.. తాజాగా కొత్తవర్గం పురుడు పోసుకోవడంతో గ్రూప్ తగాదాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.


వాస్తవానికి ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఉండేవారు. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపకపోవడంతో.. పారిశ్రామికవేత్త పీవీఎల్ నరసింహరాజుకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలతోపాటు టికెట్‌ కూడా ఇచ్చింది. కానీ టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు చేతిలో పీవీఎల్ ఘోరంగా ఓడిపోయారు. అయితే పీవీఎల్‌ వ్యవహారశైలితో పార్టీలో వర్గపోరు మొదలైంది. పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామ కమిటీ కన్వీనర్ కలిదిండి శ్రీనివాసవర్మ వర్గం నరసింహరాజు వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.


పీవీఎల్ తీరుకు నిరసనగా ఆమరణ దీక్ష...

ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్న తమను కాదని, కొత్తగా వచ్చిన వారికి పదవులు, అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ అంశంపైనే మండల, గ్రామస్థాయి నాయకులు రుసరుసలాడుతున్నారు. పీవీఎల్‌ తీరును ఖండిస్తూ గొల్లలకోడేరులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి నిరసన తెలిపారు. దాంతో పీవీఎల్ తన అనుచరులతో ఆ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించారు. ఈ చర్యకు నిరసనగా శ్రీనివాసవర్మ తన ఇంట్లో ఆమరణ దీక్షకు దిగారు. 


సర్దిచెప్పలేక నానాతంటాలు పడుతున్నారట...

మరోవైపు పీవీఎల్‌ అనుకూల వర్గం మరొకటి తెరపైకి రావడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. గ్రామాభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో లక్షల రూపాయలు శ్రీనివాసవర్మ సొంతానికి వాడేసుకున్నారని ఆరోపించింది. ఇలా గ్రూప్ తగాదాలు తీవ్రరూపం దాల్చుతుండటంతో దిద్దుబాటు చర్యలను హైకమాండ్ చేపట్టింది‌. సమస్యలు పరిష్కరించుకుందాం అంటూ శ్రీనివాసవర్మ దీక్షను విరమింపజేశారు ఎమ్మెల్యే గ్రంధి. ఆ తర్వాత ఆయనతోపాటు పీవీఎల్ నరసింహారాజులు శ్రీనివాస వర్మ ఇంటికెళ్లి బుజ్జగించారట. ఇక నుంచి విభేదాలకు తావులేకుండా అంతా ఐక్యంగా పనిచేద్దామని సూచించడంతో వర్మ వెనక్కి తగ్గారట. ఏదో ఒక గొడవతో సొంత పార్టీ నేతలే కుమ్ములాటలకు దిగుతుండటంతో పార్టీ పెద్దలు సర్దిచెప్పలేక నానాతంటాలు పడుతున్నారట. ఈ వర్గపోరు సమస్య ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Updated Date - 2020-10-03T17:09:46+05:30 IST