-
-
Home » Andhra Pradesh » ycp ap news
-
చీరాల వైసీపీలో చిచ్చు
ABN , First Publish Date - 2020-12-15T09:53:52+05:30 IST
ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం రాజకీయరగడగా మారింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్

కరణం- ఆమంచి వర్గాల బాహాబాహీ
మోపిదేవి సమక్షంలోనే దాడులు, ఐదుగురికి గాయాలు
వాడరేవులో కృష్ణమోహన్‌ను నిలదీసిన మత్స్యకార మహిళలు
చీరాల, డిసెంబరు 14: ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం రాజకీయరగడగా మారింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. సాక్షాత్తూ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సమక్షంలో దాడులకు తెగబడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. సముద్రంలో వేటాడే వలల విషయమై వివాదం నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ చీరాల మండలం వాడరేవుపై వేటపాలెం మండలం కఠారివారిపాలెం మత్స్యకారులు దాడిచేశారు. ఈ సందర్భంగా వాడరేవుకు చెందిన 13 మంది మత్స్యకారులు గాయపడ్డారు. వీరిని పరామర్శించడంతోపాటు, రెండు గ్రామాల వారితో మాట్లాడేందుకు మోపిదేవి వెంకటరమణ సోమవారం చీరాల వచ్చారు. కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, పోతుల సునీత, కరణం వెంకటేష్, డాక్టర్ వరికూటి అమృతపాణి తదితరులతో కలసి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారులను పరామర్శించారు. ఆ తరువాత మోపిదేవి కాన్వాయ్ వాడరేవు వెళుతున్న సమయంలో ప్రసాదనగరం దాటిన తరువాత ఒకరి వాహనాలు ఒకరు అధిగమించే సమయంలో బలరాం, ఆమంచి వర్గాల మధ్య వివాదం తలెత్తి, కొట్లాటకు దారితీసింది.
కరణం వెంకటేష్ కారులో నుంచి దిగిన ముగ్గురు తమను కొట్టారని చీరాల ఏరియా వైద్యశాల అవుట్‌పోస్టు పోలీసులకు ఆమంచి వర్గీయులు బజ్జిబాబు, సతీష్ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మోపిదేవి, ఇతర నాయకులు వాడరేవు చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ‘గ్యాంగ్‌ను పంపించావు, కొట్టించావు!’ గందరగోళం సృష్టించి, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావా!’ అంటూ ఆమంచిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మోపిదేవి వారికి సర్దిచెప్పి త్వరలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి శాంతపరిచారు. అక్కడి నుంచి నేతలంతా కఠారివారిపాలెం వెళ్లే సమయంలో బలరాం అనుచరుడు శివాజీ అనే యువకుడిని ఆమంచి అనుచరులు కొట్టి గాయపరిచారు. ఈ మేరకు శివాజీ చీరాల ఏరియా వైద్యశాల అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తరువాత కఠారివారిపాలెంలో మోపిదేవి మత్స్యకారులతో మాట్లాడుతూ సీఎం జగన్ పంపితే తాను సమస్య పరిష్కరించటానికి వచ్చానని, ఆయన అండగా ఉంటారని చెప్పారు. త్వరలో ఇరుగ్రామాల పెద్దలు, ముఖ్యులతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతవరకు సంయమనం పాటించాలని సూచించారు. ఆయన మాట్లాడుతున్న ససమయంలో అక్కడికి కొంతదూరంలో బలరాం అనుచరుడు అంజిరెడ్డిపై ఆమంచి వర్గీయులు దాడిచేశారు. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి అనుచరులు రామన్నపేటలో వెంకటస్వామిరెడ్డి అనే ఆమంచి అనుచరుడిని కొట్టారు. అయితే ఈ రెండు ఘటనలను పోలీసులు ధ్రువీకరించలేదు.