-
-
Home » Andhra Pradesh » yanamala ramakrishnudu
-
‘ఎన్నికలపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప...’
ABN , First Publish Date - 2020-12-06T16:56:41+05:30 IST
‘ఎన్నికలపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప...’

అమరావతి: ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కానీ...ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని రాజ్యాంగంలో లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక ప్రభుత్వం ఎన్నికల మధ్యలో జోక్యం చేసుకోరాదని సూచించారు. ఎన్నికలపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప...ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పలేదన్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలని తీర్మానం చేయడం కోర్టు ధిక్కరణే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో శాసన సభ పాత్ర ఏమీ ఉండదని పేర్కొన్నారు.
ఇది రాజ్యాంగపరమైన అంశం దీనిపై అసెంబ్లీ సవరణ చేయలేదన్నారు. రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వలేరని ఆయన చెప్పారు. రాజ్యాంగమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తినిచ్చిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా ప్రభుత్వం మరో వింత సంప్రదాయానికి తెరదీసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వితండ చర్యలతో ఉన్మాద చేష్టలతో వ్యవస్థల విచ్ఛిన్నమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.