రెచ్చిపోతున్న వైసీపీ నేతలు!

ABN , First Publish Date - 2020-09-05T12:51:46+05:30 IST

వారి అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదు.. వారి మాటకు ఎదురుచెప్పేవారుండకూడదు.. వారి అడుగులకు మడుగులొత్తాలి.. లేకుంటే బెదిరిస్తారు.

రెచ్చిపోతున్న వైసీపీ నేతలు!

వారి అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదు.. వారి మాటకు ఎదురుచెప్పేవారుండకూడదు.. వారి అడుగులకు మడుగులొత్తాలి.. లేకుంటే బెదిరిస్తారు. అప్పటికీ దారికి రాకుంటే దాడులు చేస్తారు.. పోలీసు కేసులు పెట్టించి వేధిస్తారు.. పోలీసులతో చావచితక్కొట్టిస్తారు.. జిల్లాలో వైసీపీ నేతల తీరిది. వారి గూండాగిరికి ఓ యువకుడు బలయ్యాడు. నిన్నకాక మొన్న కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టులో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్న వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఓ యువకుడిపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలు.. తాజాగా పరిటాలకు చెందిన మున్నంగి రాజశేఖర్‌ రెడ్డిని బలిగొన్నారు.


కృష్ణా : కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన మున్నంగి రాజశేఖర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవటానికి గ్రామానికి చెందిన వైసీపీ నేత కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం గ్రామంలో పేకాట ఆడుతుండగా రాజశేఖర్‌రెడ్డిని, మరో ఆరుగురిని కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించిన తర్వాత ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు తమ వద్దనే ఉంచుకుని, ఏడుగురు నిందితులను ఆ రోజు రాత్రే జామీనుపై విడిచిపెట్టారు.


నిందితుల్లో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు పెద్దగా స్పందించలేదు. దీంతో నిందితుల విడుదల విషయంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు చొరవ తీసుకున్నారు. గురువారం ఉదయం ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు తీసుకున్న తర్వాత, మండలంలో ఓన్లీ వన్‌ నాయకుడు కోగంటి బాబు అంటూ రాజశేఖర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టింగ్‌ గ్రామానికి చెందిన వైసీపీ నేతకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి ఆ పోస్టింగ్‌ పెట్టిన వారిని స్టేషన్‌కు పిలిపించాలని హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులు అదే రోజు సాయంత్రం ఏడుగురు నిందితులను మళ్లీ స్టేషన్‌కు పిలిపించారు. పోస్టింగ్‌ గురించి వివరాలు అడిగిన పోలీసులు, ఆ పోస్టును రాజశేఖర్‌రెడ్డి పెట్టినట్టు గుర్తించి, అతన్ని చావచితక్కొట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజశేఖర్‌ రెడ్డి స్నేహితులకు ఫోన్‌ చేసి, పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని, ఇదే చివరి మాటంటూ ఫోన్‌ పెట్టేశాడు. అవమానభారంతో నేరుగా విజయవాడ చేరుకుని, అర్ధరాత్రి సమయంలో కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కొట్టటం వెనుక సదరు వైసీపీ నేత హస్తం ఉందంటూ బాధితుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తమకు ఏ నాయకుడూ ఫోన్‌ చేయలేదని చెబుతున్నారు. రాజశేఖర్‌రెడ్డిని తాము కొట్టలేదని, పరిటాల సమస్యాత్మక గ్రామం కావటంతో పోస్టింగ్‌లతో లేనిపోని వివాదాలు సృష్టించవద్దని చెప్పి పంపించామంటున్నారు.


జాతీయ రహదారిపై రాస్తారోకో

పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న మున్నంగి రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు, గ్రామస్థులు శుక్రవారం సాయంత్రం పరిటాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విజయవాడలో పోస్టుమార్టం అనంతరం రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇక్కడకు తీసుకువచ్చారు. మృతదేహంతో  గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై  బైఠాయించటంతో రెండు వైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే సౌమ్య కూడా పాల్గొన్నారు. నాయకులు నచ్చజెప్పటం, విచారించి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నందిగామ డీఎస్‌పీ జీవీ రమణమూర్తి హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ సంఘటనకు సంబంధించి విజయవాడ, కంచికచర్లలో కేసులు నమోదు అయ్యాయని, సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.


తెల్లారి ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. 

ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర్‌రెడ్డి ఈ నెల ఐదో తేదీన ఉద్యోగంలో చేరాల్సి ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాజశేఖర్‌రెడ్డిని తాత కృష్ణారెడ్డి, నాయనమ్మ కస్తూరమ్మ పెంచారు. డిగ్రీ చదివాడు. విజయవాడలో ఒక రెస్టారెంట్‌లో పనిచేసేవాడు. కరోనా లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. హైదరాబాదులో ఒక రెస్టారెంట్‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడ చేరాల్సి ఉండగా, ఈ దారుణం జరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పనిచేసిన రాజశేఖర్‌రెడ్డికి ఎవరితో గొడవలు లేవని, సౌమ్యుడైన ఇతడు పోలీసుల దెబ్బలతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్థులు చెబుతున్నారు.


ఆత్మహత్యకు ప్రయత్నించిన మేనత్త

తన మేనల్లుడు ఇక లేడనే చేదు నిజాన్ని భరించలేక రాజశేఖర్‌రెడ్డి మేనత్త సరస్వతి శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కంచికచర్లలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించటంతో ప్రాణాపాయం తప్పింది. మేనల్లుడి ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-09-05T12:51:46+05:30 IST