పోలవరంపై వైసీపీ సేఫ్ గేమ్.. తప్పంతావాళ్లదే అంటూ..
ABN , First Publish Date - 2020-10-27T16:49:15+05:30 IST
పోలవరం రాజకీయం రసకందాయంలో పడింది.

అమరావతి: పోలవరం రాజకీయం రసకందాయంలో పడింది. ఏపీ జీవనాడి ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మాత్రమే నిధులు ఇస్తామని, భూసేకరణ, పునరావాసంతో తమకు సంబంధంలేదని కేంద్రం తేల్చి చెప్పడంతో అధికారపార్టీ అత్మరక్షణలో పడింది. తప్పంతా గత ప్రభుత్వం టీడీపీదేనని నిందమోపి.. రాజకీయంగా టీడీపీని డిఫెన్స్‌లో పెట్టాలని, తమ వైపు నుంచి సేఫ్ గేమ్ ఆడాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ వేయడంతో సీన్ హీటెక్కింది.
ఏపీలో పోలవరం విషయం హాట్ టాపిక్‌గా మారింది. 2013-14లో ఆమోదించిన డీపీఆర్ రూ. 20వేల కోట్లు మాత్రమే భర్తిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పోలవరం ప్రాజెక్టు అధారిటీకి వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. 2016-17లో ప్రాజెక్టు అంచనాల్లో టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచాలని నిర్ణయించింది. ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అయ్యే మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పడంతో ప్రాజెక్టు భూసేకరణ పునరావాసం కోసమయ్యే మొత్తాన్ని రూ. 35వేల కోట్లుగా అంచనా వేసి.. మొత్తం రూ. 55వేల కోట్లకు సవరించిన డీపీఆర్‌ను టీడీపీ ప్రభుత్వం పంపింది. 2019లో ఈ డీపీఆర్‌ను సాంకేతిక సలహా మండలి ఆమోదించి ఆర్థిక శాఖకు పంపింది. భూసేకరణ వ్యయాన్ని తగ్గించి కేంద్ర ఆర్థిక శాఖ రూ. 47వేల కోట్లకు సవరించిన డీపీఆర్‌ను ఆమోదించింది. ఇదే విషయాన్ని అటు రాజ్యసభలో.. ఇటు లోక్ సభలోనూ ప్రకటించింది. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని మాత్రమే భరిస్తామని కేంద్రం మెలిక పెట్టడంతో ఏపీ ప్రభుత్వం ఇరుకున పడింది.