వైసీపీ నేత పీవీపీ వీరంగం

ABN , First Publish Date - 2020-06-25T07:23:49+05:30 IST

వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) హైదరాబాద్‌లో వీరంగం సృష్టించారు. తన నుంచి విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై ..

వైసీపీ నేత పీవీపీ వీరంగం

విల్లా కొనుగోలుదారునిపై దౌర్జన్యం

రౌడీలతో వెళ్లి సామగ్రి ధ్వంసం.. బెదిరింపు

హైదరాబాద్‌లో ఘటన.. అరెస్టు


హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) హైదరాబాద్‌లో వీరంగం సృష్టించారు. తన నుంచి విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాదాపు 20 మంది రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి, సదరు కొనుగోలుదారుణ్ని చంపేస్తానని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన కొనుగోలుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లో ‘ప్రేమ్‌ పర్వత్‌ విల్లాస్‌’ పేరిట పీవీపీ కొన్ని నిర్మాణాలు చేశారు. వీటిలో ఓ విల్లాను 4 నెలల కిందట విక్రమ్‌ కైలాస్‌ అనే వ్యాపారి కొనుగోలుచేశారు. అనంతరం, ఆయన తన విల్లాను ఆఽధునీకరించాలని భావించి పనులు మొదలు పెట్టారు. అయితే, ఈ ఆధునీకరణ పనులతో తన ఇంటి ఎలివేషన్‌ దెబ్బతింటోందని, పనులు ఆపేయాలని పీవీపీ హెచ్చరించారు.


అంతటితో ఆగకుండా బుధవారం ఉదయం తన అనుచరులైన రౌడీలతో కలిసి పనులు జరుగుతున్న విక్రమ్‌ విల్లా వద్దకు వచ్చారు. నిర్మాణ సామగ్రిని దించుతున్న వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న విక్రమ్‌ కైలాస్‌.. ఏమైందంటూ పీవీపీని ప్రశ్నించారు. దీంతో.. తాను విల్లాను ఎలా అమ్మానో అలాగే ఉంచాలని, ఆఽధునీకరించేందుకు వీల్లేదని పీవీపీ హుకుం జారీ చేశారు. అంతేకాకుండా, ఇంట్లోకి  అక్రమంగా ప్రవేశించి, సామగ్రిని ధ్వంసం చేశారు. పనులు ఆపకపోతే చంపేస్తానని విక్రమ్‌ కైలా్‌సను బెదిరించారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదుతో పీవీపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో మరో 9 మందిని నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసి ఓడిపోయారు.

Updated Date - 2020-06-25T07:23:49+05:30 IST